సర్వ సన్నద్ధంగా ఉండండి! | Defence Forces must maintain highest level of operational readiness | Sakshi
Sakshi News home page

సర్వ సన్నద్ధంగా ఉండండి!

Nov 8 2026 4:51 AM | Updated on Nov 8 2026 4:51 AM

Defence Forces must maintain highest level of operational readiness

త్రివిధ దళాలకు రక్షణ మంత్రి పిలుపు

భద్రత పరిస్థితులు సంక్లిష్టమయ్యాయని వ్యాఖ్య

పరోక్ష యుద్ధాలకు ప్రాధాన్యం పెరుగుతోంది

బాగ్దోరా (పశ్చిమ బెంగాల్‌): భారతీయ రక్షణ దళాలు అత్యున్నత స్థాయి యుద్ధ సన్నద్ధతను కొనసాగించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శనివారం పిలుపునిచ్చారు. దేశ భద్రత పరిస్థితులు రోజు రోజుకూ సంక్లిష్టంగా మారుతున్నా యని, సంప్రదాయ యుద్ధానికి మించిన ముప్పు ఎదుర్కొవాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆయన ఓ వ్యూహాత్మక వైమానిక క్షేత్రంలో చెప్పారు. 

పశ్చిమ బెంగాల్‌లోని దేశ తూర్పు సరిహద్దుల్లో ఉన్న ఈ క్షేత్రంలో దీపావళి సంబరాలు జరుపుకున్న మంత్రి మాట్లాడుతూ ఇటీవలి కాలంలో శత్రువులు ప్రత్యక్ష యుద్ధం కంటే సైబర్‌ దాడులు, సమాచార యుద్ధం, డ్రోన్ల గుంపులతో పరోక్ష యుద్ధం చేసేందుకే మొగ్గు చూపుతున్నారని హెచ్చరించారు.  బలహీనతలను గుర్తించి వాటిపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. 

సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా స్థానికుల్లో, మిలిటరీలోనూ అనుమానాలు సృష్టించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ పాత్ర సాధారణ సైనికుడికి మించి ఉంటుందని సూచించారు. 

సరిహద్దుల వెంబడి కాల్పుల కాలం చెల్లిపోయి, సైబర్‌ ముప్పు, సమాచారం సాయంతో యుద్ధం, ప్రచారం ఎలా జరుగుతోందన్న అంశాన్ని నియంత్రించడం, కొత్త కొత్త టెక్నాలజీలు రంగంలోకి వస్తున్న నేపథ్యంలో సైన్యం కూడా ఏకకాలంలో చాలా అంశాలపై అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. మిలిటరీ సిబ్బంది ఆయా విషయాలపై అవగాహన పెంచుకోవాలని, అప్పుడే ముప్పులను సమర్థంగా ఎదుర్కొవడం సాధ్యమవుతుందని చెప్పారు. 

ఈశాన్య భారతంలో భారత వ్యూహాత్మక అవసరా లకు, భద్రతకూ బాగ్దోరా కీలకమని స్పష్టం చేసిన మంత్రి ఇక్కడి వాయుసేన సిబ్బంది స్థైర్యాన్ని, సన్నద్ధతను కొనియాడారు. మిలిటరీ సిబ్బంది ప్రవర్తన స్థానికుల్లో రక్షణ దళాలపై ఉండే అభిప్రాయాన్ని మారుస్తుంది కాబట్టి వారితో సత్సంబంధాలు పెంచుకోవాలని సూచించారు.

ఆత్మనిర్భరతకు కట్టుబడి ఉన్నాం..
భారతదేశం ఆత్మనిర్భరత సాధించే విషయంలో కట్టుబడి ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో భారతీయ స్టారప్‌ కంపెనీలు, పరిశ్రమలు డ్రోన్లు, యాంటీ డ్రోన్‌ వ్యవస్థలు, అత్యాధునిక డిఫెన్స్‌ టెక్నాలజీలను అభివృద్ధి చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. త్రివిధ దళాలు కూడా స్వదేశీ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడం ద్వారా డ్రోన్‌ ఆపరేషన్లు, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో కొత్త సామర్థ్యాలను సంపాదించుకుంటున్నాయని కొనియాడారు.

 భారతీయ సాయుధ దళాలు టెక్నాలజీ రంగంలో మరింత ముందడుగు వేయాలని, భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దీపావళి పండుగ సమయంలో కుటుంబానికి దూరంగా ఉన్న విషయం తనకు తెలుసునని చెబుతూ సైనికుల నిబద్ధతకు, దేశభక్తికి దేశం రుణపడి ఉందని అన్నారు. వాయుసే ముఖ్యాధికారి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అశుతోశ్‌ దీక్షిత్, బాగ్దోరా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ ఎయిర్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఎయిర్‌ కమడోర్‌ మనీశ్‌ శర్మ, వాయుసేన సీనియర్‌ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement