సాక్షి, తిరుపతి: ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కాలేజీ కౌంటింగ్ కేంద్రం దగ్గర గందరగోళం నెలకొంది. కౌంటింగ్ కేంద్రంలో రాజకీయ పార్టీల ఏజెంట్ల సెల్ ఫోన్ డిపాజిట్‌పై స్పష్టత కరువైంది. అధికారులు, పోలీసుల మధ్య సమన్వయం లేకపోవడంతో కౌంటింగ్ సిబ్బంది డైలామాలో పడ్డారు. సెల్ ఫోన్లతో వచ్చిన కౌంటింగ్ సిబ్బందిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. విలువైన సెల్ ఫోన్లు ఎక్కడ డిపాజిట్ చేయాలంటూ కౌంటింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా వ్యాప్తంగా 8 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కౌంటింగ్ కేంద్రల్లో ఎంపీటీసీతోపాటు జెడ్పీటీసీల ఓట్లు లెక్కింపు చేపట్టనున్నారు. ప్రధానంగా తిరుపతిలోని ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాలలో అత్యధికంగా 8 మండలాలకు చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు చేయనున్నారు.
ఉదయం 8 నుంచి లెక్కింపు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎంపీటీసీ ఫలితాలు, సాయంత్రం 6–7 గంటలకు జెడ్పీటీసీ ఫలితాలు వెల్లడించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 31 జెడ్పీటీసీలకు 126 మంది పోటీలో ఉన్నారు. అలాగే 302 ఎంపీటీసీలకు 832 మంది బరిలో ఉన్నారు.
ఇదీ చదవండి: తిరుపతి జిల్లాలో బస్సు ప్రమాదం


