చింపిరి గడ్డం వేసుకుని కేటీఆర్‌ ఊరూరా తిరుగుతున్నారు: రేవంత్‌ | Revanth Reddy slams ktr | Sakshi
Sakshi News home page

చింపిరి గడ్డం వేసుకుని కేటీఆర్‌ ఊరూరా తిరుగుతున్నారు: రేవంత్‌

Nov 8 2026 11:00 PM | Updated on Nov 8 2026 11:00 PM

Revanth Reddy slams ktr

హైదరాబాద్: ప్రజలు తనకు అడిగినదానికంటే ఎక్కువ ఇచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలతో ముఖాముఖి కార్యక్రమంలో  పాల్గొన్న రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు.

‘‘దీపావళి పండుగ ఉన్నా.. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని ఇక్కడికి వచ్చిన ఆడపడుచులందరికీ ధన్యవాదాలు. మీరే నా కుటుంబం.. నా ఆత్మబంధువులు. మా ఆడపడుచుల ఆశీర్వాదంతోనే ఇంత ఉన్నత స్థానానికి ఎదిగా. అడిగినదానికంటే ఎక్కువ మీరు నాకు అందించారు. 

ఇక జీవితంలో నేను ఆశించేది ఏమీ లేదు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళతానని మాట ఇస్తున్నా. 70 లక్షల మంది ఆడబిడ్డలు మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరారు. 2034 నాటికి కోటి మంది సభ్యులు కావాలి… కోటి మందిని కోటీశ్వరులను చేయాలనేదే మా లక్ష్యం. 

ఏమీ ఆశించకుండా ఇంటిల్లిపాది అవసరాన్ని చూసుకునేది ఆడబిడ్డనే. ఆడబిడ్డ చేతిలో పెత్తనం ఉంటేనే ఇల్లు బాగుపడుతుంది. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపని మహిళలకే అప్పగించాం. ప్రతి ఏటా 15 నుంచి 20 కోట్ల రూపాయల వ్యాపారాన్ని మహిళలు చేసుకోగలుగుతున్నారు. 

పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వాములను చేశాం. సచివాలయం సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లు నిర్వహణ ఆడబిడ్డలకు అప్పగించాం. 34 నెలల్లో మహిళలకు 79 వేల కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు అందించాం. ఈ సందర్భంగా మంత్రి సీతక్కను అభినందిస్తున్నా. ఈ రోజు 4.5 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే అందులో ఒంటరి మహిళలు, వితంతు మహిళలకు 3.5 లక్షల పెన్షన్లు మంజూరు చేశాం. 

నేత, గీత కార్మికులకు కొత్త పెన్షన్లు సాచ్యురేషన్ మోడ్ లో మంజూరు చేశాం. మీ ధైర్యం ఇందిరమ్మ ఇండ్లు.. మీ ధైర్యం 200 యూనిట్ల ఉచిత కరెంటు. ప్రతి రోజు 37 లక్షల మంది ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఆడబిడ్డల కోసం ఆర్టీసీకి నగదు చెల్లించి లాభాల బాటలోకి తీసుకొచ్చాం. ఏ ముఖ్యమంత్రి అయినా సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచన చేశారా? మీ సంతోషమే నా సంతోషం. మీకోసమే నేను కష్టపడుతున్నా. 

మా ఆడబిడ్డల ఆశీర్వాదమే నాకు శక్తి. అందుకే మీ మధ్య నా పుట్టినరోజు జరుపుకోవాలని వచ్చా. మహిళలు వ్యాపారవేత్తలు కావాలి.. పారిశ్రామికవేత్తలు కావాలి. నేను ముఖ్యమంత్రిగా ఉండగానే కోటి మంది ఆడబిడ్డలు కోటీశ్వరులను చేస్తే నా జన్మధన్యం. ఆడబిడ్డలకు సారెగా చీర పెట్టా. సొంత చెల్లెలిని ఇంటి నుంచి బయటకు గెంటేసిన దుర్మార్గుడు కేటీఆర్. 

ఆయన మహిళలను ఉద్ధరిస్తానని మాట్లాడుతున్నారు. చింపిరి గడ్డం వేసుకుని ఊరూరా తిరుగుతున్నారు. సొంత చెల్లెలే ఆయన ఘనకార్యం గురించి చెబుతుంది. పదేళ్లు అధికారం ఇస్తే ఏం చేశారో.. ఏమిచ్చారో అడగండి. మీ అన్నగా మీ తమ్ముడిగా సేవలందించే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఆడబిడ్డలారా.. నిలబడండి.. నిలదొక్కుకోండి. పారిశ్రామిక వేత్తలుగా మారండి. బిడ్డలను చదివించుకోండి.. చదువే మీ జీవితాలను మారుస్తుంది. ఆడబిడ్డల్ని ఉన్నత చదువులు చదివించండి’’ అని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement