వియన్నా: యూరప్‌లో సినీ ఫక్కీలో సాగుతున్న మ్యూజియం దోపిడీల పరంపరలో మరో ఘటన వెలుగుచూసింది. ఆస్ట్రియాలోని ‘మ్యూజియం ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్’ (ఎంఏకే)లో శుక్రవారం పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు సాధారణ సందర్శకుల్లా టికెట్లు కొనుగోలు చేసి లోపలికి ప్రవేశించి, సుమారు 200 క్యారెట్ల ప్లాటినం-వజ్రాల హారంతో ఉడాయించారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ కొన్ని మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.
ముఖానికి ఎలాంటి ముసుగులు లేకుండా వచ్చిన ఈ దుండగుల దృశ్యాలు అక్కడి నిఘా కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ప్రదర్శన హాలులోకి వెళ్లిన దుండగులు సుత్తితో డిస్‌ప్లే అద్దాల పెట్టెను పగులగొట్టి, ఆభరణాన్ని చేజిక్కించుకుని పరారయ్యారని పోలీసులు తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ డిజైనింగ్ సంస్థ ‘వాన్ క్లీఫ్ అండ్ ఆర్పెల్స్’ రూపొందించిన ఈ హారంలో మొత్తం 673 అరుదైన రత్నాలు ఉన్నాయి. ఈ సంస్థకు సంబంధించి జూన్ నుంచి ఇక్కడ ప్రదర్శిస్తున్న దాదాపు 500 కళాఖండాలలో ఇది అత్యంత ప్రధానమైనది. వాస్తవానికి సెప్టెంబర్ 27 వరకు కొనసాగాల్సిన ఈ ప్రదర్శనను చోరీ అనంతరం తాత్కాలికంగా మూసివేశారు.
ఈ విశిష్ట హారానికి ఘనమైన చరిత్ర ఉంది. 1939లో ఈజిప్ట్ యువరాణి ఫైజా, ఇరాన్ షా అయిన మహమ్మద్ రెజా పహ్లావీ వివాహం సందర్భంగా ఆమె తల్లి, ఈజిప్ట్ మాజీ రాణి నజ్లీ దీనిని ధరించారు. కాగా యూరప్ వ్యాప్తంగా ఇలాంటి దోపిడీలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత అక్టోబర్‌లో పారిస్‌లోని లూవ్రే మ్యూజియంలో కేవలం 8 నిమిషాల్లో 102 మిలియన్ డాలర్ల విలువైన నగల చోరీ జరగ్గా, స్పెయిన్‌లోని విల్లేనా మ్యూజియంలో గురువారం తెల్లవారుజామున నాలుగు నిమిషాల వ్యవధిలోనే దాదాపు 50కి పైగా చారిత్రక బంగారు వస్తువులను దుండగులు దోచుకెళ్లారు.
ఇది కూడా చదవండి: ట్రంప్ ఉక్కిరి బిక్కిరి.. చుట్టుముట్టిన అంతర్జాతీయ సంక్షోభాలు!


