భద్రత చర్యలేవీ తీసుకోకపోతే.. మళ్లీ ఇక్కడికి రావాల్సి వస్తుంది! | Sonia Gandhi New Memoir On Night Of Rajiv Gandhi Assassination | Sakshi
Sakshi News home page

భద్రత చర్యలేవీ తీసుకోకపోతే.. మళ్లీ ఇక్కడికి రావాల్సి వస్తుంది!

Nov 11 2026 5:45 AM | Updated on Nov 11 2026 5:45 AM

Sonia Gandhi New Memoir On Night Of Rajiv Gandhi Assassination

రాజీవ్‌ గాంధీ మరణంపై రాహుల్‌ వ్యాఖ్య 

రెండు నెలల ముందే హెచ్చరించిన రాహుల్‌ 

వీపీ సింగ్‌ ప్రభుత్వం ఎస్పీజీ భద్రత తొలగించింది 

ఘటనపై సమాచారం ఇచ్చింది ప్రియాంక 

ఆత్మకథలో సోనియా వెల్లడి...

న్యూఢిల్లీ: ‘‘భద్రత చర్యలేవీ తీసుకోకపోతే ‘పా’అంత్యక్రియలకు నేను మళ్లీ రావాల్సి వస్తుంది. నాకిది తెలుసు’’ఇవీ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యకు రెండు నెలల ముందు కుమారుడు రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్య. రాజీవ్‌ గాంధీ భార్య, కాంగ్రెస్‌ నేత సోనియాగాంధీ రాసిన ఆత్మకథ ‘‘బిలాంగింగ్, ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’లో ఆమె స్వయంగా ఈ విషయం తెలిపారు. 

1991 మే 21వ తేదీన తమిళనాడులోని శ్రీపెరంబదూరులో రాజీవ్‌ గాంధీ ఎల్టీటీఈ సానుభూతిపరుల ఆత్మహుతి దాడిలో మరణించిన విషయం తెలిసిందే. పూల మాల వేసే నెపంతో రాజీవ్‌ దగ్గరకు వచ్చిన ఒక మహిళ తనను తాను పేల్చేసుకుంది. ఈ క్రమంలో రాజీవ్‌గాంధీతోపాటు చుట్టుపక్కల ఉన్న దాదాపు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దురదృష్టకరమైన రోజును సోనియా తన ఆత్మకథలో గుర్తు చేసుకున్నారు. ఆనాటి ఘటనలను పాఠకులతో పంచుకున్నారు.

 రాజీవ్‌కు ఉన్న ఎస్పీజీ భద్రతను తొలగించిన ఏడాదికి ఈ హత్యోదంతం జరిగిందని చెప్పారు. 1989 డిసెంబర్‌లో ఎస్పీజీ కమిటీ భద్రత కొనసాగించాలని తీర్మానించిందని, కానీ అప్పటి వీపీ సింగ్‌ ప్రభుత్వం ఆ మరుసటి నెలలోనే ఎస్పీజీ భద్రతను ఉపసంహరించుకోవడమే కాకుండా.. పర్యటనల సందర్భంగా బాధ్యతలను స్థానిక పోలీసులకు బదిలీ చేసిందని సోనియా వివరించారు.  

రాజీవ్‌గాంధీ పర్యటనలకు వెళ్లినప్పుడల్లా తాను మంచంపై అతడి స్థలంలో పడుకునేదాన్నని, తనకు అది ఒక రకమైన తృప్తినిచ్చేదని గుర్తు చేసుకున్నారు. రాజీవ్‌ హత్య జరిగిన రోజు ప్రియాంక ఫ్రెండ్‌ బర్త్‌డే పారీ్టకి వెళ్లేందుకు సిద్ధమవుతోందని, రాహుల్‌ అమెరికాలో కాలేజీలో చదువుతున్నాడని చెప్పారు. ‘‘ఉన్నట్టుండి కారిడార్‌ నుంచి నా రూమ్‌ వైపు ఎవరో పరుగెత్తుకొస్తున్న శబ్ధం వినిపించింది. ఇతరులు ఎవరూ లేరు కాబట్టి అది ప్రియాంక అని స్పష్టమైంది. ఆమె తడబడుతూ వచ్చినట్లు అర్థమైంది. గది తలుపుదగ్గర అడుగుల చప్పుడు హఠాత్తుగా నిలిచిపోయింది. చేతిలో ఉన్న పుస్తకం మూసేశా. 

అసౌకర్యంగా విన్నా...’’‘‘తలుపులు తెరుచుకోగానే తను నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. తనను తాను సంభాళించుకుంటున్నట్లు తెలుస్తోంది. తెచ్చిపెట్టుకున్న ప్రశాంతతతో దగ్గరకొచ్చింది. ఉచ్ఛా్వసనిశ్వాసలు వేగంగా నడుస్తున్నాయి. ముఖంలో నెత్తుటి చుక్క లేనట్టుగా పాలిపోయి ఉంది. కళ్లు నేను ఎన్నడూ చూడనంత నల్లగా ఉన్నాయి’’అని ఆనాటి ఘటనను వివరించారు సోనియా. ‘ఫోన్‌ కాల్‌..బాంబు పేలుడు.. ప్రజలు చచ్చిపోతూండటం.. అన్నీ చెప్పింది. అర్జెంటుగా మద్రాసు వెళ్లాలంది. ఇవేవీ నాకు ముందు అర్థమే కాలేదు’’. ‘‘మద్రాస్‌ ఎందుకు? రాజీవ్‌ మద్రాసులో ఉన్నాడా? బాంబేమిటి? అనుకుంటున్నా. 

నాకు ప్రియాంక మాటల కన్నా గొంతు వింటూంటేనే భయంగా అనిపించింది. ఏం జరిగిందో అర్థమవగానే స్థాణువైపోయా. ఊపిరాడలేదు. నుంచున్నా.. ముందుకెళ్లి.. ప్రియాంకను కావలించుకున్నా. ఆమె గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందో అర్థమైంది.’’అని తెలిపారు.  ‘‘కూతురు చేతుల్లో ఒరిగిపోయా. నేను అతడి (రాజీవ్‌)తోపాటు వెళ్లి ఉండాల్సింది. అంటూ ఏడ్చేశా.. ఏడుస్తూనే ఉన్నా. ఎందుకు పోలేదని తిట్టుకున్నా.’’అని చెప్పుకొచ్చారు. అపనమ్మకం ఒకవైపు... ఇంకోపక్క ఆశ.. ఈ రకమైన ఉద్వేగాల్లోనే నేను స్వయంగా మిస్టర్‌ జార్జ్‌కు ఫోన్‌ చేశా. ‘‘ఒక్క విషయం చెప్పండి. ఇది నిజమేనా’’అని అడిగా. ‘‘అవును. అది నిజమే. సాహెబ్‌ ఇక లేరు’’అన్న సమాధానం వినగానే ప్రపంచమంతా చీకటైపోయినట్లు అయ్యింది’’అని వివరించారు. 

    రాజీవ్‌ గాంధీ భౌతిక అవశేషాలు విమానం ద్వారా ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వచ్చినప్పుడు తనకు ఒక్కసారి అతడిని మళ్లీ చూడాలని గట్టిగా అనిపించిందని, అతడితో గడిపిన క్షణాలు, అతడి మాట, చూపు అన్నీ గుర్తుకొచ్చాయని చెప్పారు. తల్లి ఇందిరాగాంధీ మాదిరిగానే రాజీవ్‌ కూడా తన కళ్లను దానం చేసినట్లు తెలిసిందన్నారు.  ‘‘అతడి ఆశలేమిటో ఎవరికైనా చెప్పాలని అనుకున్నా. సంక్షోభ సమయంలో మా కుటుంబంతో ఉన్న వైద్యుడి గురించి ఆలోచించా.. ‘‘డాక్టర్‌ మాథుర్‌ ఉన్నారా?’’అని అడిగా. అతడితో అర్జెంటుగా మాట్లాడాలి. ఇప్పుడే. చాలా ముఖ్యం అని చెప్పారు. 

అయితే వైద్యుడి సమాధానం చేదుగా అనిపించింది... ‘‘కళ్లా.. అరే... ఏం మాట్లాడుతున్నారు. ఏమీ మిగల్లేదు. ఏమీ లేదు’’అనడంతో పిడుగు పడినట్లు అయ్యింది. కడుపు మొత్తం తిప్పినట్లు అయ్యింది. ఊపిరి ఆడలేదు. చచ్చిపోదామనుకున్నా’’అని రాసుకొచ్చారు.  చివరకు రాహుల్‌ అమెరికా నుంచి రానే వచ్చాడని.. ఓ మిత్రుడు ఫోన్‌ చేసి.. ‘‘చెడు వార్త. అని అనగానే.. ‘‘పాపా చనిపోయాడు కదూ’’అని రాహుల్‌ స్పందించాడు. రాహుల్‌ను గట్టిగా హత్తుకున్నా నేను. రాహుల్‌ షెడ్యూల్‌లో కొంత తేడా రావడంతో సరిపోయింది, లేదంటే అతడు కూడా శ్రీ పెరంబదూర్‌లో రాజీవ్‌ పక్కనే నిలుచుని ఉండాల్సింది. ఇప్పుడు తండ్రి అవశేషాల పక్కన చలనం లేకుండా నుంచున్నాడు ’’అని సోనియా ఆ రోజును గుర్తు చేసుకున్నారు.  

క్యాన్సర్‌తో నా పోరాటం 
‘‘యూపీఏ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. 2010లో రొమ్ము కేన్సర్‌ ఉండవచ్చునని వైద్యులు చెబితే భయపడిపోయా. మీడియాలో చర్చలు నివారించేందుకు ఇటలీలోని మిలాన్‌ స మీపంలోని ఆసుపత్రిలో శస్త్రచికిత్స ద్వా రా రెండు కణితులు తొలగించుకున్నా. ఆ తరువాత ఏడాదికి కాలేయంలో ఇంకో కణితిని గుర్తించారు. వైద్యుల సలహా మేరకు నెదర్లాండ్స్‌లో ఇంకో సర్జరీ జరిగింది. అదృష్టవశాత్తు ఈ కణితిని ప్రారంభ దశలోనే గుర్తించామని వైద్యులు చెప్పారు.’’

సిక్కు వ్యతిరేక అల్లర్లు చరిత్రలోనే చీకటి అధ్యాయం 
‘‘1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు మాటలకు అందని విషాదం. భారతదేశ చర్రితలో చీకటి అధ్యాయం. సిగ్గు చేటైన విషయం. రాజీవ్‌ వ్యక్తిత్వంలో విద్వేషం, ప్రతీకారం వంటి భావనలు అస్సలు లేవు. అయితే పరిపాలన వైఫల్యాలు, అమానుష ఘటనలు దేశాన్ని కుదిపేస్తున్న పరిస్థితుల్లో ఒకానొక చారిత్రక ఘట్టంలో బలవంతంగా భాగం కావాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ హత్య జరిగిన రోజే రాజీవ్‌ జాతీయ టెలివిజన్‌లో మాట్లాడుతూ శాంతికి పిలుపునిచ్చారు. ప్రధానిగా ఎంపికైన తరువాత అతడు చేసిన మొట్టమొదటి పని అదే. ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ప్రాంతాలను స్వయంగా సందర్శించాడు. సిబ్బంది సాయంతో సిక్కు సహోద్యోగుల యోగక్షేమాలు చూశారు. 

నవంబరు ఒకటవ తేదీ మళ్లీ వీధుల్లోకి వెళ్లి సామాన్యులతో మాట్లాడారు. ప్రతీకార వాంఛ వద్దని నిగ్రహంగా ఉండాలని కోరారు. ఆ మరుసటి రోజు కూడా రాజీవ్‌ టెలివిజన్‌లో మాట్లాడారు ఇందిర మాటలు ‘‘రక్తం చిందించకండి. ద్వేషాన్ని వదిలేయండి’’అన్న మాటలు గుర్తు చేశారు. ఇప్పుడు ఆ బాధాతప్త రోజులను, ఇందిర హత్య తరువాత జరిగిన విధ్వంసాన్ని గుర్తు చేసుకుంటే దేంట్లోనూ స్పష్టత కనిపించదు. షాక్, భయం, రాజీవ్, నా పిల్లల జీవితాలపై ఆందోళనలు మాత్రమే గుర్తొస్తాయి. ‘‘ఇందిర హత్య జరిగిన రోజే చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ ఎ.ఎస్‌.వైద్యకు ఆదేశాలు అందాయి. అయితే ఢిల్లీకి దగ్గరలో ఉన్న యూనిట్లలో సిక్కులు ఎక్కువగా ఉన్నారన్న కారణంతో ఆయన భద్రత కోసం ఆ యూనిట్లను ఉపయోగించలేకపోయారని తరువాత తెలిసింది. ఆ అల్లర్లకు సంబంధించి హత్యలకు పాల్పడ్డ పలువురు ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలపై కూడా కేసులు నమోదయ్యాయి.’’

వెనకుండి నడిపించలేదు  
‘‘యూపీఏ ప్రభుత్వంలో ‘బ్యాక్‌ సీట్‌ డ్రైవర్‌’పాత్ర పోషించలేదు. మన్మోహన్‌  ప్రభు త్వాన్ని, నేను పార్టీని నడిపించాము. ప్రధాని సలహాలిచ్చినా.. తుది నిర్ణయం మాత్రం ఆయనదే. పార్టీ, ప్రభుత్వాల మధ్య వారధిలా ప్రణబ్‌ ముఖర్జీ, అర్జున్‌ సింగ్, ఏకే ఆంటోనీ, అహ్మద్‌ పటేల్‌ల కోర్‌ గ్రూప్‌ వ్యవహరించింది. 2010లో ‘‘పైస్థాయిలో మార్పు అవసరం కావచ్చు’’అని ప్రణబ్‌ ముఖర్జీ వ్యాఖ్యానించారు. నేను అది ప్రధాని పదవిపై ఆయన ఆసక్తిగానే భా వించా. ప్రభుత్వ ఫైళ్లను చూడ లేదు, పరిపాలనలో జోక్యం చేసుకోలేదు’’

ఇంకా ఏం రాశారంటే..
రాహుల్, ప్రియాంక అడ్డుకున్నారు
‘‘2004 ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ పార్టీ గెలిచినా ప్రధాన మంత్రి పదవి చేపట్టబోనని ప్రియాంక, రాహుల్‌లకు స్పష్టం చేశాను. ఇందిర, రాజీవ్‌ల హత్య తరువాత ప్రధానమంత్రి పదవి చాలా ప్రమాదకరమైన బాధ్యతని వాళ్లూ భావించారు. పార్టీ నేతల ఒత్తిడి కారణంగా ఒకానొక సందర్భంలో సరే అన్నానని అనుకుని రాహుల్, ప్రియాంకలు వద్దే వద్దని గట్టిగా చెప్పారు. రాత్రంతా ఆలోచించిన తర్వాత తిరస్కరించాలని నిర్ణయించుకున్నా. నిజాయితీ, పరిపాలనా అనుభవం, సమర్థత కలిగిన నాయకుడు అని నమ్మడం, అందరికీ ఆమోదయోగ్యుడు కావడం వల్లనే డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను ప్రధాని పదవికి ఎంపిక చేశాను.’’

మోదీతో పెద్ద పరిచయాల్లేవు... 
‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు వ్యక్తిగత సంబంధాలు పెద్దగా లేవు. అధికారిక సమావేశాల్లో లేదంటే శుభాకాంక్షలు చెప్పుకునేటప్పుడు మాత్రమే కలుసుకోవడం. అయితే ఎప్పుడు ఎదురైనా నేరుగా కళ్లలో కళ్లు పెట్టి చూడరు. భారతదేశమంటే సమగ్రత, లౌకికవాదం, సామాజిక న్యాయం అన్నది నా ఆలోచన. మోదీ ఆలోచనలపై ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాల ప్రభావం కనిపిస్తుంది’’

ఇందిరా గాంధీ ముక్కోపి... 
‘‘అత్తగారు ఇందిరా గాంధీ గారికి అప్పుడప్పుడు చాలా కోపం వచ్చేది. సిబ్బంది ఎవరైనా తప్పు చేస్తే మూలన నుంచోబెట్టేవారు. కొన్నిసార్లు మాట్లాడకుండా ఉండేవారు. పార్లమెంటులో ఇబ్బందికర పరిస్థితులు వస్తే ఆ కోపం ఇంట్లో భోజనం చేసేటప్పుడు చూపేవారు. రాజీవ్, సంజయ్‌లు ఇద్దరూ కోపం తగ్గే వరకు మౌనంగా ఉండేవారు. మనవలు పుట్టిన తర్వాత ఆమె కోపం బాగా తగ్గింది’’

మేనకతో చెడింది ఎక్కడంటే... 
సంజయ్‌ గాంధీ మేనకాను 1973లో కలిశారు. ఏడాది లోపే వివాహమూ అయిపోయింది. మొదట్లో బాగుండేది కానీ.. వారిద్దరి మధ్య తగాదాలు పెరగడం కుటుంబ సంబంధాలు మొత్తం ప్రభావితమయ్యాయి. మేనక సంజయ్‌ను కట్టడి చేయడానికి బదులు అతడి రాజకీయ కార్యకలాపాలకు ప్రోత్సాహమిచ్చారని ఇందిర అనుకునే వారు. మేనక కారణంగా అన్నదమ్ముల మధ్య సంబంధాలూ దెబ్బతిన్నాయి. 1980 జూన్‌ 23న సంజయ్‌ విమాన ప్రమాదంలో మరణించిన తరువాత మేనక తల్లి సంజయ్‌ మద్దతుదారులతో మేనకకు రాజకీయ పాత్ర ఇవ్వాలని చెప్పించారు. 

ఇది ఇందిరాగాం«దీకి ఏమాత్రం ఇష్టం కాలేదు. పసిబిడ్డ అయిన కొడుకు (వరుణ్‌ గాం«దీ)ను చూసుకుంటే మేలని భావించారు. అయితే మేనక వరుణ్‌ మొదటి పుట్టిన రోజును బీజేపీతో సంబంధాలున్న వసుంధర రాజే ఇంట్లో జరపడంతో ఇందిరకు కోపం వచ్చింది. మేనక గాంధీకి చెందిన ‘సూర్యా’మేగజైన్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడు ఒకరికి అమ్మడం ఇందిర కోపాన్ని మరింత పెంచింది. పార్టీ వ్యతిరేక పనులకు పాల్పడవద్దని, లేదంటే ఇంకోచోట ఎక్కడైనా ఉండాలని ఆజ్ఞాపించారు. దీంతో మేనక.. ఇందిర, రాజీవ్‌లతో పాటు నాపైనా ఆరోపణలు గుప్పిస్తూ ఇల్లు వదిలారు.’’

తొలి చూలును కోల్పోయి... 
‘‘1968లో తొలిసారి గర్భం దాల్చా. గాంధీ కుటుంబంలో ఆనందం నెలకొంది. 1969 జనవరి 18న నెలలు నిండకుండానే కాన్పు జరిగింది. కొడుకు పుట్టాడు. ఆరోగ్యంగానే కనిపించాడు. రాజీవ్‌ కూడా పెద్ద కొడుకును బాగా ఇష్టపడ్డాడు. కానీ.. మరుసటి రోజు ఉదయమే 6.30 గంటల ప్రాంతంలో కను్నమూశాడు. రాజీవ్, నేను చాలా బాధపడ్డాం. పర్యటనలో ఉన్న అత్తగారు కూడా అర్ధంతరంగా తిరిగి ఆసుపత్రికి వచ్చారు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం బిడ్డను దహనం చేయకూడదు కాబట్టి అంత్యక్రియలపై ఇంట్లో తర్జనభర్జనలు నడిచాయి. నదిలో వదిలేద్దామన్నారు. నాకు అది ఏమాత్రం ఇష్టం లేకపోయింది. ఓక్లా బ్యారేజీ వద్ద బిడ్డ శవం తేలుతున్న చిత్రం కళ్లముందు కదలాడింది. చివరకు మెహ్రోలీలోని ఫిరోజ్‌ గాంధీ ఫామ్‌హౌస్‌లో బోగన్‌విల్లా గుబురు కింద బిడ్డను ఖననం చేశాం. ఆ సమయంలో రైట్‌ వింగ్‌ న్యూస్‌ పేపర్‌ బిడ్డ గురించి రాసిన కథనం నా బాధను మరింత పెంచింది.ఆ తర్వాత కొంతకాలానికి 1970 జూన్‌ 19న రాహుల్‌ గాంధీ జన్మించారు’’  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement