చెన్నై: తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొడైకెనాల్-పళని ఘాట్ రోడ్డులోని సవరిక్కాడు సమీపంలో 24 మంది ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి సుమారు 100 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పళనిలోని మదీనా నగర్, ఉదుమల్‌పేట ప్రాంతాలకు చెందిన 24 మంది ప్రయాణికులు కొడైకెనాల్‌లో జరిగిన వివాహ రిసెప్షన్‌తో పాటు వివాహానంతర వేడుకకు హాజరయ్యారు. కొడైకెనాల్‌లోని మూంజిక్కల్ సమీపంలో జరిగిన వేడుకలు ముగించుకుని మినీ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో గురువారం రాత్రి సవరిక్కాడు సమీపంలోని ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మలుపుల వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో మినీ బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి సుమారు 100 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది.
#WATCH | Tamil Nadu | Three people were killed and several others injured after a 407 mini bus carrying 24 passengers plunged into a 100-foot-deep gorge near Savarikkadu on the Kodaikanal–Palani hill road in Dindigul district https://t.co/XieQhVOtFK
— ANI (@ANI) November 19, 2026
రంగంలోకి దిగిన సహాయక బృందాలు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పళని, కొడైకెనాల్ ప్రాంతాలకు చెందిన ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక ప్రజలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. లోయలో పడిపోయిన బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసుకురావడానికి సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. గాయపడిన వారిని లోయ నుంచి బయటకు తీసుకొచ్చి అంబులెన్సుల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
ముగ్గురి మృతి.. పలువురికి గాయాలు
ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించినట్లు దిండిగల్ ఎంపీ సచితానందం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే మృతుల పూర్తి వివరాలు, క్షతగాత్రుల సంఖ్య, వారి ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఘాట్ రోడ్డులోని ప్రమాదకరమైన మలుపు వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనతో పళని, ఉదుమల్‌పేట ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: భారతీయులకు జనవరి 1 నుంచి వీసా–ఫ్రీ ఎంట్రీ బంద్


