ఇరాన్‌తో సంబంధాలున్నాయనే కారణంతో.. చైనా బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని తమ ప్రభుత్వం ఆంక్షలకు సిద్ధమవుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. టెహ్రాన్‌ను ఏకాకిని చేసేందుకు, వాషింగ్టన్ చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక పెద్ద ముందడుగు అనే చెప్పాలి.
ఇరాన్ ప్రభుత్వాన్ని ఆర్థికంగా బలహీనపరిచేందుకు అమెరికా ఇప్పటికే ఆంక్షలను మరింత కఠినతరం చేస్తోంది. ఈ వారం అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కూడా ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచుతామని ప్రకటించారు. ముఖ్యంగా.. ఇరాన్‌తో వ్యాపారం కొనసాగించే ఇతర దేశాలు, సంస్థలపై కూడా సెకండరీ ఆంక్షలు విధించే అవకాశాన్ని అమెరికా పెంచుతోంది. దీంతో ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
చైనా ఎందుకు టార్గెట్?
ఇరాన్‌కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ముఖ్యంగా ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల్లో చైనా కీలకంగా ఉంది. ఇరు దేశాల మధ్య చమురు, ఇతర వస్తువుల వ్యాపారానికి సంబంధించిన చెల్లింపుల్లో చైనా బ్యాంకులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే అమెరికా నిజంగానే చైనా బ్యాంకులపై ఆంక్షలు విధిస్తే.. అది కేవలం ఇరాన్‌పైనే కాకుండా అమెరికా-చైనా సంబంధాలు, ప్రపంచ చమురు మార్కెట్, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇప్పటివరకు అమెరికా.. పెద్ద చైనా బ్యాంకులపై ఇరాన్‌కు సంబంధించి ఆంక్షలు విధించలేదు. అయితే ఇరాన్ ప్రభుత్వానికి, దాని సైన్యానికి సహాయం చేస్తున్నాయని ఆరోపిస్తూ చైనా, హాంకాంగ్‌లోని కొన్ని కంపెనీలపై ఇప్పటికే చర్యలు తీసుకుంది. మరోవైపు అమెరికా విధించే సెకండరీ ఆంక్షలను చైనా చట్టవిరుద్ధమైనవిగా వ్యతిరేకిస్తోంది. దీంతో చైనా బ్యాంకులపై అమెరికా తదుపరి చర్యలు తీసుకుంటే.. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.


