చైతన్యంతోనే డిజిటల్‌ మోసాలకు చెక్‌ | Sakshi Guest Column On Digital frauds Issue | Sakshi
Sakshi News home page

చైతన్యంతోనే డిజిటల్‌ మోసాలకు చెక్‌

Apr 27 2026 12:33 AM | Updated on Apr 27 2026 12:33 AM

Sakshi Guest Column On Digital frauds Issue

భారతదేశంలో డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ ఎంత వేగంగా విస్తరిస్తోందో, అదే స్థాయిలో డిజిటల్‌ మోసాలు ప్రబలుతున్నాయి. 2021లో నమోదైన డిజిటల్‌ మోసాల సంఖ్య 2.6 లక్షలు కాగా, నష్టం రూ. 551 కోట్లు. అదే 2025 నాటికి ఆ సంఖ్య ఏకంగా 28 లక్షల కేసులకు, నష్టం దాదాపు రూ. 23,000 కోట్లకు పెరిగింది. ఈ సమస్యను అరికట్టేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నాలుగు ప్రతిపాదనలతో కూడిన ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసింది. దీనిపై మే 8 లోగా అభిప్రాయాలను తెలియజేయాలని పౌరులను కోరింది. 

ఆర్‌బీఐ ఉద్దేశం మంచిదే. కానీ కొద్దిమంది మోసగాళ్లను పట్టుకోవడానికి కోట్లాది మంది సామాన్య ప్రజలను, చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురిచేసేలా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. నేటి డిజిటల్‌ మోసాలన్నీ సిస్టమ్‌ హ్యాక్‌ చేయడం వల్లనో, పాస్‌వర్డ్‌లు దొంగిలించడం వల్లనో జరిగేవి కావు. సీబీఐ ఆఫీసర్లమని బెదిరించి హైదరాబాద్‌లో ఒక వృద్ధురాలి జీవితకాల పొదుపును కాజేస్తున్నారు. కస్టమ్స్‌ అధికారి అని చెప్పి ఒక 30 ఏళ్ళ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దగ్గర 2, 3 దఫాలుగా రూ.80,000 దోచేశాడు ఇంకో ప్రబుద్ధుడు. అవగాహన లేని సామాన్యులను భయాందోళనకు గురిచేసి మోసగాళ్లు డబ్బులు బదిలీ చేయించుకుంటున్నారు.

‘ఒక గంట నిలుపుదల’ సమంజసమా? 
రూ. 10,000 దాటిన ప్రతి ఒక్కరి వ్యక్తిగత లావాదేవీలను, అలాగే చిన్న వ్యాపారుల ఖాతాలకు వెళ్లే డబ్బును ఒక గంట పాటు నిలిపివేయాలని ఆర్‌బీఐ మొదటి ప్రతిపాదన సూచిస్తోంది. మోసగాళ్ల నుంచి తప్పించుకోవడానికి ఈ గంట సమయం ఉపయోగపడుతుందని ఆర్‌బీఐ ఆలోచన. కానీ, ప్రతిరోజూ సరుకుల కోసం పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి సప్లయర్లకు డబ్బు పంపే చిన్న వ్యాపారి పరిస్థితి ఏమిటి? వెంటనే జరిగే యూపీఐ లావాదేవీలే అప్పుడప్పుడు ఒక రోజు కూడా తీసుకుంటాయి. అలాంటిది అధికారంగా గంట నిలుపుదల చేస్తే ఇంకా ఎంత సేపు వేచి చూడాల్సి వస్తుందో! టెక్నాలజీలో క్వాంటమ్‌ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు స్థాయికి చేరుకున్న మనం, ఎవరో కొందరు మోసగాళ్లను అరికట్టాలని అందరినీ ఇలా 2 దశాబ్దాల వెనక్కు తీసుకువెళ్లి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు?

ఆర్బీఐ 10,000 రూపాయలు దాటిన ప్రతి ఒక్క లావాదేవిని నిలిపివేయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. మోసగాళ్లు పలు దఫాలుగా 9,999 పంపీయమని అడగొచ్చు. అప్పుడు ఆర్బీఐ రెండవ 9,999 లావాదేవీని నియంత్రిస్తుందా? దీనివల్ల ప్రజలు మళ్లీ నగదు లావాదేవీలు నిర్వహించే ఆస్కారం లేకపోలేదు. ఇది భారత ప్రభుత్వ డిజిటల్‌ ఇండియా సిద్ధాంతానికి విరుద్ధం. దీనికి ప్రజలను చైతన్యవంతులను చేయడమే అసలైన పరిష్కారం. ప్రాంతీయ భాషల్లో ‘జాతీయ మోసాల అవగాహన పరీక్ష’ను ప్రవేశపెట్టాలి. ఎలాంటి సమస్య అయినా అవగాహనతో పరిష్కారం అవుతుంది. 

మ్యూల్‌ ఖాతాలకు మొదట్లోనే అడ్డుకట్ట
కరెంటు ఖాతాల వార్షిక జమ పరిమితిని రూ. 25 లక్షలకు కుదించడం, అంతకు మించితే ఖాతాను స్తంభింపజేసి విచారణ జరపడం ఆర్‌బీఐ మూడో ప్రతిపాదన. ఈ నిబంధన వల్ల నేరస్థుల కంటే సామాన్య కాంట్రాక్టర్లు, ఐటీ డెవలపర్లు, చిరు వ్యాపారులే ఎక్కువ నష్టపోతారు. ఇప్పటికే కరెంటు ఖాతా ప్రారంభించడానికి చిన్న మధ్య తరహా వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఖాతాలు ఫ్రీజ్‌ చేసే విచక్షణాధికారం బ్రాంచ్‌ అధికారుల చేతిలో పెడితే, అది సామాన్యుల పట్ల వేధింపులకు దారితీస్తుంది. ఇది భారత ప్రభుత్వం చెప్తున్న సులభతర వ్యాపార విధానానికి విరుద్ధం. నూతన వ్యాపార ఖాతాలకు ఆన్‌లైన్‌ పోలీస్‌ వెరిఫికేన్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేయాలి. అప్పుడు నేర చరిత్ర ఉన్న మోసగాళ్లు గేటు వద్దే ఆగిపోతారు. వాళ్లకు సహకరిద్దామనే మ్యూల్‌ అకౌంట్‌ నిర్వాహకులు పోలీసులపై ఉండే సహజమైన భయంతో అకౌంట్ల నిర్వహణకు ముందుకు రారు. నిజమైన వ్యాపారులకు ఖాతాలు సులభంగా లభిస్తాయి.

వృద్ధులకు కావలసింది గౌరవం, సంరక్షకుడు కాదు!
70 ఏళ్లు పైబడిన వారు రూ. 50,000కు మించి లావాదేవీ చేయాలంటే కుటుంబ సభ్యుల (నమ్మదగిన వ్యక్తి) అనుమతి తప్పనిసరి చేయడం మరో ప్రతిపాదన. ఈ నిబంధన వారిని కుటుంబ సభ్యుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేస్తుంది. మన సమాజంలో వృద్ధులు కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఆర్థిక మోసాలకు గురవుతున్న సందర్భాలు అనేకం. దీనికి బదులుగా, ‘లైసెన్స్‌డ్‌ ట్రస్టెడ్‌ అథెంటికేటర్‌ సర్వీస్‌’ను నామమాత్రపు రుసుముతో ప్రవేశపెట్టాలి. దారిద్య్ర రేఖ దిగువ ఉన్నవాళ్లకు ఈ సేవ ఉచితంగా అందించాలి. వీరు వృద్ధులతో వారి సొంత భాషలో మాట్లాడి లావాదేవీని ధ్రువీకరించాలి. అప్పుడు వృద్ధుల ఆత్మగౌరవం దెబ్బతినదు. ఈ నూతన సేవ వల్ల ఇంకొన్ని ఉద్యోగాలు సృష్టించినట్టు కూడా అవుతుంది.

డిజిటల్‌ మోసాల సమస్య తీవ్రత దృష్ట్యా ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు అవసరమే. కానీ, అవి సామాన్యుల స్వేచ్ఛను హరించకూడదు. ప్రజలకు సరైన సాధనాలు అందిస్తే, వారు సరైన నిర్ణయాలు తీసుకోగలరని విధాన నిర్ణేతలు విశ్వసించాలి.
– బూరుగుపల్లి మఠం అఖిల్‌ ‘ యువ ఆంట్రప్రెన్యూర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement