ప్రపంచంలో ఏ దేశంలో యుద్ధం జరిగినా.. దాని ప్రభావం తప్పకుండా మిగతా దేశాలపై కూడా పడుతుంది. ముఖ్యంగా చమురు విషయంలో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం.. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. అయితే తాజాగా.. ఈ యుద్ధం ముగిసే అవకాశాలు కనిపించడంతో చమురు ధరలు తగ్గుముఖం పట్టడం మొదలైంది.
బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో.. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒక దశలో బ్యారెల్‌కు 94 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. ఆ తర్వాత కొంత పెరిగి 97.7 డాలర్లకు చేరుకుంది. అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడానికి కారణం.. యుద్ధం ఒక కారణమని ట్రంప్ అంగీకరించారు. దీన్నిబట్టి చూస్తే బహుశా యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని సమాచారం.
భారతదేశంపై ప్రభావం
చమురు ధరలు తగ్గితే.. భారతదేశంలో కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. ఎందుకంటే.. మన దేశానికి అవసరమైన ముడి చమురులో ఎక్కువ భాగాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. కాబట్టి, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగితే.. మనం ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల దేశంపై ఆర్థిక భారం పెరుగుతుంది. గత అక్టోబర్‌లో భారత క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 119.9 డాలర్లకు చేరుకుంది. అయితే.. తాజాగా ఈ ధర 103.8 డాలర్లకు చేరింది. ఇంకా తగ్గే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక్కడ హోర్ముజ్ జలసంధి కూడా చాలా కీలకమైనది. ఎందుకంటే.. ఇది పశ్చిమాసియా దేశాల నుంచి ప్రపంచంలోని అనేక దేశాలకు చమురు రవాణా చేసే ముఖ్యమైన మార్గం. ఇరాన్ కొన్ని దేశాలకు చెందిన వాణిజ్య నౌకలకు రవాణా పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వడంతో భారత్‌కు చమురు సరఫరా మెరుగుపడుతుందనే ఆశలు పెరిగాయి. ముఖ్యంగా.. మన దేశంలోని రిఫైనరీలకు పశ్చిమాసియా నుంచి వచ్చే చమురు చాలా అవసరం. సరఫరా పెరిగితే చమురు ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది.
చమురు సంస్థలకు ఉపశమనం
చమురు ధరలు తగ్గడం వల్ల ముందు ప్రయోజనం పొందేవి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ నుంచి ముడి చమురును కొనుగోలు చేసి పెట్రోల్, డీజిల్‌ను విక్రయిస్తాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు వాటి కొనుగోలు ఖర్చులు కూడా పెరుగుతాయి. కానీ.. ఆ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే పెంచలేకపోతే ఒక్కో లీటరు అమ్మకంపై నష్టాలను భరించాల్సి వస్తుంది. ఇప్పుడు చమురు ధరలు తగ్గితే ఈ కంపెనీలకు కొంత ఉపశమనం లభిస్తుంది.
సామాన్య ప్రజలకు ఊరట
చమురు ధరలు తగ్గితే.. సామాన్య ప్రజలకు కూడా కొంత ఉపశమనం కలుగుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకపోతే రవాణా ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. వస్తువుల తయారీ, రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉంటుంది. వంట గ్యాస్ ధరలపై కూడా ఒత్తిడి తగ్గవచ్చు. అయితే అంతర్జాతీయంగా.. చమురు ధరలు తగ్గిన వెంటనే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని చెప్పలేం. ఎందుకంటే ప్రభుత్వ పన్నులు, రూపాయి విలువ, ఇతర ఖర్చులు కూడా ధరలను ప్రభావితం చేస్తాయి.
ఇదీ చదవండి: గడ్కరీ చెప్పిన కొత్త కారు.. నవంబర్ 26న లాంచ్ ఫిక్స్!


