సాక్షి, అమరావతి : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార దాహానికి అధికారులు, ఉద్యోగులు సమిధలవుతున్నారు. ప్రజాబలం లేకుండా స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ చేస్తున్న దాష్టీకాలతో ఒకవైపు అధికారులు, మరో వైపు సామాన్య ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఇది ప్రస్ఫుటమవుతోంది. ప్రతిదశలోనూ, ప్రతి అంకంలోనూ అధికారగణం చంద్రబాబు ఆదేశాలకు దాసోహమై విధులు నిర్వర్తించాల్సివస్తోంది. అధికారులు, ఉద్యోగుల బలహీనతలను ఆసరా చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వారిని భయపెట్టి పెత్తనం చెలాయిస్తోంది. ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేయని ఉద్యోగులు, అధికారులపై బదిలీ వేటు, కేసులు నమోదు తప్పదనే ముందస్తు హెచ్చరికలు చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఉద్యోగుల ప్రైవేట్ సంభాషణల్లో ఇది స్పష్టంగా వినవస్తోంది.
చివరకు రిటర్నింగ్ అధికారులను ప్రభుత్వం తమ చెప్పుచేతల్లో ఉంచుకుని చెప్పినట్టు పని చేయించుకుంటోంది. వారికున్న అధికారాలను సైతం లాక్కుని కట్టుబానిసల్లా మార్చేసింది. చిత్తూరు జిల్లాలో ఓ రిటర్నింగ్ అధికారి తనపై ఉన్న పైస్థాయి ఒత్తిడి కారణంగా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల నామినేషన్లు తీసుకోలేనని తన నిస్సహాయతను వ్యక్తం చేయడమే ఇందుకు నిదర్శనం. తమ కళ్లెదుటే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను అధికార పార్టీ నాయకులు చింపేసినా చర్యలు తీసుకోవడం కాదుకదా కనీసం నోరు మెదపలేని దుస్థితిలో ఎన్నికల అధికారులు ఉండడం చంద్రబాబు దాషీ్టకాలకు మరో ప్రబల ఉదాహరణగా నిలుస్తోంది. అనంతపురం జిల్లా చిత్రచేడులో ఎన్నికల సిబ్బందిని బెదిరించి 984 బ్యాలెట్ల పేపర్లపై ముద్రలు వేసుకున్నారని ఎన్నికల కమిషన్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రాణం తీసిన ఒత్తిడి
ఎన్నికల సిబ్బందిపై చంద్రబాబు ప్రభుత్వం మోపుతున్న ఒత్తిడి ఓ ఉద్యోగిని బలి తీసుకుంది. అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలానికి చెందిన ఉపాధ్యాయురాలు హరిత గౌడ్ (57) గురువారం కూడేరు మండలం కడదరకుంట పోలింగ్ కేంద్రంలో ఏపీవోగా విధుల్లో ఉన్నారు. పోలింగ్ జరుగుతుండగానే ఆమె గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందారు. ఉద్రిక్తతకు కేంద్రంగా మారిన మండలం అది. మరుట్లలో పట్టపగలే బ్యాలెట్ బాక్స్ ఎత్తుకెళ్లడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో విధులు నిర్వహించాల్సి రావడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనై మృతి చెందినట్టు తెలుస్తోంది. తుఫాన్ హెచ్చరికలు ఉన్నా ఎన్నికల తేదీ మార్చకపోవడంతో యాదవోలులో సిబ్బంది నీళ్లలో నిలబడి విధులు నిర్వహించాల్సి వచ్చింది. అన్నిచోట్లా పోలింగ్ విధులు నిర్వహించడం ఉద్యోగులకు కత్తిమీద సాములా మారింది. ఎన్నికల విధిని ఒకప్పుడు బాధ్యతగా భావించిన ఉద్యోగులు, ఇప్పుడు ఆ డ్యూటీ అంటేనే వణికిపోయే పరిస్థితి వచ్చింది.
కోర్టు బోనులో నిలబడాల్సిందే..
అసలు సమస్య ఎన్నికల తర్వాతే మొదలవుతుంది. నామినేషన్ల తిరస్కరణలు, ఉపసంహరణలు, ఏకగ్రీవాలపై పలువురు అభ్యర్థులు ఇప్పటికే న్యాయస్థానం తలుపు తట్టారు. ఆ కేసుల్లో బోనులో నిలబడేది ఎన్నికల విధుల్లో సంతకాలు చేసిన ఉద్యోగులే. ఆదేశాలిచి్చన మంత్రులు, ఎమ్మెల్యేలు కాదనే విషయం వారికి తెలిసినా నోరు విప్పలేని పరిస్థితి.. చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు, ఐఆర్ సహా అన్నీ ఇచ్చేస్తామని చెప్పి అధికారం చేజిక్కించుకున్న తరువాత అవేమీ నెరవేర్చకపోగా, వారిని రాజకీయ చదరంగంలో పావులుగా మార్చేశారు. ఈ ఎన్నికల్లో అవకతవకలపై కోర్టు మెట్లు ఎక్కే సమయంలో తమకు అండగా నిలిచేదెవరనే ప్రశ్న ఇప్పుడు ఉద్యోగ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది.


