పులివెందుల ధర్నా కేసులో తదుపరి చర్యలు నిలిపివేత!
పోలీసుల అత్యుత్సాహానికి కళ్లెం వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు
మండల విద్యాధికారి రఫీక్ ఖాన్‌కు నోటీసులు జారీ
ఎన్నికల నిరసనపై క్రిమినల్ కేసా?
ధర్నా, నిరసన పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోని అంశాలు
వీటిపై క్రిమినల్ చట్టాలను ఎలా ప్రయోగిస్తారు?.. జగన్ తరఫు న్యాయవాది వాదనలు
అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసుల వాదన
ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తదుపరి చర్యలపై హైకోర్టు స్టే
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును నేరంగా చిత్రీకరిస్తూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసుకు హైకోర్టు బ్రేక్ వేసింది.ఎన్నికల అధికారుల తీరును నిరసిస్తూ ధర్నా చేస్తే క్రిమినల్ కేసులు ఎలా పెడతారంటూ జగన్ తరఫు న్యాయవాది బలమైన వాదనలు వినిపించారు. కేవలం ఒకచోట గుమిగూడినంత మాత్రాన నేరం చేసినట్లు కాదని, ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు క్రిమినల్ చట్టాలను ప్రయోగించలేరని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు జగన్‌పై నమోదైన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదుదారు అయిన మండల విద్యాధికారి సీఎం రఫీక్ ఖాన్‌కి నోటీసులు ఇచ్చారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.
ధర్నా చేసినందుకు కేసు
పట్టణ స్థానిక ఎన్నికల్లో పోలీసులు, ఎన్నికల అధికారుల తీరును నిరసిస్తూ ఈ నెల 1న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు పులివెందుల రిటరి్నంగ్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నా చేపట్టడం ద్వారా జగన్ తదితరులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, వీరిపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న మండల విద్యాధికారి సీఎం రఫీక్ ఖాన్, మరొకరు పులివెందుల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అవినాష్ రెడ్డిలతో సహా మొత్తం 80 మందిపై అదే రోజున కేసు నమోదు చేశారు.
కేసు కొట్టేయాలంటూ పిటిషన్
ఈ నేపథ్యంలో ఈ కేసును కొట్టేయాలని కోరుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. జగన్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన అనేది కేవలం ఎన్నికల చట్టాల పరిధిలోకి వస్తుందే కానీ, దాని ఆధారంగా నేర చట్టాల కింద నేరం ఆపాదించలేరన్నారు. అనుమతి లేకుండా ధర్నా నిర్వహించడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోని అంశాలని, వీటిపై ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
కొందరితో కలిసి ఓ సమూహంగా కలిసి మున్సిపల్ కార్యాలయానికి వచ్చినంత మాత్రాన అది నేరం అయిపోదన్నారు. జగన్ నినాదాలు చేశారని గానీ, ఎవరినైనా అడ్డుకున్నారని గానీ లేదా అమల్లో ఉన్న ఎలాంటి ఆదేశాలను ఉల్లంఘించారని గానీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేవలం ఒక ప్రదేశంలో గుమికూడినంత మాత్రాన ఆ వ్యక్తిని క్రిమినల్ బాధ్యుడిగా చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వివరించారు. ఒక సమూహంపై చేసే అస్పష్ట, సామూహిక ఆరోపణలు ప్రాసిక్యూషన్‌కు ప్రాతిపదికగా ఉండలేవని కూడా సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. జగన్ తదితరులపై నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవేనని
తెలిపారు.
అధికారులను అడ్డుకున్నారు
పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు ఎలాంటి అనుమతి లేకుండా ధర్నా చేశారన్నారు. ఎన్నికల అధికారులను, పోలీసులను అడ్డుకున్నారని తెలిపారు. తద్వారా అధికారుల విధులకు ఆటంకాలు కలిగించారని వాదించారు. ఇప్పటి వరకు 13 మంది సాక్షులను విచారించామని, అందులో పోలీసులు, అటెండర్లు, వాచ్‌మెన్ కూడా ఉన్నారని, వారంతా కూడా వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, పులివెందుల పట్టణ పోలీసులు జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.


