ఆఫర్ అలర్ట్
ఏ పుట్టలో ఏ పాము ఉందో కాదు ఏ లింక్‌లో ఏ స్కామ్ ఉందో తెలియదు. దీపావళి పండగ రోజుల్లో ఆన్‌లైన్ స్కామ్‌లు ఎక్కువగా జరుగుతుంటాయి. దీపావళి బోనస్, ఫ్రీ గిఫ్ట్, చాలా తక్కువ ధరలలో, క్విజ్ పూర్తిచేస్తే ఉచిత బహుమతులు... ఒకటా రెండా, ఎన్నెన్నో ఉచ్చులతో సైబర్‌వేటగాళ్లు పొంచి ఉన్నారు. అప్రమత్తంగా లేకపోతే ఈ పండగ రోజుల్లో విషాదాన్ని ఆన్‌లైన్‌లో కొని తెచ్చుకున్నట్లే!
కొద్ది రోజుల్లో దీపావళి. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లు సందడిగా ఉన్నాయి. ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, ఉచిత బహుమతి ఆఫర్లు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. పండగ ఉత్సాహాన్ని అదనుగా తీసుకొని సైబర్ నేరగాళ్లు చేతివాటం చూపిస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్‌లు, మోసపూరిత షాపింగ్ లింక్‌లు...మొదలైన వాటి ద్వారా కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
సర్కార్ వారి దీపావళి బోనస్... అసలు నమ్మవద్దు!
భారత ప్రభుత్వం దీపావళి బోనస్‌గా రూ.8000 ఇస్తుందని వస్తున్న వాట్సాప్ మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలని ప్రెస్ ఇన్‌ఫర్‌మేషన్ బ్యూరో(పీఐబి) హెచ్చరించింది. ఈ మెసేజ్‌లు కొనుగోలుదారులను ఒక నకిలీ వెబ్‌సైట్‌కు వెళ్లేలా చేస్తాయి. అక్కడ బోనస్ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ప్రయత్నం జరుగుతుంది. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయవద్దని, తెలియని వ్యక్తులతో వన్‌టైమ్ పాస్ వర్డ్ షేర్ చేయవద్దని పీఐబి హెచ్చరించింది. వచ్చిన మెసేజ్‌ను చూసి స్పందించడానికి ముందు అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌ల ద్వారా సంక్షేమ పథకాల ప్రామాణికత గురించి చెక్ చేసుకోవాలి. కేంద్రప్రభుత్వం పేరుతో వచ్చే అనుమానాస్పద మెసేజ్‌ల గురించి తెలిసినప్పుడు పీఐబి ఫ్యాక్ట్ చెక్ విభాగాన్ని సంప్రదించాలి.
చాలా చౌకగా అంటే... చల్లగా మోసం!
సుప్రసిద్ధ ప్లాట్‌ఫామ్‌లను పోలిన పేర్లు, డిజైన్‌లతో వెబ్‌సైట్‌లను నిర్మిస్తున్నారు సైబర్ మోసగాళ్లు. ఈ వెబ్‌సైట్‌ల లింక్‌లను సోషల్ మీడియా, డైరెక్ట్ లింక్‌ల ద్వారా షేర్ చేస్తారు. ‘చాలా చౌకగా’ అంటూ డబ్బు వసూలు చేస్తారు. వస్తువులను మాత్రం ఎప్పటికీ డెలివరీ చేయరు. క్యాష్‌బ్యాక్, రీఫండ్ ఇస్తామంటూ బ్యాంకింగ్ వివరాలు, ఒటీపీలను తెలుసుకొని ఖాతాల నుంచి డబ్బు కాజేస్తారు. అందుకే అధికారిక యాప్‌లు, అధికారిక వెబ్‌సైట్‌ల నుండి మాత్రమే షాపింగ్ చేయాలి. నమ్మశక్యం కానంత తక్కువ ధరల్లో, అధిక డిస్కౌంట్‌తో కూడిన ఆఫర్‌లపై జాగ్రత్తగా ఉండాలి. తెలియని ప్లాట్‌ఫామ్‌లలో సెన్సిటివ్ ఇన్‌ఫర్‌మేషన్‌ను షేర్ చేయవద్దు.
త్వరపడకండి... ఆలోచించండి!
→ ‘పరిమిత కాల ఆఫర్. త్వరపడండి’ అని కొనుగోలుదారులను తొందరపెడతారు మోసగాళ్లు. ఆఫర్ టైమ్ ముగిసిపోతుందనే తొందరలో, హడావుడిలో సంబంధిత వెబ్‌సైట్ ప్రామాణికత, విశ్వసనీయత గురించి తెలుసుకోవడం మరచిపోతాం. దీనివల్ల మోసపోతాం. దీపావళి ఆఫర్లు, బహుమతులు, క్యాష్‌బ్యాక్‌ల పేరుతో క్యూఆర్ కోడ్‌లు పంపుతారు. ఆ కోడ్‌ను స్కాన్ చేసి, యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే ఖాతా ఖాళీ అవుతుంది. తెలియని వ్యక్తులు పంపిన క్యూఆర్ కోడ్‌ను ఎప్పుడూ స్కాన్ చేయవద్దు.
→ బ్యాంకులు, షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లు, పేమెంట్ యాప్‌ల పేరుతో ‘గిఫ్ట్’ అని ఊరిస్తారు. రివార్డ్‌లను క్లెయిమ్ చేసుకోవడానికి లింక్ మీద క్లిక్ చేయమని, ఫామ్ పూర్తి చేయమని అడుగుతారు. బహుమతి సొమ్మును రిలీజ్ చేయడానికి రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజులను అడుగుతారు. అలాంటి సమయంలో తొందరపడకుండా సంబంధిత కంపెనీ అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా నిజానిజాలు ధ్రువీకరించుకోవాలి. రివార్డులను క్లెయిమ్ చేసుకోవడానికి తెలియని వ్యక్తులకు ఎప్పుడూ డబ్బులు పంపవద్దు. ఓటీపి, యుపీఐ పిన్, కార్డ్ సీవీవీలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.
