ఎల్లలు లేని వెలుగుల దివ్వెలు..! ఆయా దేశాల్లో ఎలా జరుపుకుంటారంటే.. | diwali 2026: These Countries Celebrate Diwali 2026 | Sakshi
Sakshi News home page

ఎల్లలు లేని వెలుగుల దివ్వెలు..! ఆయా దేశాల్లో ఎలా జరుపుకుంటారంటే..

Nov 5 2026 3:58 PM | Updated on Nov 5 2026 4:12 PM

diwali 2026: These Countries Celebrate Diwali 2026

మనదేశంలో దీపావళి అంటే దీపాల కాంతులు, బాణసంచా చప్పుళ్లు,  ఘుమఘుమలాడే పిండివంటలు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ, ఈ పండుగ వెలుగులు ఒక్క భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాయి. ఈ వేడుకలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో నేపథ్యంతో, భిన్నమైన ఆచారాలతో, సంప్రదాయాలతో కోలాహలంగా నిర్వహించుకుంటారు.

ఇక్కడ జంతువులకూ పండుగే!
మన పొరుగు దేశమైన నేపాల్‌లో దీపావళిని ‘తిహార్‌’ లేదా ‘స్వంతి’ అని పిలుస్తారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో మనుషులతో పాటు జంతువులకూ ఇక్కడ అత్యంత ప్రాధాన్యతనిస్తారు. వీరు మొదటి రోజు కాగ్‌ తిహార్‌ (కాకుల రోజు)ని నిర్వహించుకుంటారు. 

అంటే యమధర్మరాజు దూతలుగా భావించే కాకులకు ఈ రోజున ఆహారం పెడతారు. రెండో రోజు కుకర్‌ తిహార్‌.. అంటే ఈ రోజున కుక్కలకు నుదుటన తిలకం దిద్ది, పూలదండలు వేసి ఆహారాన్ని అందిస్తారు. ఇక మూడోరోజు గాయ్‌ తిహార్‌గా జరుపుకుంటారు. అంటే లక్ష్మీ దేవి స్వరూపంగా ఆవులను పూజిస్తారు. 

అతిపెద్ద వెలుగుల పండుగ!
భారత్‌ తరువాత.. అంతే ఘనంగా దీపావళి వేడుకలు జరిగే ప్రాంతం బ్రిటన్‌లోని లైసెస్టర్‌. ఇక్కడి బెల్‌గ్రేవ్‌ రోడ్డును ‘గోల్డెన్‌  మైల్‌’ అని పిలుస్తారు. పండుగ సమయంలో ఇక్కడి రహదారులను, పర్యాటక ప్రాంతాలను వేలాది విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తారు. వీటిని చూసేందుకు ఎంతోమంది పర్యాటకులు, స్థానికులు వస్తుంటారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శనలతో, బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు..

వెలుగులతో మెరిసే లిటిల్‌ ఇండియా!
సింగపూర్‌లోని లిటిల్‌ ఇండియా ప్రాంతం దీపావళి సమయంలో కొత్త అందాలను సంతరించుకుంటుంది. ముఖ్యంగా సెరంగూన్‌  రోడ్డును రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తారు. పండుగకు కొన్ని వారాల ముందే ఇక్కడ సందడి మొదలవుతుంది. ప్రత్యేక బజార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ వంటకాలతో వీధులన్నీ కళకళలాడుతాయి.

దేశం ఏదైనా.. భాష ఏదైనా.. దీపావళి పండుగ మనకు చెప్పేది ఒకటే.. ‘మనసుల్లోని చీకటిని తొలగించుకోవాలి. ప్రేమ, సంతోషం, స్నేహం, కరుణను పెంచుకోవాలి.. పంచుకోవాలి.’ అందుకే దీపావళి ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క ప్రాంతానికో మాత్రమే పరిమితమైన పండుగ కాదు. ప్రపంచమంతా వెలుగులు పంచే సంతోషాల వేడుక! 

ఇదీ చదవండి: భారత వధువరులుగా ఇటలీ ప్రేమికులు..వేదమంత్రాల సాక్షిగా ముడిపడిన బంధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement