అవగాహన కోసమే ఎస్‌ఎంఎస్ హెచ్చరికలన్న ఎన్‌హెచ్‌ఏఐ
సాక్షి, న్యూఢిల్లీ: వాహన బీమా గడువు ముగియనున్న విషయాన్ని ముందుగానే గుర్తు చేస్తూ జాతీయ రహదారులపై ప్రయాణించే కొంతమంది వాహనదారులకు పంపిస్తున్న ఎస్‌ఎంఎస్ సందేశాలపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) స్పష్టత ఇచ్చింది. ఈ సందేశాలు కేవలం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతిపాదించిన కార్యక్రమంలో భాగంగా ప్రయోగాత్మకంగా పంపిస్తున్నవేనని వెల్లడించింది.
బీమా గడువు ముగిసిన వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి చలాన్లు జారీ చేయడం లేదని, జరిమానాలు కూడా విధించడం లేదని స్పష్టం చేసింది. గురువారం కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది. వాహన బీమా పాలసీల గడువు ముగిసే తేదీలను ముందుగానే వాహన యజమానులకు తెలియజేయడమే ఈ ఎస్‌ఎంఎస్ వ్యవస్థ ప్రధాన ఉద్దేశమని ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది.
బీమా గడువు ముగిసేలోపు పాలసీలను పునరుద్ధరించుకునేలా వాహనదారులను అప్రమత్తం చేయడం ద్వారా నిరంతర బీమా రక్షణను ప్రోత్సహించాలన్నది ఈ కార్యక్రమం లక్ష్యమని వివరించింది. ఈ సందేశాలకు టోల్ ప్లాజాల వద్ద అమలయ్యే ఎలాంటి ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలతోనూ సంబంధం లేదని పేర్కొంది. మోటారు వాహనాల బీమా గడువును సకాలంలో పునరుద్ధరించుకోవడం కూడా రహదారి భద్రతా నిబంధనల్లో భాగమేనని గుర్తు చేసింది.


