భారీ వరదల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సహాయక చర్యల కోసం ఇతర దేశాల సాయం తమకేం అక్కర్లేదని తేల్చేసింది. అన్ని ప్రభుత్వ యంత్రాంగాలను సహాయక చర్యలకు రంగంలోకి దింపినట్లు ప్రధాని బాలేంద్ర షా వెల్లడించారు. తమ భద్రతా బలగాలే సమర్థంగా పని చేస్తున్నాయని.. అలాంటప్పుడు వేరే దేశాల అవసరం తమకు ఉండకపోవచ్చని నేపాల్ విదేశాంగ శాఖ అంటోంది. దీనికి స్పందించిన భారత్.. ఓ కీలక ప్రకటన చేసింది.
నేపాల్-టిబెట్ సరిహద్దులో బుధవారం ఆకస్మిక వరద పోటెత్తింది. ఎగువన ఉన్న గ్లేసియర్ కరిగిపోవడంతో.. బండరాళ్లు, బురదతో కూడిన వరద క్షణాల్లో ముంచెత్తడంతో పలు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. సహాయక చర్యలు కొనసాగుతుండగా.. ఇప్పటిదాకా 600 మృతదేహాలను వెలికి తీశారు. మరో 1,400 మంది జాడ తెలియాల్సి ఉంది. ఇందులో భారత్ సహా పలు దేశాలకు చెందిన యాత్రికులు కూడా ఉన్నారు.
ముఖ్యంగా నేపాల్‌లోని రసువా జిల్లాలో వరద బీభత్సం తీవ్రంగా ఉంది. పలు గ్రామాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోగా.. రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులకు భారీ నష్టం వాటిల్లింది. ఇంతకు ముందు వరద కారణంగా ఏర్పడిన మరో సరస్సు కట్టలు తెంచుకునే ప్రమాదం చైనా ఇప్పటికే నేపాల్‌ను హెచ్చరించింది. దీంతో మరోసారి జల ప్రళయం(మునుపటి కంటే ఐదు రెట్లు తీవ్రతతో..) రావొచ్చని ఆందోళనల నడుమ అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
భారత్ రియాక్షన్ ఇదే..
నేపాల్ విదేశీ రెస్క్యూ బృందాల అవసరం లేదని ప్రకటించినప్పటికీ.. భారత్ మాత్రం అవసరమైన సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. నేపాల్ అభ్యర్థన మేరకు.. అదనపు మానవతా సాయం, వైద్య బృందాలు, ఇంజినీరింగ్ సిబ్బంది, అవసరమైన పరికరాలను పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.
ఇప్పటికే రెండు విమానాల్లో సహాయక సామగ్రిని నేపాల్‌కు పంపినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మరో విమానం కూడా త్వరలో బయలుదేరనుంది. టన్నెల్ రెస్క్యూ టీమ్‌ను పంపేందుకు ముందుగా రెకీ బృందాన్ని పంపుతున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అక్కడి పరిస్థితిని పరిశీలించిన అనంతరం అవసరమైన పరికరాలను గుర్తించనున్నారు. అదేవిధంగా వైద్య బృందాన్ని పంపడంతోపాటు.. వరదల కారణంగా దెబ్బతిన్న రహదారి కనెక్టివిటీని పునరుద్ధరించేందుకు బెయిలీ(పోర్టబుల్) వంతెనలు, సాంకేతిక బృందాలను అందించేందుకు భారత్ ముందుకొచ్చింది.
బృందాలనూ పంపుతాం
సహాయక చర్యల్లో సహాయం చేసేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, అవసరమైన పరికరాలను పంపేందుకు భారత్ ప్రత్యేకంగా నేపాల్‌కు ప్రతిపాదన చేసినట్లు జైస్వాల్ వెల్లడించారు. దీనిపై నేపాల్ ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. విపత్తుతో ప్రభావితమైన ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
పలు దేశాల నుంచి సాయం ఆఫర్
నేపాల్ వరదల్లో తమ దేశాలకు చెందిన పౌరులు గల్లంతైన నేపథ్యంలో పలు దేశాలు సహాయక బృందాలను పంపేందుకు ముందుకొచ్చాయి. భారత్, చైనా, అమెరికా, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా, శ్రీలంక, బంగ్లాదేశ్ రెస్క్యూ బృందాలను పంపేందుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతానికి విదేశీ రెస్క్యూ బృందాల అవసరం లేదని నేపాల్ విదేశాంగ శాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛేత్రి తెలిపారు. తమ భద్రతా సంస్థలు ఇప్పటికే శోధన, రక్షణ చర్యలను చేపట్టాయని.. అవి సమర్థంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
చైనా సరిహద్దు ప్రాంతం కావడం వల్లేనా?
విదేశీ రెస్క్యూ బృందాలను అనుమతించకపోవడం వెనుక రసువా ప్రాంత భౌగోళిక ప్రాధాన్యత కూడా కారణమై ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రాంతం చైనా ఆధీనంలోని టిబెట్‌కు సమీపంలో ఉండటంతో.. విదేశీ బృందాల రాక సున్నితమైన అంశంగా మారి ఉండొచ్చని నేపాల్ మాజీ దౌత్యవేత్త దినేశ్ భట్టారాయ్ అభిప్రాయపడ్డారు. అయితే నేపాల్ విదేశాంగ శాఖ మాత్రం ఆ అభిప్రాయాన్ని తోసిపుచ్చింది.
‘సాయం పూర్తిగా వద్దనడం కాదు’
నేపాల్ అంతర్జాతీయ సాయాన్ని పూర్తిగా తిరస్కరించడం లేదని ఛేత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ భద్రతా వ్యవస్థ సమర్థంగా పనిచేస్తోందని, ఏదైనా ప్రత్యేక నైపుణ్యం లేదంటే సాంకేతిక సహాయం అవసరమైతే ఆయా దేశాలను తామే సంప్రదిస్తామని చెప్పారు.
వరదల్లో దక్షిణ కొరియాకు చెందిన పలువురు జలవిద్యుత్ ప్రాజెక్టు సిబ్బంది గల్లంతయ్యారు. నేపాల్ ప్రస్తుతం విదేశీ రెస్క్యూ బృందాలను అంగీకరించే పరిస్థితిలో లేదని తమకు సమాచారం అందినట్లు దక్షిణ కొరియా తెలిపింది. అయినప్పటికీ నేపాల్‌తో చర్చలు కొనసాగిస్తామని పేర్కొంది. మానవతా సాయం కింద 10 లక్షల డాలర్లను అందించనున్నట్లు ప్రకటించింది.
ఆ వెంటనే యూటర్న్.. విదేశీ బృందాలకు ఓకే!
విదేశీ రెస్క్యూ బృందాల సాయం అవసరం లేదన్న నేపాల్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. అంతర్జాతీయ ఒత్తిడి, పెద్ద సంఖ్యలో విదేశీయులు గల్లంతైన నేపథ్యంలో పరిమిత స్థాయిలో విదేశీ నిపుణులను అనుమతించింది. భారత్, చైనా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా నుంచి నిపుణులు టన్నెల్ రెస్క్యూ, డీఎన్‌ఏ పరీక్షలు, ఫోరెన్సిక్ గుర్తింపు ప్రక్రియల్లో సహకరించనున్నారు. ఇదిలా ఉండగా.. భారత్ ఇప్పటికే వైద్య, టన్నెల్ రెస్క్యూ బృందాలతో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్ సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది.
ఇదీ చదవండి: ఫరక్కా డెడ్‌లైన్.. మరో జల యుద్ధం తప్పదా?


