ఆర్‌బీఐ బోర్డులోకి ఎస్.సోమనాథ్, ఆనంద్ మహీంద్రా | RBI Board Expansion S Somanath Anand Mahindra Reappointed as Directors | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ బోర్డులోకి ఎస్.సోమనాథ్, ఆనంద్ మహీంద్రా

Aug 22 2026 9:38 AM | Updated on Aug 22 2026 10:07 AM

RBI Board Expansion S Somanath Anand Mahindra Reappointed as Directors

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నెన్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇస్రో మాజీ ఛైర్మన్ ఎస్.సోమనాథ్‌ను ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డులో పార్ట్‌టైమ్, నాన్-అఫీషియల్ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ఆగస్టు 20, 2026 నుంచి నాలుగేళ్ల కాలపరిమితికి నియమించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాను మరొక పదవీకాలానికి (నాలుగేళ్లు) నాన్-అఫీషియల్ డైరెక్టర్‌గా పునర్నియమించారు.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టాల ప్రకారం ఆర్‌బీఐ వ్యవహారాలను నడిపే సెంట్రల్ బోర్డులో రంగాలవారీ నిపుణులను భాగస్వాములను చేయడం ఆనవాయితీ. అంతరిక్ష రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సోమనాథ్ సాంకేతిక పరిజ్ఞానం, ఆనంద్ మహీంద్రా పారిశ్రామిక అనుభవం ఆర్‌బీఐ బోర్డు నిర్ణయాలకు మరింత దిశానిర్దేశం చేస్తాయని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఈ సెంట్రల్ బోర్డులో డిప్యూటీ గవర్నర్లు స్వామినాథన్ జె, పూనమ్ గుప్తా, శిరీష్ చంద్ర ముర్ము, రోహిత్ జైన్‌లతో పాటు రివతి అయ్యర్, ప్రొఫెసర్ సచిన్ చతుర్వేది వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. తాజా నియామకాలతో బోర్డు బలం 11కి చేరింది.

ద్రవ్యోల్బణ నివారణ, సాంకేతిక మార్పులకు అనుగుణంగా డిజిటల్ కరెన్సీ విస్తరణ, సైబర్ భద్రత వంటి కీలక సవాళ్లను బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో వ్యూహాత్మక సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక రంగ అనుభవం ఉన్న నిపుణుల భాగస్వామ్యం ఆర్‌బీఐకి ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.

ఇదీ చదవండి: వ్యాపార నిర్వహణలో భావోద్వేగాలు వద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement