పేట్రియాట్ల కొరత తీవ్రం  | US weapons shortage from Iran war | Sakshi
Sakshi News home page

పేట్రియాట్ల కొరత తీవ్రం 

Aug 28 2026 6:28 AM | Updated on Aug 28 2026 6:28 AM

US weapons shortage from Iran war

యూరప్‌లో అమెరికా సైన్యం ఆందోళన  

పశ్చిమాసియాలో మోహరింపులకే ప్రాధాన్యం

వాషింగ్టన్‌: అమెరికా సైన్యం పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధంలో మునిగిపోయింది. తరచుగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తోంది. ఇరాన్‌ సైన్యం ప్రయోగించే ఆయుధాల నుంచి రక్షించుకోవడానికి అధునాతన క్షిపణి నిరోధకాలను (పేట్రియాట్లు) మోహరించింది. పశ్చిమాసియాలోని తమ మిత్రదేశాలకు వీటిని అందజేస్తోంది. మరోవైపు యూరప్‌లో అధునాతన క్షిపణి నిరోధకాల కొరత అత్యంత తీవ్రస్థాయిలో ఉందని అమెరికా రక్షణ అధికారి, నాటో అధికారి తెలియజేశారు. 

ఒకవేళ రష్యా సైన్యం యూరప్‌పై దాడి చేస్తే తాము రక్షించలేమని పరోక్షంగా తేల్చిచెప్పారు. రష్యా క్షిపణులను అడ్డుకొనే ఇంటర్‌సెప్టర్లు లేవని పేర్కొన్నారు. రష్యాకు చెందిన అత్యంత వేగవంతమైన బాలిస్టిక్‌ క్షిపణులను కూల్చివేయగల పేట్రియాట్‌ క్షిపణి నిరోధకాల కొరత వేధిస్తుండడం అత్యంత ఆందోళనకరమని అమెరికా రక్షణ అధికారి తెలిపారు. ఐరోపా ఖండంలో అమెరికన్, నాటో దళాల వద్ద పేట్రియాట్‌ల నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని ధ్రువీకరించారు.

 సైనిక ప్రధాన కార్యాలయం లేదా విద్యుత్‌ కేంద్రంపై రష్యా బాలిస్టిక్‌ క్షిపణులతో దాడికి దిగిన పక్షంలో, పేట్రియాట్‌ క్షిపణుల కొరతతో బాధపడుతున్న ఉక్రెయిన్‌ మాదిరిగానే నాటో కూడా అదే పరిస్థితిని ఎదుర్కొని, తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇరాన్‌పై యుద్ధం ప్రకటించిన డొనాల్డ్‌ ట్రంప్‌ వల్ల అమెరికా సైన్యం ఇతర ప్రాంతాల్లో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు స్పష్టమవుతోంది.

 అమెరికా–ఇరాన్‌ యుద్ధానికి దాదాపు ఆరు నెలలు పూర్తయ్యాయి. యూరప్‌లోని అమెరికా క్షిపణి నిల్వలను ఇప్పటికే పశ్చిమాసియాకు తరలించారు. అక్కడ ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకోవడానికి అమెరికా, గల్ఫ్‌ మిత్రదేశాలు పేట్రియాట్‌లతో సహా గణనీయమైన సంఖ్యలో ఇంటర్‌సెప్టర్‌లను ప్రయోగించాయి. మరోవైపు సాధ్యమైనంత త్వరగా మిస్సైల్‌ ఇంటర్‌సెప్టర్లు అందజేయాలని తమ ప్రభుత్వాన్ని యూరప్‌లోని అమెరికా సైన్యం కోరుతోంది.        

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement