లాభాల వెలుగులో బుల్స్ వీరవిహారం
మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు షాక్
క్రూడ్ కూల్.. కొనసాగిన ఎఫ్‌ఐఐల కొనుగోళ్ల జోరు
2,009 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్
3 నెలల గరిష్టానికి నిఫ్టీ.. 576 పాయింట్లు జంప్
ముంబై: ‘దీపావళి పటాసులు దలాల్ స్ట్రీట్‌లో ముందుగానే పేలాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయం, అనూహ్యంగా దిగొచ్చిన క్రూడాయిల్ ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల భారీ కొనుగోళ్లతో గురువారం బెంచ్‌మార్క్ సూచీలు 2.50% ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ ఏకంగా 2,009 పాయింట్లు పెరిగి 79,310 వద్ద స్థిరపడింది, నిఫ్టీ 576 పాయింట్లు బలపడి 24,537 వద్ద నిలిచింది. ఈ సూచీకిది మూడు నెలల గరిష్టం.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో రోజంతా స్థిరమైన ర్యాలీ చేశాయి. ఒక దశలో సెన్సెక్స్ 2,169 పాయింట్లు ఎగసి 79,470 వద్ద, నిఫ్టీ 613 పాయింట్లు దూసుకెళ్లి 24,580 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి.
→ బీఎస్‌ఈలో రంగాల వారీగా ఆటో 4.13%, ఫైనాన్షియల్ సరీ్వసెస్ 3.37%, ప్రైవేట్ బ్యాంక్స్ 3.64%, పీఎస్‌యూ బ్యాంక్స్ 3.15%, కన్జూమర్ డి్రస్కేషనరీ 2.77% రాణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.8%, స్మాల్‌క్యాప్ 1.22% లాభపడ్డాయి.
→ ప్రపంచ మార్కెట్లలో దక్షిణ కొరియా (5.5%), తైవాన్ (–3.3%), జపాన్ (–1.8%) నష్టపోగా.. హాంగ్‌కాంగ్ (3.5%), ఇండోనేషియా (2.2%) లాభపడ్డాయి. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్లు అరశాతం లాభపడ్డాయి. అయితే, బుధవారం రాత్రి భారీ ర్యాలీ చేసిన యుఎస్ స్టాక్ మార్కెట్లు లాభాల స్వీకరణతో గురువారం 2 శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ట్రంప్‌కు షాక్.. బుల్స్ రాక్స్!
అమెరికా మధ్యంతర(మిడ్‌టర్మ్) ఎన్నికల ఫలితాలు అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ సెనేట్, ప్రతినిధుల సభ రెండింటినీ చేజిక్కించుకోవడంతో ఇరాన్‌పై కొనసాగుతున్న యూఎస్–ఇజ్రాయెల్ యుద్ధానికి ముగింపు పలకాలనే ఒత్తిడి ట్రంప్‌పై పెరగనుంది. అలాగే వర్ధమాన దేశాలపై వాణిజ్య సుంకాల విధింపు విధానాల్లో అమెరికా సడలింపు ధోరణి అవలంబిస్తుందన్న అంచనాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి.
చమురు పతనంతో భారీ ఊరట
పశి్చమాసియా ఉద్రిక్తతలతో భగభగలాడుతున్న ముడిచమురు ధరలు అనూహ్యంగా పతనమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ఏకంగా 10 శాతం క్షీణించి కీలకమైన 100 డాలర్ల స్థాయిని కోల్పోయింది. 94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది.
ఎఫ్‌ఐఐల కొనుగోళ్ల పరంపర
భారతీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) కొనుగోళ్లు జోరుందుకున్నాయి. నవంబర్ మొదటి 3 సెషన్లలోనే రూ.17,235 కోట్ల విలువైన కొనుగోళ్లు జరిపిన ఎఫ్‌ఐఐలు... గురువారం ఒక్కరోజే ఏకంగా రూ.14,975 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. బడ్జెట్‌లో ఎల్‌టీసీజీ పన్నుపై సానుకూల నిర్ణయం వెలువడుతుందనే వార్తలు మార్కెట్‌కు కలిసొచ్చాయి.
బాంబే కోటెడ్ స్పెషల్ స్టీల్స్ లిస్టింగ్ భళా..!
బాంబే కోటెడ్ స్పెషల్ స్టీల్స్ లిస్టింగ్ మెప్పించింది. ఇష్యూ ధర (రూ.82)తో పోలిస్తే బీఎస్‌ఈలో 12.21% ప్రీమియంతో రూ.92.02 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 18% ఎగసి రూ.96.62 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 15.38% లాభంతో రూ.94.61 వద్ద ముగిసింది.
ఇన్వెస్టర్ల సంపద @ రూ. 500 లక్షల కోట్లు
గడిచిన ఆరు వరుస సెషన్లలో స్టాక్ మార్కెట్ 8 శాతానికి పైగా రాణించడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.30 లక్షల కోట్లు పెరిగింది. ఫలితంగా తొలిసారిగా రూ.500 లక్షల కోట్ల చారిత్రక మార్కును అధిగమించింది. గురువారం ఒక్క రోజే ఇన్వెస్టర్లకు రూ.9 లక్షల కోట్ల సంపద జతకావడంతో, జీవితకాల గరిష్టమైన రూ.501.61 లక్షల కోట్లకు (5.31
ట్రిలియన్ డాలర్లు) చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించింది.


