విశాఖ సాక్షిగా.. దేశీయ శౌర్య ప్రతాపం | Indian Navy to Commission Diving Support Vessel Nipun | Sakshi
Sakshi News home page

విశాఖ సాక్షిగా.. దేశీయ శౌర్య ప్రతాపం

Aug 30 2026 4:19 AM | Updated on Aug 30 2026 4:19 AM

Indian Navy to Commission Diving Support Vessel Nipun

భారతావని రక్షణకు సరికొత్త జల కవచం ‘ఐఎన్‌ఎస్‌ నిపుణ్‌’

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ‘హెచ్‌ఎస్‌ఎల్‌’లో రూపొందిన యుద్ధనౌక

సముద్రపు లోతుల్లో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించనున్న ‘నిపుణ్‌’

రేపు జాతికి అంకితం చేయనున్న భారత నౌకాదళం

సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యంగా, పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో విశాఖలో రూపుదిద్దుకున్న ‘ఐఎన్‌ఎస్‌ నిపుణ్‌’యుద్ధ నౌక సేవలందించేందుకు సిద్ధమైంది. అణువణువూ దేశీయ సాంకేతికతతో, డిజైన్‌ నుంచి కమిషనింగ్‌ వరకు ప్రతి అంచెలోనూ భారతీయ నైపుణ్యాన్ని చాటిచెబుతున్న ఈ నౌకను ఈ నెల 31న నౌకాదళం జాతికి అంకితం చేయనుంది. 

దేశీయంగా తయారైన రెండో డైవింగ్‌ సపోర్ట్‌ వెజల్‌(డీఎస్‌వీ)గా రికార్డు సృష్టించిన నిపుణ్‌ రాకతో సముద్రగర్భంలో భారత నౌకాదళ ఆపరేషన్ల సామర్థ్యం మరింత బలోపేతం కానుంది.సముద్రగర్భంలో గాలింపు, రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఒక ప్రత్యేక నౌకను నిర్మించడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. దీన్ని విశాఖలోని హిందూస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌(హెచ్‌ఎస్‌ఎల్‌) వేదికగా వేలా­ది మంది కార్మికులు, ఇంజనీర్లు అహోరాత్రులు శ్రమించి ఈ ప్రాజెక్టును సాకారం చేశారు. కేవలం ఉపరితల గస్తీ కోసం కాకుండా, సముద్రపు అడుగుభాగంలో కఠినమైన ఒత్తిడిని తట్టుకునేలా డీప్‌ సీ డైవింగ్‌ సిస్టమ్‌ని ఈ నౌకలో సమకూర్చడం విశేషం. 

2018లో ఈ డైవింగ్‌ సపోర్ట్‌ నౌకల ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ షిప్‌యార్డుతో ఒప్పందం కుదుర్చుకోగా, రూ.2,399 కోట్ల భారీ వ్యయంతో ఈ రెండు నౌకల నిర్మాణ పనులను చేపట్టారు. అందులో మొదటిది..నిస్తార్‌ కాగా..రెండోది నిపుణ్‌. కోవిడ్‌ వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ, సప్లైచైన్‌లో అంతరాయాలు ఏర్పడినా ఎక్కడా పనులు ఆగిపోకుండా ఎప్పటికప్పుడు సవాళ్లను అధిగవిుస్తూ, నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకుండా ఈ నౌకను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దారు.

శతృ నాశనిగా.. సహాయకారిగా..!
నిపుణ్‌ వార్‌షిప్‌ శతృ నాశనిగా మాత్రమే కాకుండా.. సహాయకారిగా సేవలందించనుంది. జలాంతర్గాములు ప్రమాదానికి గురైనప్పుడు అత్యవసర ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు, సముద్రగర్భంలో లోతైన డైవింగ్‌ ఆపరేషన్లకు నిపుణ్‌ ఒక సంజీవనిలా పనిచేస్తుంది. శత్రువుల కదలికలను పసిగట్టేందుకు సముద్రగర్భంలో సెన్సార్లు, కేబుల్స్‌ అమర్చడం వంటి కీలక విధులనూ ఇది నిర్వర్తించగలదు. కేవలం ఒక యుద్ధనౌకగా మాత్రమే కాకుండా, సంక్లిష్టమైన రక్షణ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ధి దిశగా భారత్‌ వేస్తోన్న బలమైన అడుగులకు ఐఎన్‌ఎస్‌ నిపుణ్‌ ఒక సజీవ సాక్ష్యంగా నిలవనుంది. 

నిస్తార్‌ ఇచ్చిన ఏడాదిన్నర కాలంలోనే.!
గతేడాది ఇదే కేటగిరీకి చెందిన ‘ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌’నౌకను అందించిన షిప్‌యార్డ్‌..సరిగ్గా ఏడాది వ్యవధిలోనే రెండో నౌక ’నిపుణ్‌’ను అందించడం ద్వారా జాతీయ ప్రాధాన్యత కలిగిన క్లిష్టమైన డిఫెన్స్‌ ప్లాట్‌ఫారమ్‌ల నిర్మాణంలో తన సామర్థ్యాన్ని మరోసారి చాటుకుంది. దేశీయ రక్షణ నౌకా నిర్మాణ రంగంలో భారత్‌ సాధిస్తోన్న ప్రగతికి, స్వదేశీ పరిజ్ఞాన శక్తికి నిపుణ్‌ అప్పగింత..నిదర్శనంగా నిలిచింది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఐఎన్‌ఎస్‌ నిపుణ్‌ యుద్ధ నౌక, భారత నౌకాదళానికి సంబంధించి నీటి అడుగున జరిగే రక్షణ, సహాయక చర్యల విభాగాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్లనుంది.

 డైనమిక్‌ పొజిషనింగ్, శాచ్యురేషన్‌ డైవింగ్, సబ్‌మెరైన్‌ రెస్క్యూ నిర్వహణ, సముద్రపులోతుల్లో అంతరాయాల నిరోధించే అత్యాధునిక సామర్థ్యాలతో దీన్ని నిర్మించారు. తొలిసారిగా నిస్తార్, నిపుణ్‌ యు­ద్ధ నౌకల్లో 3 మెగావాట్ల డీజిల్‌ జనరేటర్‌ని ఏర్పాటు చేసి హెచ్‌ఎస్‌ఎల్‌ చారిత్రక అధ్యాయాన్ని లిఖించింది. సముద్ర గర్భంలో జరిగే సంక్లిష్టమైన రక్షణ ఆపరేషన్లను ఏకకాలంలో నిర్వహించగల సమగ్ర వేదికగా ‘నిపుణ్‌’రక్షణ రంగానికి సుదీర్ఘ సేవలు అందించనుందని షిప్‌యార్డ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement