ఓట్ల చోరీ తర్వాత.. ప్రజల వాహనాల్లో పెట్రోల్ చోరీ: రాహుల్ గాంధీ | Rahul Gandhi Fires On Narendra Modi Govt Over Petrol Issue | Sakshi
Sakshi News home page

ఓట్ల చోరీ తర్వాత.. ప్రజల వాహనాల్లో పెట్రోల్ చోరీ: రాహుల్ గాంధీ

Nov 7 2026 4:34 PM | Updated on Nov 7 2026 4:45 PM

Rahul Gandhi Fires On Narendra Modi Govt Over Petrol Issue

సాక్షి, న్యూఢిల్లీ: ఓట్ల చోరీ (Vote Chori) ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తాజాగా పెట్రోల్ చోరీ అంటూ మరో వివాదాన్ని తెరపైకి తెచ్చారు. దేశంలో విక్రయిస్తున్న ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (E20)లో నిర్ణీత 20 శాతం కంటే ఎక్కువ ఇథనాల్ కలుపుతున్నారని ఆయన ఆరోపించారు.

కర్ణాటకలోని ఏడు జిల్లాల నుంచి సేకరించిన 14 పెట్రోల్ నమూనాలను పరీక్షించగా.. అందులోని 11 నమూనాల్లో ఇథనాల్ శాతం 20కి మించి ఉన్నట్లు వెల్లడైందని రాహుల్ పేర్కొన్నారు. అంతేకాదు కొన్ని నమూనాల్లో ఏకంగా 31.2 శాతం వరకు నమోదైందని తెలిపారు. ఈ మేరకు రాహుల్ ఎక్స్‌లో పోస్టు చేస్తూ.. 'E20 కాస్తా 420గా మారింది.. ప్రజల వాహనాల్లోని పెట్రోల్‌ను దోచుకుంటున్నారు' అంటూ విమర్శించారు.

ఇథనాల్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల వాహనాల మైలేజీ తగ్గడంతో పాటు వాహనాల నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు పెట్రోల్ బంకుల్లోని ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ ఉందో వెల్లడించేలా లేబుళ్లు అక్కడ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు కూడా సిద్ధమని రాహుల్‌ మరోసారి సవాల్ విసిరారు.

కర్ణాటక ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి రిజ్వాన్ అర్షద్ కూడా ఇదే అంశంపై స్పందించారు. బెంగళూరు, కోలార్, చిక్కబళ్లాపూర్, మంగళూరు, తుమకూరు సహా ఏడు జిల్లాల నుంచి సేకరించిన నమూనాలను బెంగళూరులోని గుర్తింపు పొందిన శ్రిరామ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పరీక్షించినట్లు తెలిపారు. ఐఓసీఎల్ నమూనాలో 31.2 శాతం, హెచ్‌పీసీఎల్ నమూనాలో 30.5 శాతం ఇథనాల్ ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైందని పేర్కొన్నారు.

అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఖండించాయి. పరీక్షల విధానంపై సందేహాలు వ్యక్తం చేశాయి. బీఐఎస్ నిబంధనల ప్రకారం E20 పెట్రోల్‌లో ఇథనాల్ శాతం 19 నుంచి 21 మధ్యే ఉంటుందని స్పష్టం చేశాయి. కర్ణాటక ప్రభుత్వం పేర్కొన్న పరీక్షా ఫలితాలు సరైన సాంకేతిక, చట్టబద్ధ విధానాల ప్రకారం నిర్వహించిన పరీక్షల ఆధారంగా లేవని తెలిపాయి.

మరోవైపు, ఇథనాల్ మిశ్రమ ఇంధన కార్యక్రమం వల్ల 1.97 లక్షల కోట్ల రూపాయలకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందని, సుమారు 316 లక్షల మెట్రిక్ టన్నుల ముడిచమురు దిగుమతులు తగ్గాయని చమురు సంస్థలు వెల్లడించాయి. అలాగే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గడంతో పాటు రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు జరిగినట్లు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: మత్తులో మునిగే ముఖ్యమంత్రి  డ్రగ్స్‌పై పోరాడగలరా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement