టీఎంసీకి బిగ్‌ షాక్‌.. మమత సోదరుడు సంచలన వ్యాఖ్యలు | Babun Banerjee Sensational COmments on Mamatha Banerjee | Sakshi
Sakshi News home page

టీఎంసీకి బిగ్‌ షాక్‌.. మమత సోదరుడు సంచలన వ్యాఖ్యలు

Nov 11 2026 11:17 AM | Updated on Nov 11 2026 11:17 AM

Babun Banerjee Sensational COmments on Mamatha Banerjee

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సోదరుడు బాబున్ బెనర్జీ.. ప్రస్తుత ముఖ్యమంత్రి, బీజేపీ నేత సువేందు అధికారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నాయకత్వానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. భవిష్యత్తులోనూ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు. గత ఆరు నెలలుగా బెంగాల్‌లో సువేందు అధికారి చేస్తున్న పనులు తనను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. ఆయనకు జీవితాంతం అండగా ఉంటానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తన పూజా కమిటీ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి సువేందు అధికారి హాజరైన సందర్భంగా బాబున్ ఈ వ్యాఖ్యలు చేశారు. జగద్ధాత్రి పూజ, కాళీ పూజ, రక్తదాన శిబిరం వంటి కార్యక్రమాలకు గతంలోనూ సువేందు అధికారి హాజరయ్యారని గుర్తుచేశారు. ఈసారి తమ ప్రాంతానికి ముఖ్యమంత్రి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. పీటీఐతో మాట్లాడిన బాబున్.. గత ఆరు నెలల్లో సువేందు అధికారి బెంగాల్ కోసం చేసిన పనులను పరిశీలిస్తే, ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

జీవితాంతం ఆయన వెంటే ఉంటా..
సువేందు అధికారితో తనకు పరిచయం ఉందని, చాలా ఏళ్లుగా ఆయనతో అనుబంధం ఉందని బాబున్ వెల్లడించారు. ప్రస్తుతం కూడా ఆయనకు మద్దతుగా ఉన్నానని, జీవితాంతం అలాగే కొనసాగుతానని స్పష్టం చేశారు. తమ పూజా కమిటీ నిర్వహించిన కార్యక్రమాలకు సువేందు అధికారి హాజరవడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన బాబున్.. ఆయన తమకు ఎంతో సహకారం అందించారని పేర్కొన్నారు. ముఖ్యంగా కాళీ పూజ వేడుకల నిర్వహణలో ముఖ్యమంత్రి చొరవ చూపిన విషయాన్ని ప్రస్తావించారు. నందిగ్రామ్‌లో సువేందు అధికారి చేసిన పనులను కూడా బాబున్ ప్రశంసించారు. ఆయన చేపట్టిన మంచి పనుల వల్ల తమకు సంతోషంగా ఉందని, సువేందు అధికారి మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

మంచి పనులు చేస్తేనే ప్రజల్లో గౌరవం..
సువేందు అధికారితో జరిగిన భేటీలో ఆయన తనకు ఆశీస్సులు అందించారని బాబున్ వెల్లడించారు. ప్రజల కోసం మంచి పనులు చేయాలని, అలా చేస్తేనే ప్రజల్లో గౌరవం పెరుగుతుందని ముఖ్యమంత్రి సూచించినట్లు చెప్పారు. మమతా బెనర్జీ నివాసానికి సమీపంలోని ప్రాంతంలో సువేందు అధికారి పర్యటన గురించి ప్రశ్నించగా.. ఆయనకు తన మద్దతు కొత్తదేమీ కాదని బాబున్ స్పష్టం చేశారు. సువేందు అధికారి అంటే తమకు చాలా కాలంగా అభిమానమని, ఆయనను ఇష్టపడుతున్నామని చెప్పారు. ఆయనకు మద్దతుగా ఉన్నామని, భవిష్యత్తులోనూ అండగా ఉంటామని పునరుద్ఘాటించారు.

బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ
ఈ ఏడాది బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి రావడంతో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెరపడింది. అనంతరం సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గతంలో మమతా బెనర్జీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు పొందిన బాబున్.. బీజేపీ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మమతా బెనర్జీ సోదరుడు.. సువేందు అధికారికి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించడం బెంగాల్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

ఇదీ చదవండి: మంత్రులు, ఎమ్మెల్యేలతో విజయ్‌ అత్యవసర భేటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement