నేపాల్‌లో సంభవించిన వరదలు తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. భారత్‌కు చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ ‘ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్’ (ఐపీఎస్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) లక్ష్మీనాథ్ గోపిశెట్టి(లక్ష్ గోపిశెట్టి) ఈ వరదల ధాటికి ఆచూకీ లేకుండా పోయారు. ఆయనతో సంప్రదింపులు తెగిపోవడంతో ప్రస్తుతం ఆయన జాడ కనిపించకుండా పోయిందని ఇన్ఫోసిస్ అధికారికంగా ధ్రువీకరించింది.
గోపిశెట్టి వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్ ప్రాంతానికి వెళ్లినట్లు సంస్థ తెలిపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఆయనను గుర్తించి సంప్రదించేందుకు స్థానిక యంత్రాంగం, సంబంధిత దౌత్య వర్గాలతో కలిసి శ్రమిస్తున్నామని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆయన భద్రత, క్షేమానికే తమ తొలి ప్రాధాన్యమని పేర్కొన్న ఇన్ఫోసిస్, గోపిశెట్టి కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిలో సహకారాలు అందిస్తున్నట్లు తెలిపింది.
అమెరికా, కెనడాల్లోని పబ్లిక్ సెక్టార్ రంగానికి ఐటీ మౌలిక వసతులు, డిజిటల్ సొల్యూషన్స్ అందించే ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్ విభాగానికి గోపిశెట్టి నాయకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన యాక్సెంచర్, ఐబీఎమ్, హెచ్‌సీఎల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో కీలక పదవులు నిర్వహించారు.
ఇదీ చదవండి: యూట్యూబ్‌తో అమెజాన్ చేతులు


