జ్ఞానేశ్.. చేసింది చాలు బ్రో... ఇక రిజైన్‌ చెయ్‌: రాహుల్ గాంధీ | Gyanesh its done bro, time to Resign: Rahul | Sakshi
Sakshi News home page

జ్ఞానేశ్.. చేసింది చాలు బ్రో... ఇక రిజైన్‌ చెయ్‌: రాహుల్ గాంధీ

Oct 6 2026 11:43 AM | Updated on Oct 6 2026 11:51 AM

Gyanesh its done bro, time to Resign: Rahul

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘జ్ఞానేశ్.. ఇక చాల్లే బ్రో.. రాజీనామా చేసే సమయం వచ్చింది’ అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ఇండియా కూటమి నేతలు, కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టిన సమయంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
 

జాతీయ రాజధానిలో ఇండియా కూటమి నేతలు, కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ర్యాలీగా బయలుదేరిన అనంతరం పలువురు ఇండియా కూటమి ఎంపీలు నీతి ఆయోగ్ కార్యాలయం సమీపంలో కూర్చొని నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ-ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.
 
ఇండియా కూటమి నిరసన సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ప్రజల హక్కులను ఒక్కొక్కటిగా తొలగిస్తోందని అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత సాధించిన సార్వత్రిక వయోజన ఓటుహక్కును కూడా బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ ఎంపీ ధర్మవీర్ గాంధీ మాట్లాడుతూ.. 13 కోట్ల ఓట్లు తొలగించారని, తద్వారా ఆయా వ్యక్తులు తమ ప్రజాస్వామ్య ఓటుహక్కును కోల్పోయారని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం, జ్ఞానేశ్ కుమార్ సహకారంతో ప్రజలపై చేసిన అతిపెద్ద ఎన్నికల మోసమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు, ప్రజాస్వామ్య సంస్థల గౌరవాన్ని కాపాడేందుకు పోరాడతామని చెప్పారు.

ప్రతిపక్షం రాజ్యాంగ సంస్థలను బలహీనపరుస్తోందన్న బీజేపీ ఆరోపణలను ధర్మవీర్ గాంధీ ఖండించారు. రాజ్యాంగ సంస్థలను ఎవరు తమ ఆధీనంలోకి తీసుకున్నారో ప్రజలకు తెలుసని అన్నారు. ఎన్నికల కమిషనర్లు, సీఈసీ ఎంపిక చేసే కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించింది బీజేపీయేనని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు, మీడియా, ఇతర సంస్థలపై కూడా ప్రభుత్వం ప్రభావం చూపుతోందని ఆయన విమర్శించారు.

ఎన్నికల ప్రక్రియలో రాజకీయ జోక్యంపై ఉన్న ఆరోపణలపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ డిమాండ్ చేశారు. తమ ప్రధాన డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయని ఆయన తెలిపారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ను రద్దు చేయాలని కోరారు. సర్‌లో తొలగించిన లేదా డిలీట్ చేసిన ఓటర్లందరి పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement