‘ఎమర్జెన్సీ’ నిర్ణయం పొరపాటే  | Sonia Gandhi has described the imposition of the Emergency as a mistake | Sakshi
Sakshi News home page

‘ఎమర్జెన్సీ’ నిర్ణయం పొరపాటే 

Nov 8 2026 4:01 AM | Updated on Nov 8 2026 4:01 AM

Sonia Gandhi has described the imposition of the Emergency as a mistake

ఇందిరా గాంధీ కూడా కాలక్రమేణా అదే అభిప్రాయానికి వచ్చారు  

అత్యవసర పరిస్థితి ఆమెపై తీవ్ర భారాన్ని మోపింది  

సంజయ్‌ గాందీని అదుపు చేసి ఉంటే నష్టం చాలావరకు తగ్గేది  

‘గార్డియన్‌’ ఇంటర్వ్యూలో సోనియా గాంధీ వెల్లడి  

10న ‘బిలాంగింగ్‌:  ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’విడుదల  

న్యూఢిల్లీ:  దేశంలో అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ) విధించాలన్న నిర్ణయం పొరపాటేనని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ పేర్కొన్నారు. తన అత్తగారు, అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కూడా కాలక్రమేణా అదే అభిప్రాయానికి వచ్చారని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. త్వరలో రాబోతున్న తన జీవిత చరిత్ర ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’పుస్తకంలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. 

సంజయ్‌ గాంధీని అదుపులో ఉంచి ఉంటే ఎమర్జెన్సీ విధించిన తర్వాత జరిగిన నష్టంలో చాలా వరకు నివారించి ఉండేవారని అభిప్రాయపడ్డారు. తన ఆత్మకథ ఆవిష్కరణకు ముందు బ్రిటిష్‌ దినపత్రిక ‘గార్డియన్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనియా గాంధీ మాట్లాడుతూ... ‘‘ఇందిరా గాంధీ హృదయపూర్వకంగా ఒక ప్రజాస్వామ్యవాది అని నేను ఎప్పుడూ భావిస్తాను. 

దీనికి చాలామంది నవ్వుతారని నాకు తెలుసు. కానీ, ఎమర్జెన్సీ సమయంలో ఆమె ఎప్పుడూ సౌకర్యంగా లేరని నమ్ముతున్నాను. అది ఆమెపై తీవ్ర భారాన్ని మోపిందని అనుకుంటున్నాను’’అని వెల్లడించారు. ఎమర్జెన్సీ నిర్ణయంపై తమ కుటుంబంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని స్పష్టంచేశారు. ‘‘ఎమర్జెన్సీ విధించాలన్న నిర్ణయాన్ని సోనియా గాంధీ భర్త రాజీవ్‌ గాంధీ వ్యతిరేకించారు.

వచ్చే ఎన్నికల వరకు వేచి ఉండాలని తన తల్లి ఇందిరా గాందీకి చెప్పారు. కానీ, ఇందిర చిన్న కుమారుడు సంజయ్‌ గాంధీ మాత్రం ఎమర్జెన్సీ పట్టుబట్టారు. ప్రతిపక్షం తన తల్లిపై కక్షగట్టిందని, ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవాలని ఒక విందులో సంజయ్‌ వాదించారు’’అని సోనియా గాంధీ చెప్పినట్లు ‘గార్డియన్‌’పత్రిక నివేదించింది. రాజీవ్‌ గాంధీ తన తల్లిని నిలదీయడానికి ప్రయత్నించినప్పుడు ఆమె వినడానికి నిరాకరించడంతో కుటుంబంలో ఉద్రిక్తత పెరిగినట్లు సోనియా గాంధీ ఆ ఇంటర్వ్యూలో వివరించారు.   

జీవితం అక్కడే ఆగిపోయినట్లు భావించాను  
తన అత్తగారు ఇందిరా గాంధీ హత్యకు గురైన రోజు తన గుండెల్లో ఎవరో కత్తి దించినట్లు అనిపించిందని సోనియా గాంధీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి పదవిని స్వీకరించవద్దని, అలా చేస్తే ప్రాణాలకే ప్రమాదమని తన భర్త రాజీవ్‌ గాందీని అదే రోజు వేడుకున్నానని చెప్పారు. ‘ఎలాగూ వారు నన్ను చంపేస్తారు’అంటూ ఆయన బదులిచ్చారని వెల్లడించారు. 1984 అక్టోబర్‌ 31న ఇందిర హత్యకు గురైన రోజును అత్యంత దురదృష్టకరమైన రోజుగా సోనియా అభివర్ణించారు. ‘‘మా అత్తగారు మా ఇంటి పక్కనే ఉన్న భవనంలోని తన కార్యాలయానికి వెళ్తుండగా నేను నా గదిలోకి తిరిగి వచ్చాను. 

నేను స్నానం మొదలుపెట్టబోతుండగా, టపాకాయల పేలుళ్లలాంటివే కానీ విభిన్నమైన వరుస శబ్దాలు విన్నాను. నేను ఒక్క సారిగా స్తంభించిపోయాను. ఎవరో నా బాత్‌రూమ్‌ తలుపును ఆత్రుతగా, గట్టి గా బాదుతున్నారు. ఆమె నా పిల్లల సంరక్షకురాలు ఒంగ్ము. నేను బాత్‌రూమ్‌ తలుపు తీశాను. ఒంగ్ము ఏమీ మాట్లాడలేక, తోట వైపు సైగలు చేస్తోంది. అత్తగారు హత్యకు గురయ్యారని తెలిశాక గుండె నోట్లోకి వచ్చినంతగా ఆగిపోయాను. తీవ్రమైన ఆందోళన, భయం. నాకు ఊపిరాడనట్లు అనిపించింది. ఊపిరి తీసుకోలేకపోయాను. జీవితం అక్కడే ఆగిపోయినట్లు భావించాను. చాలా సమయం వరకు తేరుకోలేకపోయాను’’అని వివరించారు.  

12 ఏళ్లుగా ప్రజాస్వామ్యం, 
వ్యవస్థలకు తీవ్ర నష్టం  గత 12 ఏళ్లుగా భారతదేశ ప్రజాస్వామ్యం, వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని సోనియా గాంధీ ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయిన తర్వాత దేశంలోని వ్యవస్థలను తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి చాలా సమయం పడుతుందని పేర్కొన్నారు. ప్రజల్లో ఇప్పుడు అసహనం మొదలైందని, జరుగుతున్న నష్టాన్ని వారు గుర్తిస్తున్నారని తెలిపారు. తాను ఆశావాదంతో ఉన్నానని, ప్రజలు సరైన పరిపాలన కోరుకుంటున్నారని చెప్పారు. దేశం మళ్లీ గాడిన పడాలంటే ఎంతో కృషి చేయాల్సి ఉంటుందని అన్నారు. 

అధికార బీజేపీ దేశంలో అన్ని వ్యవస్థలను, ముఖ్యంగా ఎన్నికల సంఘాన్ని గుప్పిట్లో పెట్టుకుందని, ప్రధాన స్రవంతి మీడియాను నియంత్రిస్తోందని, ధనబలాన్ని, మతాన్ని వారు వాడుకుంటోందని చెప్పారు. అయినప్పటికీ తమ పార్టీ గట్టిగా పోరాడుతోందని, నానాటికీ పురోగమిస్తోందని వెల్లడించారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అన్ని రకాల వేధింపులను ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి గ్రామంలోనూ, ప్రతి జిల్లాలోనూ కాంగ్రెస్‌ శ్రేణులు రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం గట్టిగా పోరాడుతున్నాయని ప్రశంసించారు. 

కాంగ్రెస్‌ పార్టీ భావసారూప్యత కలిగిన ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తోందని, ఎన్నికల్లో తమ విజయావకాశాలు రోజురోజుకూ మెరుగుపడుతున్నాయని సోనియా స్పష్టంచేశారు. 2004లో తాను ప్రధానమంత్రి పదవిని అంగీకరించి ఉంటే.. యూపీఏ సర్కార్‌ విధానాలు, కాంగ్రెస్‌ వ్యూహం భిన్నంగా ఉండేవని తాను అనుకోవడం లేదన్నారు. ఆ ఆలోచన తన మదిలోకి ఎప్పుడూ రాలేదని చెప్పారు. తాము ఒక జట్టుగా కలిసి పనిచేశామని వివరించారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని నడిపించగా, తాను పార్టీని నడిపించానని అన్నారు. నవంబర్‌ 10న తన పుస్తకం విడుదల కాబోతోందని, అప్పుడు కొంత ‘తమాషా’జరగడం ఖాయమని వ్యాఖ్యానించారు.  

ఆ సమయంలో భగవద్గీత దారి చూపింది  
రాజకీయాలంటే తనకు పెద్దగా ఇష్టం ఉండేది కాదని సోనియా అన్నారు. భర్త రాజీవ్‌ గాంధీ హత్య తర్వాత రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్న విషయంలో తీవ్ర అంతర్మథనానికి లోనయ్యాయని చెప్పారు. ఆ సమయంలో తన సందేహాలను భగవద్గీత తొలగించిందని, ముందుకు సాగే మార్గాన్ని చూపిందని వెల్లడించారు. 

1990వ దశకంలో కాంగ్రెస్‌ పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో.. రాజీవ్‌ గాందీ, ఇందిరా గాంధీల చిత్రపటాల ముందు నుంచి వెళ్ళిన ప్రతిసారీ తన మనసులో వేదన, అపరాధభావం కలగలిసిన ఒక రకమైన భావన కలిగేదని పేర్కొన్నారు. పిల్లలు రాహుల్‌ ప్రియాంక గాందీలు తనతో తీవ్రంగా వాదించారని ఆమె గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్తే తనను కూడా కోల్పోతామని వారు భయపడ్డారని చెప్పారు. అయితే, ఆ సమయంలో ఎన్నో సందేహాలకు భగవద్గీతలో తనకు సమాధానాలు దొరికాయని స్పష్టంచేశారు. భగవద్గీత తనకు దారి చూపిందని తెలియజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement