ఈ నెల 25 వరకు కూల్చివేత నిలిపివేయాలి
ఉత్తర్వులు జారీ చేసిన బాంబే హైకోర్టు
ముంబై: దక్షిణ ముంబైలో శిథిలావస్థలో ఉన్న ఒక భవనం కూల్చివేతపై బాంబే హైకోర్టు నవంబర్ 25వ తేదీ వరకు స్టే విధించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భవనంలో ఒక మసీదు, హజ్ యాత్రికుల కోసం విశ్రాంతి గృహం ఉన్నాయి. దీనిని అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఒకప్పటి నివాసంగా కూడా పిలుస్తారు. ముంబై కార్పొరేషన్ అధికారులు ఆ భవనాన్ని కూల్చివేయడం ప్రారంభించిన కొన్ని గంటల తర్వాత హైకోర్టు స్టే ఇచి్చంది.
అయితే, న్యాయస్థానం నుంచి ఉత్తర్వు వచ్చే సమయానికే ఆ రెండు అంతస్తుల భవనంలో కొంత భాగాన్ని అధికారులు కూల్చివేశారు. దావూద్ ఇంటి కూల్చివేత వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తి మహేష్ చంద్ర త్రిపాఠి, న్యాయమూర్తి జస్టిస్ అద్వైత్ ఎం.సేథ్నాలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఇందులో వివాదాస్పద అంశాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ అవసరమని పేర్కొంది.
తదుపరి విచారణ తేదీ వరకు యథాతథ స్థితిని(స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశించింది. ముంబై భెండీ బజార్ ప్రాంతంలోని పాక్మోడియా వీధిలో ఉన్న ‘హాజీ ఇస్మాయిల్ హాజీ హబీబ్ ముసాఫిర్‌ఖానా’భవనాన్ని ప్రమాదకరమైన, శిథిలావస్థలో ఉన్న కట్టడంగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. గురువారం ఉదయం కూల్చివేయడం ప్రారంభించారు. ఇంతలో కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో కూల్చివేత పనులు నిలిపివేశారు.
హాజీ ఇస్మాయిల్ హాజీ హబీబ్ ముసాఫిర్‌ఖానా ట్రస్ట్ అనే వక్ఫ్ సంస్థలో తాము భాగస్వామ్య పక్షాలమని షేక్ అబ్దుల్ రజాక్, అమీరాలీ వజీరాలీ పంజ్‌వానీ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై బాంబే హైకోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో 148.79 చదరపు మీటర్ల విస్తీర్ణం గల మసీదు ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు.
1864 అక్టోబర్‌లో హాజీ మియా హాజీ ఇస్మాయిల్ హాజీ హబీబ్ ఈ భవనాన్ని హజ్ యాత్రికుల కోసం ఒక విశ్రాంతి గృహంగా, మసీదుతో పాటు శాశ్వతంగా అంకితం చేశారని వెల్లడించారు. ఈ విషయం మసీదు గోడలో పొదిగిన అరబిక్, పర్షియన్ పాలరాతి ఫలకంపై నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు ఈ భవనంతో అనుబంధం ఉంది.1970వ దశకంలో దావూద్ తన కుటుంబంతో కలిసి ఇక్కడే నివసించాడు. ఆ తర్వాత 1986లో దేశం నుంచి పారిపోయాడు.


