సోనియా ఆత్మకథపై బీజేపీ విమర్శ
క్షమాపణ చెప్పాలి: వీహెచ్‌పీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత సోనియాగాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’పై విమర్శల జడి మొదలైంది. భారతీయ జనతా పార్టీతోపాటు విశ్వహిందూ పరిషత్ సైతం ఈ పుస్తకంలోని అంశాలను ప్రస్తావిస్తూ సోనియా, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు, ఆరోపణలు గుప్పించడం మొదలుపెట్టారు. ఆత్మకథ ద్వారా సోనియా 1975 నాటి ఎమర్జెన్సీని సమరి్థంచే ప్రయత్నం చేస్తున్నారని, పుస్తకం పేరును ‘వైట్‌వాషింగ్’’అని పెట్టి ఉండాల్సిందని బీజేపీ ఎద్దేవా చేసింది.
‘‘ఈ పుస్తకం అసలు ఉద్దేశం నెహ్రూ, గాంధీ కుటుంబాల చారిత్రక తప్పిదాలపై చక్కెర పూత పూయడమే’’అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సి.ఆర్.కేశవన్ ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ ఆత్మకథ మంగళవారమే విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో 1975లో అప్పటి ప్రధాని, సోనియా అత్తగారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం తప్పేనని సోనియా స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ కూడా తప్పకుండా ఇదే రకంగా భావిస్తూండవచ్చునని వ్యాఖ్యానించారు.
ఎమర్జెన్సీ విధించిన తరువాత రాజీవ్ గాంధీ తమ్ముడు సంజయ్ గాం«దీని అదుపులో ఉంచి ఉంటే ఎన్నో రకాల సమస్యలను నివారించి ఉండేవాళ్లమని కూడా సోనియా ఈ పుస్తకంలో తెలిపారు. ‘‘సోనియా గాంధీ ఈ పుస్తకం శీర్షికను బిలాంగింగ్ అని కాకుండా ‘‘వైట్ వాషింగ్’’అని పెట్టుండాల్సింది. ఎందుకంటే ఈ పుస్తకం అసలు ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ, గాంధీ కుటుంబాలు చేసిన ఘోరమైన తప్పిదాలను కప్పిపుచ్చడమే’’అని కేశవన్ తన ఎక్స్ పోస్టులో ఆరోపించారు.
‘‘బాబ్రీ మసీదు కూలి్చవేతపై తాను ఏడ్చానని సోనియా అంటున్నారు. గురుద్వారాలను లక్ష్యంగా చేసుకుని వేల మంది అమాయకులను కిరాతకంగా హత్య చేసినప్పుడు కన్నీరు కార్చారా? బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాదుల కోసమూ సోనియా ఏడ్చారట. దేశాన్ని కాపాడుతూ సరిహద్దుల్లో వీరమరణం పొందిన వారి గురించి చుక్క కన్నీరు ఒలికించారా?’’అని విమర్శించారు. దేశాన్ని దాదాపు 55 సంవత్సరాలు ఏలిన కాంగ్రెస్ పార్టీ భారత ప్రజాస్వామ్యంపై మానని గాయాలు మిగిల్చిందని అన్నారు.
హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు...
సోనియాగాంధీ హిందువుల భావనలను దెబ్బతీస్తూ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విశ్వహిందూ పరిషత్ మంగళవారం ఆరోపించింది. ఇందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ముస్లిం ఓటుబ్యాంకును కొల్లగొట్టేందుకు సోనియా మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఈ కన్నీళ్లు ఎన్నికల సమయంలో మాత్రమే వస్తూంటాయని విశ్వహిందూ పరిసత్ సెంట్రల్ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ ఆరోపించారు.
హిందువులు అణచివేతలను ఎదుర్కొన్నప్పుడు సోనియా మౌనంగా ఉండిపోయారని, ఉగ్రవాదులు, ఈ దేశంపై దండెత్తిన వారిపై చర్య తీసుకున్నప్పుడు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తూంటారని విమర్శించారు. బాబ్రీ మసీదు నిర్మాణం కూలి్చవేతపై విచారం వ్యక్తం చేసిన సోనియా, బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడ్డా పోలీసు అధికారి మోహన్ శర్మ విషయంలో మాత్రం నోరు మెదపలేదని అన్నారు. ఢిల్లీ పేలుళ్లకు కారణమైన ఈ ఉగ్రవాదుల చేతుల్లో గాయపడ్డ మోహన్‌శర్మ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన
విషయాన్ని గుర్తు చేశారు.


