రాజీవ్‌ను వేడుకున్నా.. కానీ రాహుల్‌ను అడ్డుకోలేదు: సోనియా | Sonia Gandhi Begged Husband Not To Enter Politics But Did not Stop Rahul | Sakshi
Sakshi News home page

రాజీవ్‌ను వేడుకున్నా.. కానీ రాహుల్‌ను అడ్డుకోలేదు: సోనియా

Nov 10 2026 3:24 PM | Updated on Nov 10 2026 3:30 PM

Sonia Gandhi Begged Husband Not To Enter Politics But Did not Stop Rahul

సాక్షి, న్యూఢిల్లీ: తన భర్త రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావొద్దని అప్పట్లో తాను వేడుకున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ వెల్లడించారు. కానీ తన కుమారుడు రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు మాత్రం తాను అడ్డుకోలేదని ఆమె తెలిపారు. తన జీవిత విశేషాలతో రాసిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ అనే జ్ఞాపకాల పుస్తకంలో ఈ విషయాలను ఆమె వెల్లడించారు.

రాహుల్‌కు చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉండేదని సోనియా పేర్కొన్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీతో కలిసి పలుమార్లు అమేథీ ప్రాంతానికి వెళ్లిన రాహుల్.. అప్పట్లో అక్కడ ఉన్న గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులను దగ్గరగా చూసి తెలుసుకున్నారని తెలిపారు. అంతేకాదు రాహుల్‌ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలోనూ భారత రాజకీయాలను నిశితంగా గమనించేవారని ఆమె చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్‌ను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కోరడంతో.. తనతో పాటు, ప్రియాంక గాంధీతో చర్చించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. దాంతో 2004 మార్చిలో అమేథీ నుంచి పోటీ చేస్తానని రాహుల్ ప్రకటించగా.. సోనియా గాంధీ పక్కనే ఉన్న రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగారు.

రాజీవ్ విషయంలో ఒకలా.. రాహుల్ విషయంలో మరోలా..
‘‘రెండు దశాబ్దాల క్రితం రాజీవ్ రాజకీయాల్లోకి రావొద్దని వేడుకున్నాను. ఆ ప్రమాదకరమైన ప్రపంచంలోకి వెళ్లి మనందరినీ ఇబ్బందుల్లోకి నెట్టవద్దని కోరాను. కానీ ఇప్పుడు నా కుమారుడి వంతు వచ్చినప్పుడు నేను అడ్డుకోలేదు’’ అని సోనియా తన పుస్తకంలో పేర్కొన్నారు.

2004 ఎన్నికల్లో అమేథీ నుంచి ఘన విజయం సాధించిన రాహుల్.. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు, వ్యాపారాలను తీసుకురావడంతో పాటు ఆ ప్రాంతంలో ఓ మంచి కంటి ఆసుపత్రిని కూడా ఆయన ఏర్పాటు చేశారని వెల్లడించారు. అంతేకాదు ప్రియాంక అమేథీలో మహిళల కోసం స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారని, అవి క్రమంగా ఉత్తర భారతదేశంలోనే అతిపెద్ద సంఘాలుగా ఎదిగాయని సోనియా తన పుస్తకంలో వివరించారు.

ఇదీ చదవండి: జెన్సన్ హువాంగ్‌కు ఎలాన్ మస్క్ మద్దతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement