గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు పండుగ జోష్‌! | AUM of gold ETFs increased steadily from rS 1.58 lakh crore | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు పండుగ జోష్‌!

Nov 5 2026 4:36 AM | Updated on Nov 5 2026 4:36 AM

AUM of gold ETFs increased steadily from rS 1.58 lakh crore

ధర తగ్గడంతో మరిన్ని పెట్టుబడులు 

ఈటీఎఫ్‌ స్కీముల్లో ఏయూఎం రూ. 1.91 లక్షల కోట్లకు అప్‌

న్యూఢిల్లీ: పసిడి ధర ఇటీవల తగ్గిన నేపథ్యంలో బంగారం ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) వైపు మొగ్గు చూపుతున్నారు. దీనితో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల ఏయూఎం (నిర్వహణలోని ఆస్తులు) అక్టోబర్‌లో రూ. 1.91 లక్షల కోట్లకు చేరింది. గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో ఇది రూ. 1.58 లక్షల కోట్లుగా నమోదైంది. గడిచిన ఆరు నెలల వ్యవధిలో పసిడి ధర దాదాపు 12 శాతం క్షీణించగా, రాబోయే నెలల్లో ఇది పుంజుకోవచ్చన్న అంచనాల కారణంగా ఇన్వెస్టర్లకు పసిడిపై ఆసక్తి ఏర్పడుతోంది.  పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ కూడా కావడంతో పసిడికి డిమాండ్‌ మరింత డిమాండ్‌ నెలకొనవచ్చని నిపుణులు భావిస్తున్నారు. సెంట్రల్‌ బ్యాంకులు కొనుగోళ్లను కొనసాగించడం వల్ల వచ్చే 12 నెలల్లో ధరలు ఇంకా బలపడొచ్చని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) తమ తాజా త్రైమాసిక నివేదికలో పేర్కొంది.

రాబడులు రయ్‌...
గత 12 నెలల వ్యవధిలో బంగారం ఈటీఎఫ్‌లు 30% పైగా రాబడులు అందించాయి. నిప్పన్‌ ఇండియా గోల్డ్‌ ఈటీఎఫ్‌ బీస్, ఐసీఐసీఐ గోల్డ్‌ ఈటీఎప్‌ 30.7% చొప్పున రిటర్నులు ఇవ్వగా, ఇన్వెస్కో గోల్డ్‌ ఈటీఎఫ్‌ 30.6% రాబడిని అందించింది. స్టాక్‌ ఎక్సే్చంజీల మాధ్యమం ద్వారా డిజిటల్‌ యూనిట్ల రూపంలో బంగారంలో ట్రేడింగ్, ఇన్వెస్టింగ్‌ చేసేందుకు గోల్డ్‌ ఈటీఎఫ్‌లు ఉపయోగపడతాయి. వీటికి 99.5% స్వచ్ఛత గల పసిడి రేటు ప్రామాణికంగా ఉంటుంది. భౌతిక రూపంలోని బంగారంతో పోలిస్తే ఈటీఎఫ్‌లలో మేకింగ్‌ చార్జీల బాదరబందీ ఉండదు.  

పసిడి, వెండి భారీ జంప్‌ 
బంగారం రూ. 4,800, సిల్వర్‌ రూ. 9,000 అప్‌  
పండుగల సందర్భంగా కొనుగోళ్లు, అంతర్జాతీయంగా రికవరీతో పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ ప్రకారం బుధవారం ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ. 4,800 ఎగిసి రూ. 1,46,600కి పెరిగింది. అటు వెండి సైతం అదే బాటలో కేజీకి రూ. 9,000 పెరిగి రూ. 1.93 లక్షలకు చేరింది. డాలరు బలపడటం, బాండ్‌ ఈల్డ్‌లు పెరగడం, ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల కోతపై ఆశలు నెమ్మదించడం వల్ల ట్రేడర్లు అమ్మకాలకు దిగడంతో బంగారం ధర ఇటీవల కరెక్షన్‌కి లోనైనట్లు బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ హెడ్‌ (రీసెర్చ్‌) రాజీవ్‌ శరణ్‌ చెప్పారు. గతేడాది ధన్‌తేరాస్‌ సందర్భంగా పసిడి రేట్లు దాదాపు 65% ఎగియగా, అప్పటితో పోలిస్తే ప్రస్తుతం 5–7 శాతమే పెరిగినట్లు పేర్కొన్నారు. ధరలు కొంత స్థిరపడటంతో ప్రజలు మళ్లీ పసిడి వైపు చూసే పరిస్థితి ఏర్పడినట్లు వివరించారు. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సుకి 114 డాలర్లు (3%) బలపడి మళ్లీ కీలకమైన 4,000 డాలర్ల స్థాయిని దాటింది. 4,044 డాలర్లకు ఎగిసింది. వెండి కూడా 4.5% ర్యాలీ చేసి 52.03 డాలర్లకు పెరిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement