తూర్పుగోదావరి జిల్లా: దేవరపల్లి మండలంలోని జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి దివ్య (23) అనారోగ్యంతో రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గారపాటి దివ్య జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసింది. గురువారం పోలింగ్ అనంతరం మధ్యాహ్నం ఆమె అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
చికిత్స అంనంతరం రాత్రి ఇంటికి తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం ఆమె అనారోగ్యానికి గురికాగా, చికిత్స కోసం మళ్లీ రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. దివ్యకు నాలుగు నెలల క్రితం బాబు పుట్టగా, అంతకు ముందు ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


