‘సైబర్‌ ఉగ్రవాదుల’ నుంచి ‘బ్యాంకింగ్‌’ను రక్షించుకోవాలి  | Safeguard financial institutions against cyber terrorists says PM Narendra Modi | Sakshi
Sakshi News home page

‘సైబర్‌ ఉగ్రవాదుల’ నుంచి ‘బ్యాంకింగ్‌’ను రక్షించుకోవాలి 

Oct 26 2026 3:38 AM | Updated on Oct 26 2026 4:06 AM

Safeguard financial institutions against cyber terrorists says PM Narendra Modi

ఆధునిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం  

ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ  

భువనేశ్వర్‌లో ఆర్బీఐ డేటా సెంటర్, సైబర్‌ సెక్యూరిటీ శిక్షణ సంస్థ ప్రారంభం  

భువనేశ్వర్‌: ప్రపంచంలో యుద్ధాలు ఇకపై కేవలం సాంప్రదాయ పద్ధతుల్లోనే కాకుండా, ఆర్థిక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని కూడా జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అందుకే మన దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థను ‘సైబర్‌ ఉగ్రవాదుల’నుండి రక్షించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. ఆదివారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన రూ.169 కోట్ల విలువైన డేటా సెంటర్, సైబర్‌ సెక్యూరిటీ శిక్షణ సంస్థను మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రసంగించారు. 

ఈ డేటా సెంటర్, శిక్షణ సంస్థ ఒడిశా ప్రజలకే కాకుండా దేశానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. సైబర్‌ ముప్పుల స్వభావం నానాటికీ మారుతోందని, పాత వ్యవస్థలు, పాత శిక్షణ పద్ధతులు, పాత పరికరాలతో దేశం ఇటువంటి కొత్త సవాళ్లను ఎదుర్కోలేదని తేల్చిచెప్పారు. ఇందుకోసం ఆధునిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరమని ఉద్ఘాటించారు. అందుకే డేటా సెంటర్, సైబర్‌ సెక్యూరిటీ శిక్షణా సంస్థను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఇవి మన కొత్త ప్రాధాన్యతను ప్రతిబింబిస్తున్నాయని తెలియజేశారు. ‘వికసిత్‌ భారత్‌’కు తూర్పు భారతదేశం శక్తివంతమైన వృద్ధి చోదకంగా ఆవిర్భవిస్తోందని ప్రశంసించారు.  

సామాన్యులకు సైతం బ్యాంకింగ్‌ సేవలు  
భారతదేశ డిజిటల్‌ ఆర్థిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో, సాంకేతిక స్వయం సమృద్ధిని పెంపొందించడంలో డేటా సెంటర్, సైబర్‌ సెక్యూరిటీ శిక్షణ సంస్థల ప్రాముఖ్యతను ప్రధానమంత్రి వివరించారు. ఆర్థికాభివృద్ధి ఫలాలను ప్రతి ప్రాంతానికి, ప్రతి పౌరుడికి చేరవేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మారుతున్న దృక్పథానికి ఈ డేటా సెంటర్‌ ఒక నిదర్శనమని ఆయన ఉద్ఘాటించారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌పై మోదీ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పాలనలో సామాన్య ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలు అందకుండా చేశారని ఆరోపించారు.

 పేదల పేరుతో బ్యాంకులను జాతీయం చేశారని, అయితే 2014 నాటికి దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు బ్యాంకింగ్‌ వ్యవస్థకు దూరంగా ఉన్నారని చెప్పారు. 2014 తర్వాత ఈ పరిస్థితి మారిందని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక బ్యాంకింగ్‌ సేవలను సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చామని స్పష్టంచేశారు. గతంలో ధనవంతులకే పరిమితమైన క్రెడిట్‌ కార్డులు, డెబిట్‌ కార్డులు నేడు అందరికీ అందుతున్నాయని గుర్తుచేశారు. 

ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా, ఒడిశా గవర్నర్‌ బ్రజ్‌మోహన్‌ రామ్, ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్‌ ఓరామ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ... ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటంలోనూ, నిరంతర ఆర్థిక వృద్ధికి తోడ్పడటంలోనూ పటిష్టమైన మౌలిక సదుపాయాల వ్యూహాత్మక ప్రాముఖ్యతను ప్రస్తావించారు. కొత్త డేటా సెంటర్‌లో ఆర్‌బీఐ కీలకమైన వ్యవస్థలైన ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ వంటివి ఉంటాయని చెప్పారు. ఈ శిక్షణా సంస్థ సైబర్‌ సెక్యూరిటీ, ఏఐ, ఇతర సాంకేతికతలలో మానవ వనరుల నైపుణ్యాన్ని పెంపొందిస్తుందని స్పష్టంచేశారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement