ఆపరేషన్ సిందూర్‌పై కుంభకోణం ఆరోపణలు.. మంత్రి వ్యాఖ్యలతో దుమారం | Himachal Minister Op Sindoor Remark In Assembly Sparks Row | Sakshi
Sakshi News home page

ఆపరేషన్ సిందూర్‌పై కుంభకోణం ఆరోపణలు.. మంత్రి వ్యాఖ్యలతో దుమారం

Nov 19 2026 7:52 PM | Updated on Nov 19 2026 8:00 PM

Himachal Minister Op Sindoor Remark In Assembly Sparks Row

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రెవెన్యూ మంత్రి జగత్ సింగ్ నేగి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలు ధరపై అవినీతి ఆరోపణలు చేస్తూ..‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో సైన్యం, రాఫెల్ పనితీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలపై గురువారం సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

అసెంబ్లీ చర్చ సందర్భంగా మంత్రి జగత్ సింగ్ నేగి మాట్లాడుతూ.. రూ. 700 కోట్ల విలువైన రాఫెల్ యుద్ధ విమానాన్ని రూ. 2,300 కోట్లకు కొనుగోలు చేశారని, ఆ కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపించారు. అదేమైనా బంగారు, వెండి జెట్టా? అని ప్రశ్నిస్తూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌పై అనుకున్న స్థాయిలో ఒత్తిడి తీసుకురాలేకపోయామని, పైగా మనకే కఠిన పరిస్థితులు ఎదురయ్యాయనే అర్థంలో వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో రగడ.. బీజేపీ వాకౌట్
మంత్రి వ్యాఖ్యలపై గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష బీజేపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్, భారత సైన్యంపై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని, మంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. దీనిపై స్పందించిన మంత్రి జగత్ సింగ్ నేగి క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. నవంబర్ 18 నాటి అసెంబ్లీ చర్చల రికార్డు కాపీని సభ ముందు ఉంచుతూ.. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, అప్పట్లోనే అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు క్షమాపణ ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. మంత్రి సమాధానంతో అసంతృప్తి వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.

సభ బయట, సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. సైన్యం శౌర్యాన్ని, ఆపరేషన్ సిందూర్‌ను కించపరిచేలా మాట్లాడటం శోచనీయమని పేర్కొంటూ, ఈ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సమర్థిస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు హర్ష్ మహాజన్ కూడా మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ, జాతీయ భద్రత, రక్షణ అంశాలపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

పహల్గామ్ దాడి 
గతేడాది (2025) ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. మతపరమైన ఉద్రిక్తతలు రేకెత్తించడం, కాశ్మీర్ పర్యాటక రంగం ద్వారా నెలకొన్న ప్రశాంతతను దెబ్బతీయడం లక్ష్యంగా ఈ దాడి జరిగిందని అధికారులు పేర్కొన్నారు. దీనికి లష్కర్-ఎ-తొయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించింది. ఈ ఘటనకు ప్రతిస్పందనగా భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు నిర్వహించడంతో పాటు, సరిహద్దుల్లో నిఘా, భద్రతా చర్యలను ముమ్మరం చేసింది. సింధు జల ఒప్పందం నిలిపివేత వంటి కఠిన దౌత్య నిర్ణయాలకు దారితీసిన ఈ పరిణామాలు, కాశ్మీర్ పర్యాటకంపై తాత్కాలిక ప్రభావం చూపినప్పటికీ, ఉగ్రవాదంపై దేశవ్యాప్తంగా ఐక్యతను, కఠిన వైఖరిని చాటిచెప్పాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement