30 కోట్ల సంవత్సరాలకు ముందే భూగర్భంలో సూక్ష్మజీవులు | Microbial Life Dates Back 300 Million Years Beneath the Earth Surface | Sakshi
Sakshi News home page

30 కోట్ల సంవత్సరాలకు ముందే భూగర్భంలో సూక్ష్మజీవులు

Nov 11 2026 6:12 AM | Updated on Nov 11 2026 6:20 AM

Microbial Life Dates Back 300 Million Years Beneath the Earth Surface

డైనోసార్లకంటే ముందునాటివి

ఖండాల విభజనకు ముందే ఆవిర్భావం  

కోట్ల సంవత్సరాల జీవపరిణామ చరిత్రకు సాక్ష్యాలు 

తెనాలి శాస్త్రవేత్త డాక్టర్‌ షాబుద్దీన్‌ షేక్‌ పరిశోధన

రాయల్‌ సొసైటీ అంతర్జాతీయ సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితం 

కృష్ణా–గోదావరి పరీవాహక నమూనాలే పరిశోధనకు కీలక ఆధారం

తెనాలి: మన పాదాల కింద కనిపించని భూగర్భ ప్రపంచం ఒకటి ఉంది. భూమిలోని చిన్నచిన్న రంధ్రాలు, ఇసుక పొరలు, రాతి పగుళ్ల మధ్య నీరు ప్రవహించే సూక్ష్మ ఆవాసాల్లో ఎన్నో జీవులు నివసిస్తున్నాయి. వాటిలో అత్యంత ఆసక్తికరమైనవి ‘బాథినెల్లేసియా’ అనే అతి సూక్ష్మమైన మంచినీటి క్రస్టేసియన్‌ జీవులు. మన కంటికి సులభంగా కనిపించని ఈ జీవజాతి.. డైనోసార్లు భూమిపై సంచరించడానికి కోట్ల సంవత్సరాలకు ముందే భూగర్భ జలాల్లో ఉండేదని తేల్చారు.

వీటి పరిణామ చరిత్ర 300 మిలియన్‌ ఏళ్లకు పైగా ఉండొచ్చని, అంటే 30 కోట్ల సంవత్సరాలకు పూర్వమే వీటి ఉనికి ఉందని తెనాలికి చెందిన రీసెర్చ్‌ అసోసియేట్‌ డాక్టర్‌ షాబుద్దీన్‌ షేక్‌ తన తాజా పరిశోధనలో తేల్చారు. బెంగళూరులోని సెంటర్‌ ఫర్‌ ఎకలాజికల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ ప్రవీణ్‌ కారంత్‌తో కలిసి ఆయన చేసిన పరిశోధనను ‘ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది రాయల్‌ సొసైటీ’ ప్రచురించింది. ఆ విశేషాలను డాక్టర్‌ షాబుద్దీన్‌ ‘సాక్షి’కి వివరించారు. ఆయన తెలిపిన మేరకు..

 ప్రయాణ సామర్థ్యం  తక్కువే 
భూగర్భంలోని నీటి ఆవాసాల్లో నివసించే ఈ కీటకజాతి జీవులు అతి చిన్నవి. ప్రయాణాలు చేయగల సామర్థ్యం కూడా పరిమితమే. అలాంటప్పుడు ఈ జీవుల బంధువులు ప్రపంచంలోని వేర్వేరు ఖండాల్లో ఎలా ఉన్నాయనే ప్రశ్నకు సమాధానం కోసం పరిశోధకులు ఆధునిక డీఎన్‌ఏ విశ్లేషణను, ఆ జీవులకు దగ్గరి బంధువుల శిలాజాల నుంచి లభించిన ఆధారాలను కలిపి అధ్యయనం చేశారు. బాథినెల్లేసియా జీవులు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి సుదూర వలసల కంటే ప్రాచీన ఖండాల కదలికలు, విడిపోవడమే ప్రధాన కారణం. 

పాంజియా  విడిపోయి.. 
సుమారు 25 కోట్ల సంవత్సరాల కిందట భూమి ప్రస్తుతం మనకు కనిపిస్తున్నట్లుగా వేర్వేరు ఖండాలుగా లేదు. భూమి మొత్తం పాంజియా అనే ఒకే భారీ ఖండంగా ఉండేది. కాలక్రమేణా ఈ భారీ ఖండం విడిపోతూ.. ఉత్తర భాగంలో లారేషియా, దక్షిణ భాగంలో గోండ్వానాలాండ్‌  అనే రెండు ప్రధాన భూభాగాలు ఏర్పడ్డాయి. వీటి మధ్యలో టెథిస్‌ సముద్రం ఉండేది. గోండ్వానాలో భాగంగా ఉన్న ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, అంటార్కిటికా, ఆస్ట్రేలియా వంటి భూభాగాలు కాలక్రమేణా విడిపోయి వేర్వేరు దిశల్లో కదిలాయి. 

వాటిలో భారతదేశం సముద్రం గుండా ఉత్తరం వైపు ప్రయాణించి ఆసియాతో కలిసింది. ఈ భౌగోళిక మార్పుల సమయంలో అప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉన్న జీవుల పూర్వీకుల సమూహాలు కూడా విడిపోయి, కాలక్రమేణా స్వతంత్రంగా పరిణామం చెంది ఉండవచ్చు. అంటే ఈ జీవులు సముద్రాలను దాటి వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచమంతటా వ్యాపించాయి అనటంకంటే.. వాటి పూర్వీకులు నివసించిన భూభాగాలే ఖండాల కదలికలతో విడిపోయి ఉండవచ్చు.

జీవప్రపంచం మార్పు తెలుసుకోవచ్చు 
ఈ పరిశోధన ప్రాధాన్యం కేవలం ఒక చిన్న భూగర్భ జీవి పరిణామ చరిత్రను తెలుసుకోవడంలోనే లేదు. భూమిపై ఖండాలు ఎలా మారాయి, ఆ మార్పులు జీవుల వ్యాప్తి, పరిణామాన్ని ఎలా ప్రభావితం చేశాయనే విషయాలను అర్థం చేసుకోవడానికి కూడా ఇటువంటి జీవులు విలువైన ఆధారాలుగా నిలుస్తాయి. వీటి అధ్యయనంతో భూమి మారుతున్న కొద్దీ జీవప్రపంచం ఎలా మారుతూ వచ్చిందో తెలుసుకోవచ్చు. ఖండాలు విడిపోయినా, భూమి రూపురేఖలు మారినా, తమ ప్రాచీన పరిణామ చరిత్రను మోస్తూ నేటికీ భూగర్భ జలాల్లో మనుగడ సాగిస్తున్న బాథినెల్లేసియా సూక్ష్మజీవులది అద్భుత గాథ.

కృష్ణా–గోదావరి బేసిన్‌ నుంచి 300 నమూనాలు
తమ పరిశోధనలో భాగంగా 2022–24 మధ్య కృష్ణా–గోదావరి నదుల పరివాహక ప్రాంతంలోని భూగర్భ జలవనరుల నుంచి సుమారు 300 నమూనాలను డాక్టర్‌ షాబుద్దీన్‌ సేకరించారు. వీటిలో 117 నమూనాలను రూపనిర్మాణ, జన్యు విశ్లేషణలకు వినియోగించారు. దేశంలో కనిపించే వివిధ బాథినెల్లేసియా జీవుల పరిణామ సంబంధాలను తెలుసుకోవటానికి ఈ నమూనాలు కీలకంగా నిలిచాయని షాబుద్దీన్‌ చెప్పారు. జీవుల బాహ్య నిర్మాణ లక్షణాలను పరిశీలించటంతోపాటు వాటి డీఎన్‌ఏలోని రెండు జన్యుప్రాంతాలను విశ్లేషించి, ఈ సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ప్రచురితమైన సమాచారంతో పోల్చి, జీవుల మధ్య పరిణామ సంబంధాలను రూపొందించినట్టు వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement