ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా కీలక ప్రకటన చేసింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఏర్పాటు చేసిన మందుపాతరలను(సీ మైన్స్) పూర్తిగా తొలగించినట్లు తెలిపింది. అమెరికా దళాలు అత్యంత రహస్య ఆపరేషన్ నిర్వహించి.. శ్రమించి వాటిని తొలగించాయని అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. ఈ చర్యను అమెరికా సైనిక కార్యకలాపాల్లో ‘మేజర్ మైలురాయి’గా అభివర్ణించారు.
హర్ముజ్‌పై పట్టు సాధించే క్రమంలో ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాల్లో సీ మైన్స్‌ను ఏర్పాటు చేసింది. వీటి కారణంగా అమెరికా బలగాల కదలికలు నిలిచిపోవడంతో పాటు వాణిజ్య నౌకల రాకపోకలకు తీవ్ర ముప్పు ఏర్పడింది. వాటిని తొలగించడమూ అంత సులువు కాదని.. చాలా సమయం పట్టొచ్చని అప్పట్లో చర్చలు నడిచాయి. ఈ క్రమంలో హర్ముజ్ బ్లాకేడ్(నిర్బంధం) కొనసాగిస్తున్న అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వీటి తొలగింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
అయితే ఇరాన్ ఏర్పాటు చేసిన సముద్రపు మైన్స్‌ను తొలగించేందుకు అమెరికా బలగాలు అత్యంత రహస్యంగా ఆపరేషన్ చేపట్టాయి. ముందుగా మైన్స్ ఉన్న ప్రాంతాలను గుర్తించి.. అమెరికా నేవీకి చెందిన ప్రత్యేక డైవింగ్ బృందాలను రంగంలోకి దించారు. సముద్రంలోకి వెళ్లిన ఈ బృందాలు మైన్స్‌ను గుర్తించి, వాటిని సురక్షితంగా తొలగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ వెల్లడించారు. అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాల్లో ఏర్పాటు చేసిన మైన్స్‌ను పూర్తిగా తొలగించడం అమెరికా సైనిక కార్యకలాపాల్లో ‘మేజర్ మైలురాయి’ అని ఆయన పేర్కొన్నారు.
హర్ముజ్‌లో మైన్స్ తొలగింపుతో పాటు గత కొన్ని నెలల్లో సుమారు 1,500 వాణిజ్య నౌకలు ఈ జలసంధిని దాటేందుకు అమెరికా దళాలు సహకరించినట్లు కూపర్ తెలిపారు. ఈ నౌకల ద్వారా ప్రపంచ మార్కెట్లకు దాదాపు 750 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రవాణా అయినట్లు వెల్లడించారు. హర్ముజ్‌లో సురక్షిత రవాణా మార్గాలను పునరుద్ధరించడం అంతర్జాతీయ వాణిజ్యానికి కీలక పరిణామమని ఈ సందర్భంగా అమెరికా ప్రకటించుకుంది.
ఇదిలా ఉంటే.. మైన్స్ తొలగించినంత మాత్రాన హర్ముజ్‌లో ముప్పు పూర్తిగా తొలగిపోయినట్లు కాదని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ నుంచి డ్రోన్లు, క్షిపణుల ముప్పు ఇంకా తొలగిపోలేదు. దీంతో నౌకల రాకపోకలు పూర్తిగా సాధారణ స్థితికి చేరడానికి సమయం పట్టే అవకాశం ఉంది.
ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి
మరోవైపు ఇరాన్‌పై అమెరికా ఆర్థిక, సైనిక ఒత్తిడిని మరింత పెంచుతోంది. ఇరాన్ నౌకాశ్రయాల్లోకి ప్రవేశించేందుకు.. అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన 75 నౌకలను వెనక్కి పంపినట్లు అమెరికా తెలిపింది. మరో మూడు నౌకలపై సైనిక చర్యలు(స్వల్ప దాడులు!) తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే మానవతా అవసరాల కోసం ప్రయాణించే నౌకలకు మాత్రం మినహాయింపులు ఇచ్చినట్లు పేర్కొంది.
ఇదే సమయంలో హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచి, నౌకల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావడంపై దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఖతార్, ఒమన్ వంటి దేశాలు ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నాయి. అమెరికా దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఆంక్షలను సడలించడం వంటి అంశాలపై ఇరాన్ పట్టుబడుతున్నట్లు సమాచారం.
చమురు మార్కెట్లపై ప్రభావం?
ప్రపంచ ఇంధన సరఫరాలో హర్ముజ్ జలసంధిది అత్యంత కీలకమైన స్థానం. ఈ మార్గంలో నౌకల రాకపోకలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించగలిగితే చమురు, గ్యాస్ సరఫరాపై ఉన్న ఒత్తిడి తగ్గి అంతర్జాతీయ ధరలు కొంత స్థిరపడే అవకాశం ఉంది. అయితే అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో హర్ముజ్ పూర్తిగా సురక్షితంగా మారిందని చెప్పడానికి ఇంకా పరిస్థితులను నిశితంగా గమనించాల్సి ఉంది.
ఇదీ చదవండి: కెనడాకు బీపీ తెప్పించిన ట్రంప్.. ఏం చేశారంటే?


