బీజేపీ నేత ఇంట విషాదం : ఒక్కగానొక్క కొడుకు పెళ్లి రోజే, శవయాత్ర
మాడిన రొట్టెలు, ఆస్తికోసం తగాదా, తీవ్ర వేధింపులు
సాక్షి, లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో బీజేపీ నేత కుమారుడు, 26 ఏళ్ల ప్రబల్ గుప్తా తొలి వివాహ వార్షికోత్సవానికి ఒక రోజు ముందు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. తన మరణానికి భార్య స్నేహా గుప్తా ,ఆమె కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ ఒక వీడియోను రికార్డ్ చేశాడు. తనను శారీరకంగా, మానసికంగా వేధించారని ఆరోపించారు.
కంకర్ ఖేడా మండల్ ఉపాధ్యక్షుడు రాజీవ్ గుప్తా కుమారుడైన ప్రబల్ గుప్తా (26), ఘాజియాబాద్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారు. ప్రబల్‌కు 2025 నవంబర్ 2న, టీపీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోహ్తా రోడ్డులో ఉన్న రిషినగర్‌కు చెందిన స్నేహా గుప్తాతో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది రోజుల నుంచే వారిద్దరి మధ్య వివాదం నడుస్తోంది. శనివారం వారు మహిళా పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్‌కు వెళ్లారు. కౌన్సిలింగ్ సమయంలో, అతని భార్యకు మద్దతుగా నిలిచిన మహిళా ఇన్‌స్పెక్టర్, ఒక కానిస్టేబుల్ ప్రబల్‌పై ఒత్తిడి తెచ్చి, అతని పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి.
స్కూటర్‌పై ఇంటి నుంచి బయలుదేరి, మార్గమధ్యంలో విషపదార్థం సేవించాడు. చనిపోయే ముందు తీసిన వీడియోలో తన భార్య స్నేహ గుప్తా , తండ్రి రాజన్ గుప్తా, సోదరుడు సార్థక్ గుప్తా, అత్త రీనా గుప్తా, ఇతర బంధువులే కారణమని ఆరోపించాడు. కుటుంబ సభ్యులే తన ఆత్మహత్యకు ప్రధాన కారణమంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. నవంబర్ 1న విషం తాగి చికిత్స పొందుతూ మరణించారు. విషం తాగడానికి ముందు చాలా ఆవేదనతో ప్రావల్ ఒక వీడియో రికార్డు చేశారు.
సీనియర్ పోలీస్ అధికారి శివ్ ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం... నవంబర్ 1న విషం తాగిన ప్రావల్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ నవంబర్ 2 రాత్రి మరణించారు. వివాహమైన నాటి నుండి విభేదాలు ఉన్నాయని, ప్రస్తుతం అన్ని కోణాల్లో కేసు విచారణ జరుపుతున్నామని తెలిపారు.
Impact of Gender_biased laws👇 Prabal Gupta, Son of BJP Leader Rajiv Gupta from Meerut in UP #ended his life because of torture by his wife Sneha/ In Laws and Sub Inspector Mukesh Kumar of @meerutpolice. Rajiv Gupta also suffered a heart attack @HMOIndia https://t.co/xr2LJGYZzV
— Being Man in India (@ForJustice_SIFF) November 2, 2026
వీడియోలో ఏం చేప్పాడంటే..
పెళ్లి అయిన దగ్గర్నుంచి భార్య స్నేహ తనను, తన తల్లిదండ్రులను శారీరకంగా, మానసికంగా వేధించేదని ప్రావల్ తెలిపారు. తన ఆస్తిని ఆమె పేరిట రాయాలని తీవ్ర ఒత్తిడి తెచ్చేదని ఆరోపించారు. అంతేకాకుండా, ఆమె ఉద్దేశపూర్వకంగానే తనకు మాడి పోయిన రొట్టెలు వడ్డించేదని, అదేమని అడిగితే గొడవకు దిగేదని చెప్పాడు.పెళ్లయ్యాక తల్లిదండ్రుల నుంచి వేరుగా ఉండాలని ఒత్తిడి చేయడంతో ఇల్లు మారానని, కానీ పాప పుట్టిన తర్వాత మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వెళ్దామంటే భార్య తీవ్రంగా నిరాకరించి గొడవ పడేదని చెప్పారు. పాపను చూసుకోవడానికి వచ్చిన తన తల్లిపై కూడా ఆమె చేయి చేసుకుందని, తన సోదరి క్యారెక్టర్‌ను వేలెత్తి చూపిందని వాపోయారు. తాను చనిపోయిన తరువాత తన బిడ్డ బాధ్యతలను తన తల్లిదండ్రులకు అప్పగించాలని కూడా కోరారు. మొత్తం జీతాన్ని భార్యకే ఇచ్చేవాడినని, అయినప్పటికీ ఆమె ప్రవర్తన మారలేదని అన్నారు. ఆమె తండ్రి రాజన్ గుప్తా ప్రోద్బలంతో, తనపై అబద్ధపు కేసులు పెడతానని భార్య, ఆమె కుటుంబం బెదిరించినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 31న ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌లో జరిగిన కౌన్సెలింగ్‌లో తనపై తాగుబోతునని భార్య తప్పుడు ఆరోపణలు చేసిందని ప్రావల్ ఆవేదన వ్యక్తం చేశారు.
కన్నీటి పర్యంతమైన తండ్రి
ప్రవాల్ మరణంతో అతని తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఏడాది క్రితం ఏ రోజైతే కొడుకు పెళ్లి ఊరేగింపు తీశానో, సరిగ్గా అదే రోజున ఇప్పుడు కొడుకు శవయాత్ర చూడాల్సి వచ్చిందని తండ్రి రాజీవ్ గుప్తా కన్నీరుమున్నీరయ్యారు. ప్రావల్ తిరిగొస్తానంటే "పో పోయి చావు" అని కోడలు అందరి ముందే అవమానించిందని ప్రావల్ తల్లి కిరణ్ గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు . కోడలు, ఆమె కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని, మనవరాలిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
తండ్రికి గుండెపోటు
తన ఏకైక కుమారుడి మరణవార్త విన్న వెంటనే తండ్రి రాజీవ్ గుప్తాకు గుండెపోటు రావడంతో, కుటుంబ సభ్యులు ఆయన్ను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.


