మొజాంబిక్ నేతకు ప్రదానం చేసిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ: ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి పురస్కారాన్ని మొజాంబిక్ నాయకురాలు గ్రాషా మషెల్ అందుకున్నారు. ఢిల్లీలోని జవహర్ భవన్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో గ్రాషా మషెల్‌కు కాంగ్రెస్ అగ్ర నేత, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ప్రదానం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు, చిన్నారుల హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతున్నందుకుగాను గ్రాషా మషెల్‌కు ఈ అవార్డు కింద ప్రశంసా పత్రంతోపాటు రూ.కోటి నగదును అందజేశారు.
అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం, మార్పు తీసుకురావాలనే సంకల్ప బలం ఆధారంగానే నాయకత్వ పటిమను అంచనా వేయగలమని ఇందిరా గాంధీ వంటివారి జీవితాలు మనకు గుర్తుచేస్తాయని ఈ సందర్భంగా సోనియా తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, జాతీయ భద్రత మాజీ సలహాదారు శివశంకర్ మీనన్, రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ పాల్గొన్నారు. కాగా, 1975లో మొజాంబిక్‌కు స్వాతంత్య్రం లభించిన తర్వాత ఏర్పాటై ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా గ్రాషా మషెల్ పనిచేశారు. ఆమె హయాంలో దేశంలోని 40 శాతం మంది చిన్నారులు మాత్రమే బడికి వెళ్లేవారు. మషెల్ కృషి ఫలితంగా స్కూళ్లలో బాలుర అడ్మిషన్లు 90 శాతం, బాలికల్లో 75 శాతం మేర పెరిగింది.


