ఘనంగా పదో దీపోత్సవం
పాల్గొన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
అయోధ్య: శ్రీరాముని జన్మస్థలం అయోధ్యాపురిలో శనివారం దీపోత్సవం కన్నులపండువగా సాగింది. సరయూ నదీ తీరాన అయోధ్య నగర వాసులు 36 లక్షల దివ్వెలను వెలిగించి, భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. నదీ తీరం దివ్వెల కాంతులతో వెల్లి విరిసింది. 2025లో 26,17,215 మట్టి ప్రమిదలతో 9వ దీపోత్సవం గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈసారి అంతకుమించి, 10 లక్షల దివ్వెలను అదనంగా వెలిగించినట్లు నిర్వాహకులు తెలిపారు.
రామ్ కీ పైడి సహా 56 ఘాట్లలో 36 లక్షల దీపాల కాంతులు శ్రీరాముని కాలం నాటి త్రేతాయుగం వాతావరణం స్పురణకు తెప్పించిందన్నారు. దివ్వెల్లో నూనె వేసేందుకు, వత్తులు అమర్చేందుకు వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు సహా 35 వేల మంది వలంటీర్లు పాల్గొన్నారని వివరించారు.
రామ్ కీ పైడి ఘాట్‌లో జరిగిన దీపోత్సవంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొని దివ్వెలను వెలిగించారు. ఉత్సవం సందర్భంగా త్రీడీ హాలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ మ్యాపింగ్‌తో కూడిన లేజర్ షో, డ్రోన్ షోలతో ఆకాశంలో రామాయణంలోని ప్రముఖ ఘట్టాలు, సన్నివేశాలను సాక్షాత్కరింపజేశారు.
అయోధ్యకు శ్రీరాముని రాకను పురస్కరించుకుని పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. వేడుకలను పురస్కరించుకుని అయోధ్య నగరంలోని ఆలయాలు, వీధులు, ప్రధాన రహదారులు, ప్రభుత్వ, మత సంబంధ భవనాలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ప్రజలు తమ నివాసాల్లో దీపాలను వెలిగించారు. సరయూ నదీ తీరంతోపాటు నగరంలో శ్రీరామ్, జై రామ్, జై జై రామ్, జై సియా రామ్, సియావర్ రామచంద్ర కీ జై నినాదాలు మిన్నంటాయి. దీపోత్సవానికి ముందు సీఎం యోగి తన మంత్రివర్గ సహచరులతో కలిసి రామ్ కథా పార్కులో పూజలు నిర్వహించారు.


