కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మన్సా పూజ సందర్భంగా నిర్వహించిన ఝపాన్ ఆచారంలో విషపూరితమైన నల్ల కట్ల పాము కాటేయడంతో రాహుల్ దండపత్ (32) అనే వ్యక్తి మృతి చెందాడు. ‘సర్పబంధు’ (పాముల మిత్రుడు)గా గుర్తింపు పొందిన ఆయనకు సామాజిక మాధ్యమాల్లో సుమారు 1.5 లక్షల మంది అనుచరులు ఉన్నారు. ఇప్పటివరకు 32 పాములను కాపాడాడు.
పశ్చిమ బెంగాల్‌లోని జార్గ్రామ్ జిల్లాకు చెందిన రాహుల్ దండపత్ పదేళ్లకు పైగా పాములను పట్టుకుని, వాటిని సురక్షితంగా అడవుల్లో విడిచిపెట్టే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇళ్లలోకి, నివాస ప్రాంతాల్లోకి వచ్చిన పాములను రక్షించడంతో పాటు వాటి ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేవారు. పాములను చంపవద్దని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసేవారు. దీంతో ఆయనకు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఏర్పడ్డారు.
జార్గ్రామ్ జిల్లాలోని గోపీబల్లవ్‌పూర్-2 బ్లాక్ పరిధిలో ఉన్న చౌనిషోల్ గ్రామంలో పాము కాటు ఘటన చోటుచేసుకుంది. మన్సా పూజలో భాగంగా నిర్వహించిన ఝపాన్ ప్రదర్శనలో రాహుల్ పాల్గొన్నారు. ఈ ఆచారం పాముల దేవతగా భావించే మన్సా దేవి ఆరాధనతో ముడిపడి ఉంటుంది.
ఈ ప్రదర్శనలో భాగంగా సజీవంగా ఉన్న నల్ల కట్ల పామును రాహుల్ మెడ చుట్టూ ఉంచారు. అయితే అది జారిపోతుండటంతో తిరిగి సరిచేసేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ క్రమంలో పాము ఆయన ఎడమ చేతిపై కాటు వేసింది. వెంటనే రాహుల్‌ను జార్గ్రామ్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గతంలోనూ ఆయన పలుమార్లు పాముకాటుకు గురై ప్రాణాలతో బయటపడ్డారని సహచరులు తెలిపారు. సుమారు మూడేళ్ల క్రితం పాము కాటు కారణంగా ఒక వేలును కూడా కోల్పోయినట్లు వెల్లడించారు.
నల్ల కట్ల పాము కాటు ఎందుకు ప్రమాదకరం?
నల్ల కట్లా పాములు బంగారస్ ప్రజాతికి చెందినవి. వీటి విషంలో అత్యంత శక్తిమంతమైన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపే విషపదార్థాలు ఉంటాయి. ఇవి నరాలు, కండరాల మధ్య సమాచార ప్రసారానికి ఆటంకం కలిగిస్తాయి. ఫలితంగా క్రమంగా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. తీవ్రమైన సందర్భాల్లో శ్వాస తీసుకోవడానికి అవసరమైన కండరాలు కూడా పనిచేయక శ్వాసకోశ వైఫల్యం సంభవించవచ్చు. కొన్ని సందర్భాల్లో కాటు వేసినప్పుడు నొప్పి, వాపు తక్కువగా ఉండటంతో ప్రమాదాన్ని గుర్తించడం ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
అనుభవం ఉన్న పాముల సంరక్షకులు సైతం విషపూరిత పాములను పట్టుకునే సమయంలో ప్రమాదాలను ఎదుర్కొంటారని రాహుల్ మరణం మరోసారి స్పష్టం చేసింది. పాములను తగిన శిక్షణ, భద్రతా ఏర్పాట్లు లేకుండా చేతబట్టడం ప్రాణాపాయానికి దారితీయవచ్చు. పాము కాటు అనుమానం వచ్చిన వెంటనే వైద్య సహాయం పొందడం ప్రాణాలను కాపాడటంలో కీలకమని ఈ ఘటన హెచ్చరిస్తోంది.