క్విజ్ పూర్తి చేస్తే...ఖాతా ఖాళీ అవుతుంది!
→ ‘క్విజ్ పూర్తి చేస్తే ఉచిత దీపావళి బహుమతులు’ అంటూ అమెజాన్ నుంచి ఒక పాప్–అప్ కనిపించిందా? ఈ సీజన్‌లో సాధారణంగా జరిగే మోసాలలో ఇదొకటి. ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన లోగోలు నకిలీ–ఇ కామర్స్ సైట్‌లపై కొనుగోలుదారులలో నమ్మకం కలిగేలా చేస్తాయి.
→ అడ్రస్ వెరిఫికేషన్, రీ–డెలివరీ అంటూ మెసేజ్‌లు వస్తుంటాయి. ‘నామమాత్రపు డెలివరీ ఛార్జీ’ పేరుతో ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఫిషింగ్ పేజీలోకి వెళుతుంది. తద్వారా మోసానికి గురవుతాం. దీన్ని నివారించడానికి లాజిస్టిక్స్, ఇ–కామర్స్ కంపెనీల వెబ్‌సైట్, యాప్‌ల ద్వారా మాత్రమే డెలివరీ స్టేటస్‌ను తెలుసుకోవాలి. ర్యాండమ్ టెక్ట్స్ మెసేజ్‌లతో వచ్చిన లింక్‌ల ద్వారా డెలివరీ ఛార్జీలు చెల్లించవద్దు. అనుమానాస్పద ఎస్‌ఎంఎస్‌లతో వచ్చిన ఫోన్ నంబర్‌లకు కాల్ చేయడానికి బదులుగా అధికారిక కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించాలి.
ఆ పేజీలోకి వెళితే... అంతే!
→ టపాసులు, అలంకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్స్ గిఫ్ట్ హ్యాంపర్స్‌పై భారీ తగ్గింపు ధరలను ప్రకటిస్తారు. ఆర్డర్ బుక్ చేసుకోవడానికి కొద్ది మొత్తం లేదా పూర్తిగా డబ్బులు చెల్లించమంటారు. చెల్లించిన తరువాత ఆర్డర్‌ను ధ్రువీకరించకుండా అన్ని రకాల సంప్రదింపులను నిలిపివేస్తారు. దీన్ని నివారించడానికి...పేరున్న ప్లాట్‌ఫామ్‌ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. అమ్మకందారుల రేటింగ్‌ను ధ్రువీకరించుకోవాలి. సురక్షితమైన చెల్లింపు పద్ధతులను అనుసరించాలి. కంపెనీ సేల్స్ హిస్టరీ పరిశీలించాలి. కస్టమర్ రివ్యూలను చదవాలి.
→ ఒక ఆఫర్‌ను అన్‌లాక్ చేయడానికంటూ ఎస్‌ఎంఎస్‌ను పలు గ్రూప్‌లకు, కాంటాక్ట్‌లకు ఫార్వర్డ్ చేయమని కోరుతారు. ఆ లింక్‌లను క్లిక్ చేస్తే హానికరమైన పేజీలలోకి వెళతాం. అక్కడ వ్యక్తిగత వివరాలు అడుగుతారు. ఆ తరువాత ఈ వివరాలను మోసాల కోసం ఉపయోగిస్తారు. వాట్సప్‌లో వచ్చిన ప్రమోషనల్ మెసేజ్‌పై స్పందించడానికి ముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలి. అన్‌వెరిఫైడ్ గిఫ్ట్, డిస్కౌంట్ లింక్‌లను ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దు.
సీయిఆర్‌టి హెచ్చరిక
నకిలీ లింక్‌లపై క్లిక్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీయిఆర్‌టి–ఇన్) కొనుగోలుదారులను హెచ్చరించింది. మహిళలను లక్ష్యంగా చేసుకొని ప్రధానంగా ఈ మోసాలు జరుగుతున్నట్లు సీయిఆర్‌టీ తెలియజేసింది. ఫిషింగ్ వెబ్‌సైట్‌లకు చైనీస్.ఇఎన్ డొమైన్ ఎక్స్‌టెన్షన్‌లు ఉన్నందున మోసపూరిత లింక్‌లు, మెసేజ్‌లలో ఎక్కువగా చైనా నుంచే వస్తున్నాయని తెలియజేసింది. ‘నిజమైన కంపెనీ మీ లాగిన్ వివరాలను అడగదు అని గుర్తుంచుకోండి’ అని చెప్పింది.
పండగ రోజుల్లో వారికి పండగే!
దీపావళి పండగ వాతావరణాన్ని ఆసరా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ఇ–కామర్స్ పరిశ్రమ, బ్రాండ్‌ల పేర్లను దెబ్బతీసే మోసాలు జరుగుతున్నాయని క్లౌడ్‌సెక్ పరిశోధన బృందం నివేదిక తెలియజేసింది. ఫేస్‌బుక్ యాడ్ లైబ్రరీలో ఫిషింగ్ కార్యకలాపాల కోసం ఉద్దేశించిన 828 విభిన్న డొమైన్‌లను క్లౌడ్‌సెక్ గుర్తించింది. టైపోస్క్వాటింగ్‌లాంటి పద్ధతులను ఉపయోగించి నకిలీ డొమైన్‌పై కొనుగోలుదారులలో నమ్మకం కలిగేలా చేస్తున్నారని, ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని నివేదిక తెలియజేసింది.


