టాటా మోటార్స్ కార్ల యజమానులకు కేంద్ర సైబర్ భద్రతా సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. కంపెనీకి చెందిన iRA 2.0, iRA.ev మొబైల్ యాప్‌లలో నాలుగు భద్రతా లోపాలను గుర్తించినట్లు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వెల్లడించింది. వీటికి ‘హై’ రిస్క్ స్థాయిని కేటాయించింది. ఈ లోపాలను హ్యాకర్లు ఉపయోగించుకుంటే వినియోగదారుల రహస్య సమాచారం, వాహన వివరాలను పొందడంతోపాటు, యజమానులుగా నటించి కొన్ని సేవలను అనధికారికంగా వినియోగించే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఏ వెర్షన్లకు ముప్పు?
సెర్ట్‌ఇన్ తాజాగా విడుదల చేసిన సలహా ప్రకారం.. iRA 2.0 వెర్షన్ 26.7.3, అంతకంటే పాత వెర్షన్లు, iRA.ev వెర్షన్ 26.7.2, అంతకంటే పాత వెర్షన్లు ప్రభావితమవుతాయి. ఈ యాప్‌ల ద్వారా కారు లొకేషన్, వాహన ఆరోగ్య పరిస్థితి, ప్రయాణ వివరాలు తెలుసుకోవడంతోపాటు డోర్ లాక్‌లు, ఇతర రిమోట్ ఫీచర్లను నియంత్రించవచ్చు. అందువల్ల యాప్‌లలోని భద్రతా లోపాలు వాహన సంబంధిత సేవలకు ముప్పుగా మారే అవకాశం ఉంది.
నాలుగు రకాల భద్రతా లోపాలు
యాప్‌లలో సర్వీస్ ఖాతాల వివరాలు, ఏపీఐ కీలు, అనుమతి టోకెన్లు ముందుగానే పొందుపరచడం మొదటి లోపం. వీటిని హ్యాకర్లు సేకరిస్తే కంపెనీ బ్యాకెండ్ సేవల్లోకి అనధికారికంగా ప్రవేశించే ప్రమాదం ఉంది. వెబ్ కంటెంట్‌ను ధ్రువీకరించడంలో లోపాలు, యాప్ లాగ్స్‌లో యూజర్ ధ్రువీకరణ టోకెన్లు నమోదవడం, ఎస్‌ఎస్‌ఎల్ సర్టిఫికెట్ భద్రతా తనిఖీలను సరిగా అమలు చేయకపోవడం మిగిలిన మూడు సమస్యలుగా సెర్ట్‌ఇన్ గుర్తించింది. వీటి ద్వారా వినియోగదారుల ఖాతాలను దుర్వినియోగం చేయడం, సమాచారాన్ని సేకరించడం లేదా మార్పులు చేయడం సాధ్యమవుతుందని పేర్కొంది.
టాటా మోటార్స్ ఏమంటోంది?
ఈ హెచ్చరికపై టాటా మోటార్స్ స్పందించింది. గుర్తించిన లోపాలను ఇప్పటికే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, అదనపు భద్రతా చర్యల ద్వారా సరిచేసినట్లు తెలిపింది. iRA 2.0 కోసం 26.8.2, iRA.ev కోసం 26.9.1 వెర్షన్లను విడుదల చేసినట్లు వెల్లడించింది. ఈ అప్‌డేట్లు వరుసగా ఆగస్టు, సెప్టెంబర్ 2026లో అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. క్రియాశీల వినియోగదారులకు అప్‌డేట్లు పూర్తయ్యాయని, మిగిలిన వారిని కూడా సంప్రదిస్తున్నట్లు తెలిపింది.
అంతేకాకుండా, వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, వాహన వివరాలు లేదా ఖాతాలపై అనధికారికంగా దాడి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కంపెనీ స్పష్టం చేసింది. వినియోగదారులు తమ ఫోన్‌లోని సంబంధిత యాప్‌లను తెరిచి తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.


