సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డిపై అక్రమ కేసు దుర్మార్గమైన చర్య అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వెంగళాయపాలెం బ్యాలెట్ బాక్స్ మాయం చేయాలని అధికారులు చూశారు. అధికారులు బ్యాలెట్ బాక్స్‌లు మాయం చేయడాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు అడ్డుకున్నారు. న్యాయం కోసం ధర్నా చేస్తున్న అప్పిరెడ్డి సహా వైఎస్సార్‌సీపీ నేతలపై లాఠీచార్జ్ చేశారు’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
‘‘బ్యాలెట్ బాక్స్‌లు తీసుకెళ్లే అధికారి డెకాయిట్టా..? ధర్నా చేసినవారా?. పోలీసులు రక్షణలో టీడీపీ నేతలు, అధికారులు దౌర్జన్యం చేస్తున్నారు. లేళ్ల అప్పిరెడ్డి మీద టీడీపీ నేతలు చాలా కక్షపెట్టుకున్నారు. అన్యాయాలను అడ్డుకుంటే అక్రమ కేసులు పెడుతున్నారు. లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్ట్‌ను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. దోపిడీ చేస్తున్నవారికి రక్షణ, దోపిడీ అడ్డకుంటే శిక్షా?. రక్షించాల్సిన పోలీసులే.. భక్షిస్తుంటే ఏం చేయాలి?. రాష్ట్రంలో ప్రజలే ఆయుధాలు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.’’ అని అంబటి వ్యాఖ్యానించారు.
పెట్రోలు బాంబులు వేస్తున్నా పోలీసులు అడ్డుకోవడం లేదు. టీడీపీ నేతలు, అధికారులు, పోలీసులు కలిసిపోయారు. న్యాయబద్ధంగా పోలింగ్ జరగడం లేదని.. ప్రజలు కూడా ఓటు వేయడానికి రావడం లేదు. ఏలేశ్వరంలో సైకిల్ గుర్తు మీద గుద్దిన బ్యాలెట్‌లను అధికారులే కలిపేశారు. బ్యాలెట్ బాక్స్ ఏమైనా కూరగాయల బుట్ట అనుకుంటున్నారా?. బ్యాలెట్ బాక్స్‌తీసుకెళ్లడానికి పీవో ఎవరు?. బ్యాలెట్ బాక్స్ దొంగతనం చేసిన పీవోను సస్పెండ్ చేయాలి’’ అని లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: బ్యాలెట్ బాక్స్‌లో ఓట్లు మాయం


