‘నా భర్తను బలి పశువును చేశారు’.. జైల్లో భారత కెప్టెన్‌.. రీతూ ఆవేదన | Ajay Pant Wife Says My husband A scapegoat arrested in UK | Sakshi
Sakshi News home page

‘నా భర్తను బలి పశువును చేశారు’.. జైల్లో భారత కెప్టెన్‌.. రీతూ ఆవేదన

Aug 22 2026 9:19 AM | Updated on Aug 22 2026 9:59 AM

Ajay Pant Wife Says My husband A scapegoat arrested in UK

సముద్రంలో ఓ భారీ ఆయిల్‌ ట్యాంకర్‌.. చుట్టూ బ్రిటన్‌ కమాండోలు.. హెలికాప్టర్‌ నుంచి సైనికుల దూకుడు.. ఆ తర్వాత ఓ భారతీయ కెప్టెన్‌ అరెస్ట్‌. సినిమా సీన్‌ను తలపించే ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. రష్యా చమురు ఆంక్షల ఉల్లంఘన కేసులో బ్రిటన్‌ అరెస్టు చేసిన భారతీయ కెప్టెన్‌ అజయ్‌ పంత్‌ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే ఆయన భార్య రీతూ పంత్‌ మాత్రం తన భర్తను ఈ కేసులో బలిపశువును చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

అజయ్‌ పంత్‌(38) ‘స్మిర్టోస్‌’ ఆయిల్‌ ట్యాంకర్‌కు కెప్టెన్‌గా ఉన్నారు. జూన్‌ 14న ఇంగ్లీష్‌ ఛానల్‌లో ఈ నౌకను బ్రిటన్‌ కమాండోలు అడ్డుకున్నారు. రష్యా ఆంక్షలను తప్పించుకునే ‘షాడో ఫ్లీట్‌’లో ఈ నౌక భాగమని బ్రిటన్‌ ఆరోపిస్తోంది. నౌకలో దాదాపు 98 వేల టన్నుల చమురు ఉన్నట్లు ప్రాసిక్యూషన్‌ చెబుతోంది. రష్యాలోని ఉస్ట్‌-లూగా నుంచి ఈజిప్ట్‌లోని పోర్ట్‌ సయీద్‌కు వెళ్తుండగా నౌకను అడ్డుకున్నారు. ఈ కేసులో అజయ్‌పై ఆంక్షల ఉల్లంఘనకు సంబంధించిన అభియోగాలు నమోదయ్యాయి. నేరం రుజువైతే గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. విచారణ డిసెంబర్‌ 15న ప్రారంభం కానుంది. అరెస్టు తర్వాత భర్తతో మాట్లాడినప్పుడు ఆయన తీవ్రంగా కుంగిపోయారని, ‘నేను జైల్లో ఉన్నాను.. నన్ను బయటకు తీసుకెళ్లండి’ అంటూ ఏడ్చారని రీతూ పంత్‌ తెలిపారు.

అసలు ప్రశ్న ఇప్పుడు ఇదే.. నౌక కెప్టెన్‌గా ఉన్నంత మాత్రాన ఆ నౌకపై ఉన్న చమురు ఆంక్షల ఉల్లంఘనకు అతడే బాధ్యుడా? లేక యజమాని ఆదేశాలు పాటించే ఉద్యోగి మాత్రమేనా? అజయ్‌ తరఫు న్యాయవాది ఆయన కేవలం యజమాని ఆదేశాలను పాటించారని వాదించారు. ఈ కేసును మరింత కీలకంగా మార్చే అంశం.. యూరప్‌లో ‘షాడో ఫ్లీట్‌’పై చర్యలు పెరుగుతున్న సమయంలో నౌక యజమాని లేదా కంపెనీపై కాకుండా కెప్టెన్‌పై నేరుగా ఆంక్షల ఉల్లంఘన కేసు నమోదు చేయడం ఇదే తొలి ఘటనగా భావిస్తున్నారు. రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత వాటిని తప్పించుకునేందుకు యాజమాన్యం, బీమా, రిజిస్ట్రేషన్‌ వివరాలను అస్పష్టంగా ఉంచే నౌకల నెట్‌వర్క్‌ను ‘షాడో ఫ్లీట్‌’గా పిలుస్తున్నారు. ఈ నౌకలపై పాశ్చాత్య దేశాలు కొంతకాలంగా కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఆ భౌగోళిక, రాజకీయ పోరాటం మధ్యలో సముద్రంలో పనిచేస్తున్న సాధారణ నావికులు ఇరుక్కుపోతున్నారనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

ఇది కూడా చదవండి: గ్రీన్‌కార్డు కోసం కొత్త దరఖాస్తు ఫారం.. 

మరోవైపు.. భారత ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. భారత విదేశాంగ శాఖకు చెందిన అధికారులు అజయ్‌ పంత్‌ను జైలులో కలిసి ఆయన ఆరోగ్యం, పరిస్థితి గురించి ఆరా తీశారు. ఈ నౌకలోని 25 మంది సిబ్బందిలో అజయ్‌ మాత్రమే కేసులో నిందితుడిగా ఉన్నారు. మిగిలిన వారిలో ఎక్కువ మందిని స్వదేశాలకు పంపించినట్లు సమాచారం. ఇదే ఇప్పుడు అజయ్‌ కుటుంబానికి మరింత ఆందోళన కలిగిస్తోంది. కాగా, ఇది కేవలం ఓ భారతీయ కెప్టెన్‌ కేసు కాదు.. అంతర్జాతీయ ఆంక్షల మధ్య ఒక నౌక ఉద్యోగి ఎంతవరకు బాధ్యత వహించాలనే దానిపై కీలక పరీక్షగా మారే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement