భారీ ఆకస్మిక వరదల నుంచి తేరుకోకముందే నేపాల్‌ను మరో జలప్రళయం ముంచెత్తుందన్న హెచ్చరికలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. వరదల ధాటికి ఏర్పడిన సహజ సరస్సు నీటిమట్టం క్రమంగా పెరుగుతోందని చైనా హెచ్చరించింది. సరస్సులోని నీటి రంగు మరింత ముదురుతోందని.. ఇది కట్ట తెగే ప్రమాదానికి సంకేతం కావొచ్చని పేర్కొంది. ఎప్పుడైనా సరస్సు కట్టలు తెంచుకునే అవకాశం ఉందని నేపాల్‌ను అప్రమత్తం చేసింది. దీంతో సహాయక చర్యలకు, గల్లంతైన వాళ్ల కోసం కొనసాగుతున్న అన్వేషణకు తాజా వార్నింగ్ ఆటంకాలు కలిగిస్తోంది.
నేపాల్-టిబెట్ సరిహద్దులో బుధవారం దూసుకొచ్చిన ఆకస్మిక వరదలు ఘోర నష్టాన్ని కలిగించాయి. అయితే ఆ సమయంలో ఎగువ ప్రాంతంలో గ్లేసియర్ కూలిపోవడంతో భారీగా మంచు, బండరాళ్లు, మట్టి కిందికి కొట్టుకొచ్చాయి. దీంతో నదీ ప్రవాహానికి అడ్డుగా సహజ కట్ట ఏర్పడి.. దాని వెనుక బారియర్ సరస్సు ఏర్పడింది.
చైనా జలవనరుల శాఖ ప్రకారం.. శుక్రవారం నాటికి అందులో సుమారు 25 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరింది. మరో మూడు రోజుల్లో అదనంగా 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ సరస్సు చైనాలోని చోచెన్ నది, నేపాల్‌లోని పురేపు నది సంగమ ప్రాంతానికి సమీపంలో ఏర్పడింది. నీటిమట్టం క్రమక్రమంగా.. శరవేగంగా పెరుగుతుండటంతో దిగువ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చైనా సూచించింది.

కట్ట తెగితే.. 500 క్యూబిక్ మీటర్ల ప్రవాహం
ఈ సరస్సు ఏ క్షణాన అయినా కట్టలు తెంచుకోవచ్చని చైనా నిన్నటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే టిబెట్ ప్రాంతంలో సహాయక చర్యలను సైతం నిలిపివేసింది. సరస్సు కట్టలో కొంత భాగం తెగితే గరిష్ఠంగా సెకనుకు 500 క్యూబిక్ మీటర్ల నీరు నదిలోకి చేరొచ్చని అంచనా వేస్తోంది. ఇది మొన్న సంభవించిన వరద ఉధృతితో పోలిస్తే ఐదారు రెట్లు ఎక్కువ ఉండే చాన్స్ ఉందని తెలిపింది.
ఇప్పటికే సరస్సు నుంచి నీరు లెహెండే ఖోలా, త్రిశూలి నదుల్లోకి ప్రవహించడం ప్రారంభమైందని వెల్లడించింది. దీంతో డ్రోన్లు, ఉపగ్రహాల ద్వారా పరిస్థితిని చైనా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు నేపాల్ అధికారులు కూడా నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను, సహాయక బృందాలను అప్రమత్తం చేశారు. నిన్నటి నుంచి పోలీసులు మైక్‌లలో చేస్తున్న హెచ్చరికలతో.. ఎత్తైన ప్రాంతాలకు తరలి పోతున్నారు.


600కు చేరువలో మృతుల సంఖ్య
ఆకస్మిక వరదలు నేపాల్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. రసువాతోపాటు మధ్య నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో గ్రామాలు, రహదారులు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. నేపాల్‌లో 600 మంది దాకా మృతి చెందారు. 1,500 మందికి గాయాలు అయ్యాయి. సహాయక చర్యలు ముందుకు వెళ్తున్నా కొద్దీ.. మృత దేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మరోవైపు.. భారత సరిహద్దు వైపునకు కూడా కొన్ని మృతదేహాలు, బ్యాగులు కొట్టుకువస్తున్నాయి. దాదాపు 2,500 మంది గల్లంతైనట్లు తాజా సమాచారం. ఈ విపత్తుతో 90 వేల మందికిపైగా ప్రభావితమైనట్లు రెడ్‌క్రాస్ అంచనా వేసింది.
2,000 people now missing in Nepal as death toll from floods hits 579.
Nepali authorities say they’re monitoring two lakes upstream from the main flood zone, one of which has begun overflowing. pic.twitter.com/4cyByjJ1Yx— 𓂀 𝕋𝔼𝔸ℍ 𓂀 (@TeahCartel) August 28, 2026
అటు టిబెట్‌లోనూ వరదలు బీభత్సం సృష్టించాయి. అక్కడ పలువురు మృతి చెందగా.. వందలాది మంది గల్లంతయ్యారు. వీరిలో విదేశీయులు కూడా ఉన్నారు. ముఖ్యంగా కైలాస్–మానస సరోవర్ యాత్రకు వెళ్లిన భారతీయుల ఆచూకీపై ఆందోళన కొనసాగుతోంది.
టన్నెళ్లలో వందలమంది?
భారీ వరదలకు నేపాల్‌లోని 13 జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సుమారు 933 మంది కార్మికులు గల్లంతైనట్లు ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తెలిపింది. వీరిలో కొందరు టన్నెళ్లలో చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క అప్పర్ త్రిశూలి–1 ప్రాజెక్టులోనే 576 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడం.. మొబైల్, టెలిఫోన్ నెట్‌వర్క్‌లు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇప్పటివరకు మూడు డజన్లకుపైగా వంతెనలు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు.
భారత్ నుంచి భారీ సాయం
విపత్తు నేపథ్యంలో ఇతర దేశాల సాయం వద్దన్న నేపాల్.. కొద్దిగంటల్లోనే మనసు మార్చుకుంది. ధ్వంసమైన రవాణా మార్గాలను పునరుద్ధరించేందుకు 42 బెయిలీ వంతెనలు(తాత్కాలిక) నిర్మించేందుకు భారత్, చైనా సాయాన్ని నేపాల్ కోరింది. ఇటు భారత్ ఇప్పటికే నేపాల్‌కు సహాయక సామగ్రిని పంపింది. వైద్య సిబ్బంది, టన్నెల్ రెస్క్యూ నిపుణులు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపేందుకు కూడా ముందుకొచ్చింది.
ప్రస్తుతం వేలాది మంది ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుండగా.. మరోవైపు సహజ సరస్సు ఎప్పుడైనా కట్టలు తెంచుకునే అవకాశం ఉందన్న చైనా హెచ్చరిక నేపాల్‌లో కొత్త ఆందోళనకు కారణమైంది. దీంతో బోటెకోషి, త్రిశూలి నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.
ఇదీ చదవండి: చైనా బార్డర్ వల్లే నేపాల్ సంచలన నిర్ణయం?


