ప్రజలందరి జీవితాల్లో సంతోషాలు వెల్లివిరియాలి  | PM Narendra Modi Diwali Message to the Nation | Sakshi
Sakshi News home page

ప్రజలందరి జీవితాల్లో సంతోషాలు వెల్లివిరియాలి 

Nov 8 2026 4:35 AM | Updated on Nov 8 2026 4:35 AM

PM Narendra Modi Diwali Message to the Nation

మోదీ దీపావళి శుభాకాంక్షలు  

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం దేశ ప్రజలకు దివ్వెల పండుగ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా మన వీర జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనబోతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియాలో ఒక వీడియో సందేశం పోస్టుచేశారు. దీపావళి పండుగను ప్రతి ఏటా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటానని పేర్కొన్నారు. 

దీపావళి సందర్భంగా మన దేశం దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోందని, ఇది చీకటికి వ్యతిరేకంగా దేశం తీసుకున్న సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో ప్రజలందరి జీవితాల్లో శాంతి, సమృద్ధి, సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే, ఈసారి ఏ సైనిక కేంద్రంలో దీపావళి పండుగను జరుపుకోనున్నారనే విషయాన్ని మోదీ వెల్లడించలేదు. అంతకుముందు, ప్రభుత్వ ‘జన్‌ సంపర్క్‌’పోర్టల్‌లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పోస్టుచేశారు. దీపావళి పండుగ చీకటిపై వెలుగు, చెడుపై మంచి, నిరాశపై ఆశ సాధించే శాశ్వత విజయానికి నిదర్శనమని స్పష్టంచేశారు. 

ఉప రాష్ట్రపతి నివాసానికి మోదీ 
ప్రధాని మోదీ శనివారం ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు పరస్పరం దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మోదీ ఉపరాష్ట్రపతి నివాసానికి వెళ్లగా, అక్కడ రాధాకృష్ణన్‌ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఉప రాష్ట్రపతికి పండుగ శుభాకాంక్షలు తెలియజేసినట్లు మోదీ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు.   

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుభాకాంక్షలు 
దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ విలువలతో ప్రేరేపితమైన దేశభక్తి గల యువత ‘వికసిత్‌ భారత్‌’నిర్మాణంలో ఉత్సాహంగా భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం సందేశం ఇచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement