కనీస నిల్వ 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు
ఉద్యోగం కోల్పోతే రెణ్నెల్లకే పూర్తి సొమ్ము విత్‌డ్రాకు వెసులుబాటు
పదవీ విరమణ తర్వాత నెలవారీ ఆదాయానికి ‘సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్’
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో కీలక నిర్ణయాలు
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కోట్లాది మంది ఉద్యోగులకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తీపి కబురు అందించింది. పీఎఫ్ నిధుల ఉపసంహరణ నిబంధనలను మరింత సరళతరం చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) గురువారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖాతాదారులు తమ పీఎఫ్ ఖాతాలో ఉంచాల్సిన కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్) పరిమితిని 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ ఆమోదం తెలిపింది. దీనివల్ల అవసరమైన సమయాల్లో 55 ఏళ్ల లోపు వయస్సున్న ఉద్యోగులు తమ పీఎఫ్ నిల్వల్లో 90 శాతం వరకు డబ్బును ఉపసంహరించుకునే అవకాశం లభించనుంది. గతంలో ఈ పరిమితి 75 శాతం ఉండేది.
ఆ నిబంధన పునరుద్ధరణ
ఉద్యోగం కోల్పోయినప్పుడు పూర్తి స్థాయి పీఎఫ్ సెటిల్‌మెంట్ చేసుకునేందుకు గడువును మళ్లీ 2 నెలలకు తగ్గించారు. గతేడాది అక్టోబర్‌లో ఈ కాలపరిమితిని 12 నెలలకు పెంచడంతో ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. తాజా నిర్ణయంతో.. ఉద్యోగం లేకుండా వరుసగా రెండు నెలలు గడిస్తే పూర్తి పీఎఫ్ సొమ్మును క్లెయిమ్ చేసుకోవచ్చు.
రిటైర్మెంట్ తర్వాత నెలవారీ ఆదాయం
ఉద్యోగ విరమణ పొందిన తర్వాత తమ పీఎఫ్ సొమ్మును ఒకేసారి కాకుండా, దశలవారీగా తీసుకునేందుకు వీలుగా ‘సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్’(ఎస్‌డబ్ల్యూపీ)కు బోర్డు పచ్చజెండా ఊపింది. ఈపీఎఫ్ పథకంలో అవసరమైన సవరణలు చేసిన తర్వాత సుమారు రెండు నెలల్లో ఈ విధానం అమల్లోకి రానుంది.
రిటైరైన సభ్యులు తమ పూర్తి సొమ్మును లేదా కొంత భాగాన్ని పీఎఫ్ ఖాతాలోనే ఉంచి, క్రమపద్ధతిలో చెల్లింపులు పొందవచ్చు. మిగిలిన నిల్వపై ఈపీఎఫ్ వడ్డీ యథావిధిగా జమ అవుతుంది. ఒకవేళ సభ్యుడు మరణిస్తే నామినీ మిగిలిన పీఎఫ్ మొత్తాన్ని ఒకేసారి కానీ లేదా వాయిదాల విధానంలో కానీ పొందవచ్చు.
ఉద్యోగుల వీలును బట్టి..
పదవీవిరమణ తరువాత ఉద్యోగులు తమ పీఎఫ్ మొత్తాన్ని తమకు అనుకూలమైన విధానంలో పొందే అవకాశాన్ని కల్పించారు. ఉద్యోగులు ఒకేసారి పూర్తి స్థాయిలో తీసుకోవచ్చు. లేదా విడతలవారీగా పొందవచ్చు. లేదా, కొంత మొత్తాన్ని ఏకమొత్తంగా తీసుకుని మిగిలిన దాన్ని వాయిదాల్లో పొందవచ్చు. లేదా కేవలం వడ్డీని మాత్రమే నెలవారీగా తీసుకోవచ్చు. ఈ వెసులుబాట్లు రిటైర్డ్ ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరం కానున్నాయి.
సభ్యుల కుటుంబానికి భద్రత...
సిస్టమాటికి విత్‌డ్రాయల్ ప్లాన్ లో ఉన్న సమయంలో ఖాతాదారుడు మరణిస్తే, మిగిలిన సొమ్మును నామినీ లేదా జీవిత భాగస్వామి అదే నిబంధనల ప్రకారం వాయిదాల్లో పొందవచ్చు లేదా మొత్తం ఒకేసారి ఉపసంహరించుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా ఈ ప్లాన్‌ను నిలిపివేసి మిగిలిన పూర్తి మొత్తాన్ని తీసుకునే అవకాశం కూడా ఉంది.
ప్రస్తుతం 58 ఏళ్ల వయసులో ఉద్యోగ విరమణ చేసినప్పుడు 100 శాతం పీఎఫ్ సొమ్మును తీసుకునే అవకాశం ఉండగా, 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఈపీఎస్ కింద నెలవారీ పెన్షన్ లభిస్తోంది. 55 ఏళ్లు పైబడి, రూ.5 లక్షల కంటే ఎక్కువ పీఎఫ్ నిల్వ ఉన్న సుమారు 6.32 లక్షల మంది సభ్యులకు ఈ కొత్త ఎస్‌డబ్ల్యూపీ విధానం ప్రయోజనం చేకూరుస్తుందని ఈపీఎఫ్‌ఓ అంచనా వేస్తోంది.
అసంఘటిత రంగ కార్మీకులకూ...
కంపెనీల పేరోల్ వ్యవస్థలతో సంబంధం లేకుండా, సభ్యులు నేరుగా డిజిటల్ మాధ్యమాల ద్వారా తమ పీఎఫ్ ఖాతాల్లో స్వచ్ఛంద విరాళాలు జమ చేసుకునే అంశాన్ని కూడా ఈపీఎఫ్‌ఓ పరిశీలించింది. దీనికితోడు గిగ్ వర్కర్లు, ఇళ్లలో పనిచేసేవారు తదితర అసంఘటిత రంగ కార్మీకులకు సామాజిక భద్రత కల్పించే దిశగా మరో ప్రతిపాదనపై కూడా చర్చించింది. వీరికి లభించే టిప్పులు, బహుమతులు వంటి చిన్నపాటి మొత్తాలను యూఏఎన్ అనుసంధానిత పీఎఫ్ ఖాతాల్లో జమ చేసేలా అనుమతించే అంశాన్ని పరిశీలించారు.


