రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా వచ్చిన లేటేస్ట్ మూవీ రామాయణ. ఈనెల 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా రాణిస్తోంది. ఈ సినిమాకు నితీశ్ తివారీ దర్శకత్వం వహించారు. అయితే తాజాగా రామాయణ చిత్ర బృందం పైరసీపై తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది.
థియేటర్లలో సినిమాను రికార్డు చేసి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేయడంపై బాంబే హైకోర్టు సీరియస్ అయింది. ఈ విషయాన్ని లీగల్ నోటీసు ద్వారా వెల్లడించింది. దీనిపై ఇటీవల బాంబే హైకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసిందని నోటీసులో పేర్కొంది. అనుమతి లేకుండా సినిమాను రికార్డు చేసి అప్‌లోడ్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేసింది. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని రాసుకొచ్చింది.
ఇప్పటికే ఎవరైనా ఇలాంటి ఫుటేజ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉంటే.. వెంటనే వాటిని తొలగించాలని మూవీ టీమ్ హెచ్చరించింది. ఈ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే నేరుగా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.


