నేపాల్‌ను భీకర వరద కుదిపేసిన నాలుగు రోజుల తర్వాత కూడా అక్కడి పరిస్థితి హృదయవిదారకంగానే ఉంది. ఇంకా రెండు వేల మందికి పైగా ఆచూకీ తెలియరావాల్సి ఉండగా.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నదులు, బురద, శిథిలాల నుంచి వరుసగా మృతదేహాలు బయటపడుతుండటంతో ఆస్పత్రులు, మార్చురీలు నిండిపోయాయి.
నేపాల్ ఆకస్మిక వరదలు మహా విషాదాన్ని మిగిల్చేలా కనిపిస్తోంది. బోటె కోషి వరదల ఉధృతికి కొట్టుకుపోయిన మృతదేహాలు త్రిశూలి, నారాయణి నదుల వెంట దిగువ ప్రాంతాలకు చేరుతున్నాయి. ఒక్క చిత్వన్‌లోనే శనివారం ఉదయానికి 233 మృతదేహాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. నౌవల్పరాసి తూర్పులో మరో 158, గోర్ఖాలో 48, నౌవల్పరాసి పశ్చిమలో 47 మృతదేహాలు వెలుగుచూశాయి. వందలాది మంది జాడ తెలియరాకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఆస్పత్రుల్లో స్థలం లేక..
నేపాల్-టిబెట్ పరిసరాల్లోని ఆస్పత్రుల్లో మార్చురీల సామర్థ్యం 350 మృతదేహాలుగా తెలుస్తోంది. ఈ తరుణంలో సామర్థ్యం మించిపోవడంతో మృతదేహాలను ఇతర భవనాలకు తరలిస్తున్నారు. మృతదేహాలను భద్రపరిచేందుకు భారత్‌పూర్ సహా పలు ప్రాంతాల్లో తాత్కాలిక కేంద్రాలను(బాడీ మేనేజ్‌మెంట్ సెంటర్లు) ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కొన్ని చోట్ల టెంట్ల కింద కూడా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమ్యూనిటీ హాళ్లు, పోలీస్ ప్రాంగణాలు, ఇతర భవనాలను తాత్కాలిక మార్చురీలుగా మార్చేసినట్లు అక్కడి అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే కోల్డ్ స్టోరేజీ కొరత, హఠాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలు మృతదేహాలను భద్రపరచడం అధికారులకు మరో పెద్ద సవాలుగా మారాయి.
ఎవరో గుర్తించడమే కష్టం..
చాలా మృతదేహాలు బురద, శిథిలాల్లో తీవ్రంగా దెబ్బతినడంతో ముఖాలను చూసి గుర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో అధికారులు మృతదేహాల ఫొటోలు తీస్తూ, శరీరంపై ఉన్న గుర్తులు, దుస్తులు, టాటూలు, ఆభరణాలు, వేలిముద్రలు నమోదు చేస్తున్నారు. అవసరమైన చోట డీఎన్‌ఏ నమూనాలను కూడా సేకరించి కుటుంబ సభ్యులతో సరిపోల్చే ప్రక్రియ చేపడుతున్నారు.
బంధువుల కోసం ఆర్తనాదాలు..
కళ్లెదుటే అయినవాళ్లు కొట్టుకుపోతుంటే.. నిస్సహాయంగా చూస్తున్న ఉండిపోయిన వాళ్లు అధికారులను బతిమాలుకుంటున్నారు. వాళ్ల ఆచూకీ చెప్పాలంటూ కన్నీళ్లతో వేడుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం నేపాల్‌లో వందలాది మంది ఇంకా గల్లంతై ఉండగా, మొత్తం విపత్తులో 2,000కుపైగా మంది ఆచూకీ తెలియడం లేదని తాజా నివేదికలు చెబుతున్నాయి. తాత్కాలిక బాడీ-మేనేజ్‌మెంట్ సెంటర్‌ల వద్ద తమ వారి కోసం కుటుంబ సభ్యులు ఫొటోలు, మొబైల్ చిత్రాలు పట్టుకుని తిరుగుతున్నారు.
మృతదేహాలపైనా దోపిడీ..
ఈ విపత్తు వేళ కొందరి అమానవీయ ప్రవర్తన కూడా వెలుగులోకి వచ్చింది. వరదలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం నుంచి చెవిపోగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ఘటన నేపాల్‌లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అయినా ఆ తతంగం ఆగడం లేదని తెలుస్తోంది. మరోవైపు నదుల్లో కొట్టుకొస్తున్న మృతదేహాలతో పాటు వస్తువులు, బ్యాగులు కూడా కనిపిస్తున్నాయి. వాటి నుంచి నగదు, నగల కోసం కొందరు పడవల్లో పరుగులు తీస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎటు చూసినా విషాదం, ఆర్తనాదాలు, మృతదేహాలే కనిపిస్తున్న దారుణ పరిస్థితి నెలకొంది.
ఇదీ చదవండి: ఆ సరస్సు నీటి రంగు మారింది.. చైనా వార్నింగ్


