పండుగ సీజన్‌లో ధన్‌తేరాస్‌కి ముందు పసిడి జోరందుకుంది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం గురువారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 2,200 పెరిగి రూ. 1,48,800కి చేరింది. అటు వెండి కూడా అదే బాటలో సాగింది. కేజీకి రూ. 1,500 పెరిగి రూ. 1,94,500 పలికింది. శుక్రవారం ధన్‌తేరాస్ సందర్భంగా జ్యుయలర్లు, రిటైలర్లు, స్టాకిస్టులు కొనుగోళ్లు జరపడంతో పసిడి, వెండి ధరలు పెరిగినట్లు ట్రేడర్లు తెలిపారు.
ఇన్వెస్ట్‌మెంట్‌పరంగా డిమాండ్ నెలకొనడం కూడా ఇందుకు దోహదపడినట్లు వివరించారు. గతేడాది ధన్‌తేరాస్ రోజున (అక్టోబర్ 18) బంగారం ధర. 1,32,400గా, వెండి ధర రూ. 1.7 లక్షలుగా నమోదైంది. అప్పటి నుంచి పసిడి రేటు 13 శాతం పెరిగిందని, దేశీయంగా ధర రూ.1.40–1.48 లక్షల మధ్య తిరుగాడుతోందని మోనార్క్ పీఎంఎస్ అసిస్టెంట్ ఫండ్ మేనేజర్ ధృవ్ జోగ్లేకర్ తెలిపారు. మరోవైపు, అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకి 65.12 డాలర్లు (సుమారు 2 శాతం) పెరిగి 4,125.25 డాలర్లకు చేరింది. వెండి కూడా 1 శాతం పెరిగి 52.73 డాలర్లు పలికింది.
ఇదీ చదవండి: రూ.2,100 కోట్ల లగ్జరీ హోటల్.. చివరకు అందుకే అమ్మేశారట!


