అల్లిపురం: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు డెత్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ చెక్కులను అందజేశారు. మొత్తం రూ.1.50 కోట్ల విలువైన చెక్కులను పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా కడంగి భారతి కుటుంబానికి రూ.10 లక్షలు, పీలా అనురాధ కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. పోలీసు సిబ్బంది కుటుంబాలకు అవసరమైన సమయంలో బ్యాంకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని యూనియన్ బ్యాంక్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పోలీసు శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు.


