నీతులు చెప్పే చైనాకు.. బాన్కియావో ఘోరకలి గుర్తుందా? | Banqiao Chinas Forgotten Water Tragedy: 62 Dams Collapsed in One Night | Sakshi
Sakshi News home page

నీతులు చెప్పే చైనాకు.. బాన్కియావో ఘోరకలి గుర్తుందా?

Aug 28 2026 1:51 PM | Updated on Aug 28 2026 2:00 PM

Banqiao Chinas Forgotten Water Tragedy: 62 Dams Collapsed in One Night

హిమాలయ ప్రాంతంలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్న వేళ.. చైనా తీరు వివాదాస్పదంగా మారింది. ఫ్లాష్‌ఫ్లడ్స్‌ గురించి సమాచారం ఉన్నప్పటికీ చైనా తమను హెచ్చరించలేదని నేపాల్‌ ఆరోపించింది. అయితే చైనా మాత్రం ఆ ఆరోపల్ని ఖండించింది. ఇలాంటి సమయంలో ఆరోపణలు కాదని.. ఇరు దేశాలు పరస్పర సహకారంతో పనిచేయాలని.. ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఉండాలని సూచించింది. దీంతో చైనా చెబుతున్న సహకార నీతుల నేపథ్యంలో గతంలో అదే గడ్డపై జరిగిన అతిపెద్ద డ్యామ్‌ విపత్తు మరోసారి చర్చకు వచ్చింది.

బుధవారం నేపాల్‌లోని పలు జిల్లాలను ఆకస్మిక వరద ముంచెత్తింది. ఇళ్లు, దుకాణాలు, రహదారులు, వంతెనలు.. ఊర్లకు ఊళ్లే వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. టిబెట్‌ సరిహద్దులోని చైనా రీజియన్‌లో మంచు ఫలకాలు కూలిపోవడం వల్ల భారీగా నీరు ఒక్కసారిగా దిగువకు వచ్చిందని ఓ అంచనాకు వచ్చారు. అదే సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో చైనా చేపడుతున్న మౌలిక వసతుల నిర్మాణాలపై కూడా నేపాల్‌లోని కొందరు నిపుణులు, జర్నలిస్టులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి హిమాలయ ప్రాంతంలో హిమానీనదాలు, హిమ సరస్సులు, కొండచరియలు, భారీ వర్షాలు, నదీ ప్రవాహాలపై ఎప్పటికప్పుడు సమాచారం ఉండటం దిగువ దేశాలకు అత్యంత కీలకం. టిబెట్‌లో చోటుచేసుకునే ప్రకృతి పరిణామాలు నేపాల్‌లోని నదులపై తక్కువ సమయంలోనే ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ప్రమాదకర పరిస్థితి ఏర్పడిన వెంటనే దిగువ ప్రాంతాలకు హెచ్చరికలు పంపాల్సిన అవసరం ఉంది. ఇదే విషయంలో నేపాల్‌ ప్రధానంగా ప్రశ్నలు లేవనెత్తుతోంది.

చైనా చరిత్రలో మాయని మచ్చ
నేపాల్‌ ఆరోపణల నేపథ్యంలో.. 1975లో చైనాలో జరిగిన బాన్కియావో డ్యామ్‌(Banqiao Tragedy) విపత్తు మళ్లీ గుర్తుకొస్తోంది. హెనాన్‌ ప్రావిన్స్‌లోని రు నదిపై నిర్మించిన బాన్కియావో డ్యామ్‌ను వరద నియంత్రణ, సాగునీరు, విద్యుత్‌ ఉత్పత్తి కోసం నిర్మించారు. నిర్మాణం పూర్తయిన కొద్దికాలానికే డ్యామ్‌, గేట్లలో పగుళ్లు కనిపించడంతో సోవియట్‌ ఇంజినీర్ల సాయంతో మరమ్మతులు చేపట్టారు. అయితే ఆ తర్వాత అది ‘ఐరన్‌ డ్యామ్‌’గా పేరుపొందింది.

