కాకినాడ జెడ్పీ పీఠంపై టీడీపీ కన్ను.. జనసేనకు షాక్‌! | Kakinada-ZP Chairperson Post TDP Janasena Political War | Sakshi
Sakshi News home page

కాకినాడ జెడ్పీ పీఠంపై టీడీపీ కన్ను.. జనసేనకు షాక్‌!

Nov 11 2026 9:57 AM | Updated on Nov 11 2026 10:00 AM

Kakinada-ZP Chairperson Post TDP Janasena Political War

డాక్టర్‌ బొర్రా దివ్య సునీతా రాజ్‌, పిల్లి అనంతలక్ష్మి

సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పీఠంపై కూటమిలో వార్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఈ పీఠాన్ని జనసేనకు కేటాయిస్తున్నట్లు ప్రచారం నడిచింది. చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా జనసేన నుంచి పిఠాపురానికి చెందిన డాక్టర్‌ బొర్రా దివ్య సునీతా రాజ్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆమె పెద్దాపురం జెడ్పీటీసీగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఇంకేముంది జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఆమె ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి అని అందరూ అనుకున్నారు. ఇక్కడే టీడీపీ అసలు రాజకీయం మొదలు పెట్టింది. చైర్‌పర్సన్‌ సీటుపై తమ అభ్యర్థిని కూర్చోబెట్టేందుకు సైకిల్‌ పార్టీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. 

ఈ మేరకు కాకినాడ రూరల్‌ జెడ్పీటీసీగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పేరు చైర్‌పర్సన్‌ పదవికి దాదాపు ఖరారైనట్లు తెలిసింది. దీనికి కూటమి అధిష్టానం సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. దీనికి తగినట్టుగానే పిల్లి అనంతలక్ష్మి దంపతులు సో మవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. అందు లో చైర్‌పర్సన్‌ పదవి తమదేననే స్పష్టత ఇవ్వకపోయినా.. అధిష్టానం నిర్ణయం మేరకు వ్యవహరిస్తామని ప్రకటించారు. తద్వారా చైర్‌పర్సన్‌ పీఠం తమదేనంటూ చెప్పకనే చెప్పారనే వాదన వినిపిస్తోంది.

దివ్యరాజ్‌ మనస్తాపం 
ఈ పరిణామాలతో జనసేన నాయకులు కంగు తిన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ సీటు తమకే ఖాయమని వారు వేసుకున్న అంచనాలు తాజాగా తారుమారయ్యాయి. ఈ పదవిపై బుర్రా సునీత దివ్యరాజ్‌ పెట్టుకున్న ఆశలు నీరుగారిపోయాయి. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఆమె.. జెడ్పీటీసీగా విజయం సాధించిన అనంతరం, డిక్లరేషన్‌ ఫారం తీసుకోకుండానే వెళ్లిపోయినట్లు సమాచారం. 

అక్కడ మీకు.. ఇక్కడ మాకు 
మరోవైపు తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ పీఠాన్ని జనసేన ఆశించింది. అక్కడ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పోటీలోకి దిగిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భార్య వెంకటలక్ష్మి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. దీంతో, రాజకీయ పరిణామాలు మారాయి. తూర్పు గోదావరి చైర్‌పర్సన్‌ పీఠాన్ని టీడీపీకి వదిలేసి.. కాకినాడ జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి తమకే ఇవ్వాలని జనసేన పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ పంచాయితీ కూటమి అధిష్టానం దృష్టికి కూడా వెళ్లినట్లు తెలిసింది. చైర్‌పర్సన్‌గా దివ్యరాజ్‌ను ఎంపిక చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం. 

దీనికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సైతం మద్దతు పలుకుతున్నట్లు చెబుతున్నారు. దీనిపై టీడీపీ శ్రేణుల స్పందన వేరే విధంగా ఉంది. ఇప్పటికే కీలకమైన కాకినాడ మేయర్‌ స్థానంతో పాటు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ (కౌడా) చైర్మన్‌ వంటి కీలక పదవులన్నీ జనసేనకే కట్టబెట్టారని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే, జిల్లాలోని ఆరు పురపాలక సంఘాలకు గాను ఏకంగా నాలుగు (పిఠాపురం, గొల్లప్రోలు, తుని, సామర్లకోట) చైర్‌పర్సన్‌ స్థానాలను సైతం గ్లాసుకే ఇచ్చేశారని, ఇప్పుడు జెడ్పీ చైర్‌పర్సన్‌ సీటును కూడా ఆ పార్టీకే కట్టబెట్టడమేమిటని తెలుగు తమ్ముళ్లు నిలదీస్తున్నారు. 

పట్టు వీడని టీడీపీ 
జెడ్పీ పీఠంపై టీడీపీ పట్టు వీడటం లేదు. కాకినాడ మేయర్‌ పదవిని జనసేనకు కేటాయించిన నేపథ్యంలో.. జెడ్పీ పీఠంపై తామే కూర్చోవాలనే పట్టుదలతో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారని, ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై నేడో రేపో అధికారిక ప్రకటన రావచ్చని సమాచారం. చైర్‌పర్సన్‌గా పిల్లి అనంతలక్ష్మి పేరు ఖరారు చేసినట్లు, ఆమె ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement