బ్రిటన్‌లోని మూడు ప్రముఖ విమానాశ్రయాలపై జరిగిన సైబర్ దాడి కలకలం రేపింది. ఈ దాడిలో 87 లక్షల మంది కస్టమర్ల వ్యక్తిగత సమాచారం చోరీకి గురైనట్లు మాంచెస్టర్ ఎయిర్‌పోర్ట్స్ గ్రూప్ (MAG) వెల్లడించింది. అయితే.. ఈ సైబర్ దాడి కారణంగా విమానాల రాకపోకలకు లేదా విమానాశ్రయాల సాధారణ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగలేదని సంస్థ స్పష్టం చేసింది.
MAG ఆధ్వర్యంలో నడిచే మాంచెస్టర్, లండన్ స్టాన్‌స్టెడ్, ఈస్ట్ మిడ్‌లాండ్స్ విమానాశ్రయాల కస్టమర్ డేటా ఈ సైబర్ దాడిలో ప్రభావితమైంది. దొంగిలించబడిన సమాచారంలో కస్టమర్ల ఈమెయిల్ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు, వాహన రిజిస్ట్రేషన్ వివరాలు, పోస్టుకోడ్‌లు ఉన్నాయని సంస్థ తెలిపింది. ముఖ్యంగా.. కార్ పార్కింగ్, లాంజ్, ఫాస్ట్ ట్రాక్ బుకింగ్‌లు, విమానాశ్రయ Wi-Fi కోసం నమోదు చేసుకున్న కస్టమర్లకు సంబంధించిన కొంత సమాచారం దాడికి గురైంది.
బ్యాంక్ వివరాలు సేఫ్!
సైబర్ దాడి జరిగినప్పటికీ ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ముప్పు ఏర్పడలేదని MAG స్పష్టం చేసింది. విమానాశ్రయ కార్యకలాపాలు కూడా యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపింది. ముఖ్యంగా.. బ్యాంక్ ఖాతా, చెల్లింపు వివరాలు ఈ దాడిలో ప్రభావితం కాలేదని సంస్థ వెల్లడించింది. అనధికారికంగా వ్యవహరించిన ఒక మూడో పక్షం ఈ సైబర్ దాడికి పాల్పడినట్లు MAG తెలిపింది. దాడిని గుర్తించిన వెంటనే ప్రమాదాన్ని నియంత్రించి, కస్టమర్లు మరియు తమ సిస్టమ్‌లను రక్షించేందుకు నిపుణుల సహాయం తీసుకుంటున్నట్లు పేర్కొంది.
బ్రిటన్‌లో వరుస సైబర్ దాడులు
ఈ ఘటన బ్రిటన్‌లో సైబర్ భద్రతపై మరోసారి ఆందోళనలను పెంచింది. గత ఏడాది కూడా దేశంలోని పలు ప్రముఖ సంస్థలు సైబర్ దాడులకు గురయ్యాయి. కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్, అలాగే మార్క్స్ అండ్ స్పెన్సర్, హారోడ్స్, కో-ఆప్ వంటి ప్రముఖ రిటైల్ సంస్థలు కూడా ఇలాంటి దాడులను ఎదుర్కొన్నాయి. తాజా ఘటనతో పెద్ద సంస్థలు కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని మరింత పటిష్టంగా రక్షించాల్సిన అవసరం మరోసారి స్పష్టమైంది.