కానీ 1975 ఆగస్టులో టైఫూన్‌ నినా కారణంగా హెనాన్‌లో ఊహించని స్థాయిలో వర్షపాతం నమోదైంది. కేవలం మూడే రోజుల్లో.. ఏడాది మొత్తంలో కురిసే వర్షపాతం రికార్డైంది. దీంతో బాన్కియావో రిజర్వాయర్‌లోకి తీవ్ర ఉధృతిలో నీరు వచ్చి చేరింది. అయితే అప్పటికే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.

ఒక రాత్రిలో 62 డ్యామ్‌లు!
1975 ఆగస్టు 8 అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే బాన్కియావో డ్యామ్‌ తెగిపోయింది. భారీగా నీరు దిగువ ప్రాంతాలపైకి దూసుకొచ్చింది. బాన్కియావోకు సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిమాంటన్‌ డ్యామ్‌ కూడా దెబ్బతింది. అనంతరం వరుసగా అనేక చిన్న రిజర్వాయర్లు, డ్యామ్‌లు నాశనం అవుతూ వచ్చాయి. వాటిలో కొన్నింటిని వరద నీటి మల్లింపు కోసం కావాలనే ధ్వంసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలా మొత్తం 62 దాకా డ్యామ్‌లు నాశనం అయినట్లు తర్వాత వివిధ నివేదికలతో వెలుగులోకి వచ్చింది. 

2 లక్షల మందికిపైనే..
ఈ విపత్తులో మృతుల సంఖ్యపై ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. ఆ టైంలో చైనా మీడియా తీవ్రమైన గోప్యత ప్రదర్శించింది. అయితే వరదల కారణంగా 26 వేల మంది మరణించినట్లు 2017లో ప్రిన్స్‌టన్‌, సింఘువా విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం పేర్కొంది. కరువు, ఆకలి, అంటువ్యాధుల కారణంగా మరో లక్ష మందికి పైగా మరణించి ఉండొచ్చని ఆ అధ్యయనం అంచనా వేసింది.

అయితే మరికొన్ని అంచనాలు మాత్రం ఆ మరణాల సంఖ్య 2.3 లక్షల వరకు ఉండొచ్చని పేర్కొన్నాయి. ఈ సంఖ్యను కొందరు చైనా నిపుణులు అంచనా వేసినట్లు హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ నివేదికలు ప్రస్తావించాయి. మరణాల సంఖ్యను పక్కన పెడితే.. దాదాపు కోటి మంది ఈ విపత్తు ప్రభావానికి గురైనట్లు అంచనాలు ఉన్నాయి.

సమాచారం ఇవ్వక.. విషాదాన్ని దాచి!
బాన్కియావో విషాదంలో చైనాపై మరో తీవ్రమైన ఆరోపణ ఉంది. హెచ్చరికలు సరిగా చేరకపోవడం, అధికారుల నిర్ణయాల్లో జాప్యం, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతినడం కూడా విపత్తు తీవ్రతను పెంచినట్లు తరువాతి అధ్యయనాలు వెల్లడించాయి. అటుపై ఈ విపత్తు పూర్తి స్థాయిని ప్రపంచానికి వెల్లడించలేదని పలు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో డ్యామ్‌ల వైఫల్యం, ప్రాణనష్టం, సహాయక చర్యల దుస్థితి వంటి అంశాలు విస్తృతంగా బయటకు రావడానికి చాలా సంవత్సరాలే పట్టింది. 

ప్రస్తుతం నేపాల్‌–టిబెట్‌ సరిహద్దులో జరుగుతున్న పరిణామాలు ఈ పాత ఘటనతో ఈ పాతగాయం మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే నైతిక పాఠాలు చెప్పే చైనా.. తన పౌరుల భద్రతతో పాటు పొరుగు దేశాల ప్రజల ప్రాణాల విషయంలోనూ అదే పారదర్శకత, బాధ్యతను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ప్రకృతి విపత్తులు సరిహద్దులు చూడవు.. అలాంటి సమయంలో సమాచారం దాచడం కంటే, ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం, సహకారంతో వ్యవహరించడమే నిజమైన మానవత్వం. గత విషాదాల నుంచి పాఠాలు నేర్చుకుని.. భవిష్యత్తు ప్రమాదాలను తగ్గించడమే ప్రతి దేశం ముందున్న అసలైన బాధ్యత.

ఇదీ చదవండి: ఇరాన్‌ కళ్లుగప్పి అమెరికా అంత పని చేసిందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement